ప్రదర్శనలో పాల్గొన్న సిఎం, డిప్యూటీ సిఎం, మంత్రులు , ఎమ్‌ఎల్‌ఎలు
ఐజ్వాల్ : హింసాత్మక ఘర్షణలతో భగ్గుమంటున్న మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జో తెగ ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తూ మిజోరాంలో మంగళవారం వేలాది మంది ప్రదర్శన నిర్వహించారు. ఐదు ప్రధాన స్వచ్ఛంద సంస్థలు కలిసి మిజోరాం రాజధాని నగరం ఐజ్వాల్ సహా ఇతర ప్రాంతాల్లో ఈ ప్రదర్శనలను నిర్వహించాయి. ఎన్‌జిఒ కో ఆర్డినేషన్ కమిటీ నేతృత్వంలో సెంట్రల్ యంగ్ మిజో అసోసియేషన్ (సివైఎంఎ), మిజో జిర్లాయి పాల్ (ఎంజెడ్‌పి) లతో పాటు ఐదు స్వచ్ఛంద సంస్థ్లల సహకారంతో ఈ ప్రదర్శనలు సాగాయి.
Also Read:
ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి
ఐజ్వాల్‌లో నిర్వహించిన ప్రదర్శనలో మిజోరాం ముఖ్యమంత్రి జోరాంతంగ, ఉప ముఖ్యమంత్రి టాన్‌లుయియా, మంత్రులు, ఎమ్‌ఎల్‌ఎలు పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు. మణిపూర్‌లో హింసాత్మక ఘర్షణలను నిరసిస్తూ వేలాది మంది సామాన్య ప్రజలు ప్లకార్డులను ప్రదర్శించారు. ఇటీవల కాలంలో ఇంత భారీ ప్రదర్శన ఇదే కావడంతో ఈ నగరంలో జనజీవనం స్తంభించింది. ఈ నిరసనకు సంఘీభావంగా అధికార పార్టీ ఎంఎన్‌ఎఫ్ కార్యాలయాలను మూసివేశారు. ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జోరాం పీపుల్స్ మూవ్‌మెంట్ కూడా తమ కార్యాలయాలను మూసివేశాయి. ఎన్‌జిఒ కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ ఆర్ లాల్న్‌ఘెట ర్యాలీలో కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మణిపూర్‌లో హింసను నివారించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
భారత దేశం తమను భారతీయులుగా పరిగణిస్తే, తక్షణమే మణిపూర్ లోని జో ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఇద్దరు మహిళలను ఊరేగించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మణిపూర్ లోని కుకీలతో మిజోరాం లోని మిజోలకు జాతి సంబంధిత అనుబంధాలు ఉన్నాయి. అదే విధంగా బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ కొండల్లో ఉంటున్న కుకీచిన్న్, మయన్మార్ లోని చిన్స్‌తో కూడా మిజోలకు జాతి సంబంధిత బాంధవ్యాలు ఉన్నాయి. వీరందరినీ కలిపి జో తెగగా గుర్తిస్తుంటారు. నిరసన ప్రదర్శనల సందర్భంగా మిజోరాంలో భద్రత కట్టుదిట్టం చేశారు.