చైనాలో అభివృద్దికి డేంగ్ జియో పింగ్… తెలంగాణలో కెసిఆర్ ఆదర్శం: వినోద్‌కుమార్
మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రపంచ శాంతి ఎంతో అవసరమని విద్వేషాలకు చోటు ఇవ్వకూడదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొనారు. శనివారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ఇండియా చైనా మిత్ర మండలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ ప్రపంచంలో కొన్ని దేశాల మధ్య ఘర్షణలు జరుగుతుండడం బాధాకరమని ఘర్షణలు విధ్వంసం జరగడం తప్ప సాధించేది ఏమి ఉండదన్నారు.
ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా శాంతియుత వాతావరణం ఉంటే అభివృద్ధి సాధ్యమని, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉండడంతో ప్రపంచ దేశాలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నారని వివరించారు. ప్రభుత్వాల తీరు ఎలా ఉన్నా చైనా, ఇండియా ప్రజలు మాత్రం చిరకాల మిత్రులు అని వెల్లడించారు. ప్రణాళికా బద్ధంగా చైనా దేశాన్ని అభివృద్ధి చేయడంలో డెంగ్ జియో పింగ్ ఆదర్శంగా నిలిచారని అదే బాటలో సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపారని ప్రశంసించారు. ఇండియా – చైనా మిత్ర మండలి జాతీయ అధ్యక్షుడు భాస్కరన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో జగ్జిత్ సింగ్, రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి, పర్వత రెడ్డి, నిఖిలేశ్వర్, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.