Saturday, March 15, 2025

శాంతి చర్చలు, ప్రశ్నార్థకాలు..

- Advertisement -
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఫిబ్రవరి 28న కలిసి వాగ్వాదానికి దిగి, వైట్‌హౌస్ నుంచి అర్థంతరంగా వెళ్లిపోయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, సరిగా పది రోజుల తర్వాత ట్రంప్ ఉన్నతాధికారులతో సౌదీ అరేబియాలో సమావేశమై రష్యాతో కాల్పుల విరమణకు అంగీకరించారు. ఆయనకు అంతకన్న గత్యంతరం లేకపోయింది కూడా. ఆ పరిస్థితి ముందే తెలిసిన ట్రంప్‌తో పాటు, జెలెన్‌స్కీకి గట్టి మద్దతుదారులైన యూరోపియన్ దేశాలు, ఇతరత్రా మొత్తం ప్రపంచం కూడా అదే అభిప్రాయంతో ఉంటూ వచ్చింది.
చివరకు సౌదీలోని జెడ్డా నగరంలో 11వ తేదీన చర్చలు జరగగా, అమెరికా, ఉక్రెయిన్ కలిసి అదే రోజున సంయుక్త ప్రకటన విడుదల చేసాయి. అందులో ఉన్నదేమిటి, దాని అర్థం ఏమిటి, ఆ ప్రకారం ముందుకుపోగల అవకాశాలేమిటన్నది ముందుగా చూసి, తక్కిన చర్చ తర్వాత చేయవచ్చు. ప్రకటన పాఠాన్ని పూర్తిగా గమనించినపుడు, అందులో ఈ ముఖ్యాంశాలు కనిపిస్తాయి. ఒకటి, శాశ్వత శాంతి దిశగా సాగే ప్రక్రియను ప్రారంభించేందుకు ఇది తగిన సమయం. రెండు, మధ్యంతరంగా 30 రోజుల పాటు కాల్పుల విరమణ వెంటనే జరగాలన్న అమెరికా ప్రతిపాదనను ఆమోదించేందుకు ఉక్రెయిన్ సంసిద్ధతను వ్యక్తపరచింది. విరమణను అన్ని పక్షాల అంగీకరంతో పొడిగించ వచ్చు. అయితే ఇదంతా రష్యా ఆమోదం, ఉక్రెయిన్‌తో పాటుగా ఏకకాలంలో ఆచరణపై ఆధారపడి ఉంటుంది. మూడు, శాంతి సాధనకు రష్యా కూడా ఇందుకు అనుగుణంగా స్పందించటమన్నది కీలకం అనే మాటను రష్యా దృష్టికి అమెరికా తీసుకువెళుతుంది. నాలుగు, ఉక్రెయిన్‌కు నిలిపివేసిన రక్షణ సహాయాన్ని, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అమెరికా వెంటనే పునరుద్ధరిస్తుంది. అయిదు, ఉక్రెయిన్ దీర్ఘకాలిక భద్రత కోసం శాశ్వత శాంతి సాధనకు అమెరికా, ఉక్రెయిన్‌లు చర్చలు ఆరంభిస్తాయి. శాంతి సాధన ప్రక్రియలో యూరోపియన్ దేశాలకు భాగస్వామ్యం ఉంటుంది. ఆరు, ఉక్రెయిన్‌లోని కీలకమైన ఖనిజాల వెలికితీత, వినియోగంపై సమగ్రమైన ఒప్పందం వీలైనంత త్వరలో జరగాలని ఇరుదేశాలు అంగీకరించాయి. ఆ క్రమంలో ఉక్రెయిన్ ఆర్థికాభివృద్ధి జరగటమేగాక, దీర్ఘకాలిక భద్రతకు హామీ ఏర్పడుతుంది.
జాగ్రత్తగా పరిశీలించినపుడు దీనంతటిలో కొత్త ఏమీ కన్పించదు. సారాంశం మొత్తం ట్రంప్ గతంలో ప్రతి పాదించిందే. ఏ ఒప్పందమైనా, దాని అమలు అయినా రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకారంపైనే ఆధారపడి ఉంటుంది. రష్యా ఆక్రమణలో గల తమ భూభాగాలను తిరిగి ఇప్పించే హామీని ట్రంప్ లోగడ ఇవ్వలేదు, ఇప్పటికీ ఇవ్వటం లేదు. పైగా, వాటిని రష్యాకు వదలుకోక తప్పదన్న సూచన జెలెన్‌స్కీకి మొదటి నుంచి చేస్తున్నారు. వదలుకునేందుకు సిద్ధమన్నది జెలెన్‌స్కీ వైఖరి కూడా. తన యూరోపియన్ మద్దతుదారుల మాటా అదే. కనుక అందుకు అమెరికా, రష్యా, ఉక్రెయిన్ చర్చలతో ఆమోద ముద్ర పడుతుందనుకోవాలి. అయితే, ఏ భూభాగాలు అన్న ప్రశ్న సమస్యాత్మకం కావచ్చు. రష్యా ఆక్రమించిన క్రిమియాతో పాటు, తూర్పున రష్యన్ జాతీయులు మెజారిటీలో గల దోన్‌బాస్ ప్రాంతంలో అధిక భాగం వారికి స్వాధీనం అయినందున వాటిపై బేరసారాల ప్రసక్తి ఉండదు. కాని, మొత్తం దోన్‌బాస్‌ను తమ కివ్వవలసిందేనని అక్కడి రష్యన్ జాతీయులపై తీవ్రమైన అణచివేతలు జరుగుతున్నాయన్నది రష్యా పట్టుదల. ఈ ప్రశ్నపై రాజీ సాధ్యమా? అయితే, ఏవిధంగా? లేక అందుకోసం రష్యా తన యుద్ధాన్ని కొనసాగిస్తుందా? అన్నవి ప్రశ్నలు.
మరొక భౌగోళికమైన ప్రశ్న, ఉత్తర సరిహద్దులోని రష్యా ప్రాంతమైన కుర్‌స్క్‌లో కొంత మేర ఉక్రెయిన్ ఆక్రమించుకోవటం. రష్యాతో చర్చలలో దానిని బేరసారాలకు ఉపయోగించటం ఉక్రెయిన్ పథకం. కాని అందుకు ససేమిరా అన్న రష్యా, అందులో సుమారు 70 శాతాన్ని ఇప్పటికే తిరిగి వశపరుచుకున్నది. అక్కడ ఇంకా మిగిలిన ఉక్రెయిన్ సేనలు రోజు రోజుకు బలహీనపడి ఉపసంహరించుకుంటున్నాయి. ఆ పరిస్థితిలో కుర్‌స్క్ విషయం అసలు చర్చలలోకి వచ్చేందుకైనా రష్యా అంగీకరించదు. అక్కడ రష్యా దాడులు గత పది రోజులలో ఉధృతం కాగా, ఏ దేశమైనా అట్లాగే చేస్తుందన్నది ట్రంప్ చేసిన వ్యాఖ్య. దానిని బట్టి జెలెన్‌స్కీకి కుర్‌స్క్ ఒక తరుపు ముక్క కాగలదేమో ఎవరైనా ఊహించవచ్చు.
యుద్ధంలో తాము స్పష్టంగా, ఇక తిరుగులేకుండా ఓడిపోతున్నట్లు కొన్ని మాసాల క్రితమే అర్థమైన జెలెన్‌స్కీ, ఉక్రెయిన్‌కు భవిష్యత్తు రక్షణలపైనే దృష్టిపెట్టి మాట్లాడటం మొదలుపెట్టారు. బైడెన్ అధ్యక్షునిగా ఉన్నంత కాలం అమెరికాతోపాటు యూరప్ ఎన్నెన్ని ఆయుధాలు, నిధులు అందజేసి రష్యా పై ఎన్ని ఆంక్షలు విధించినా ఉపయోగం లేకపోవటం ఇందుకు కారణం. ట్రంప్ రాకతో ఇక అన్ని ఆశలు ఆవిరయ్యాయి. తానింకా గెలవకముందు నుంచే యుద్ధానికి, జెలెన్‌స్కీకి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు పెట్టిన ట్రంప్, ఎన్నికైన తర్వాత మరింత తీవ్రంగా మాట్లాడారు. జెలెన్‌స్కీయే గాక, స్వయంగా తమ నాయకత్వాన గల నాటో దేశాల రాయబారులనూ తిరస్కరించారు. అదంతా ఫిబ్రవరి 28న జెలెన్‌స్కీతో ముఖాముఖి సమావేశంలో ప్రతిఫలించింది. ట్రంప్ తీరు పట్ల ఆయన, యూరోపియన్ నాయకుల నిరసనలైతే చాలానే వెలిబుచ్చారు గాని, చేయగలిగింది శూన్యమని ఉక్రెయిన్ అధ్యక్షునికి ఒక రోజైనా తిరగక ముందే బోధపడింది. నిజానికి ఆనాటి వాగ్వాద సమయంలో స్వయంగా ట్రంప్ “బేరసారాలు ఆడేందుకు మీ వద్ద ఏశక్తీ లేదు” (యూ డోంట్ హ్యావ్ ఎనీ కార్డ్) అని మీడియా సాక్షిగా హెచ్చరించారు. తను ఆ మాట అంతకు ముందు కూడా అన్నదే. పైగా, పుండు మీద కారం చల్లినట్లు, అటువంటి కార్డ్ పుతిన్‌కు ఉన్నాయన్నారు. భూభాగాలు వదలుకోవాలనటానికి అదొక కారణం. తన వైపునుంచి ఇంతకాలం ఏమీ చేయలేకపోయిన యూరప్, ఇపుడు సైతం నిస్సహాయంగా మాటలు జోరు చూపటం తప్ప ఏమీ చేయలేదన్నది అందరికీ తెలుసు.
ఈ పరిస్థితులన్నింటి మధ్య జెలెన్‌స్కీ, తమ భవిష్యత్తు రక్షణమే హామీలిస్తే చాలుననటం మొదలుపెట్టారు. అటువంటివేమీ ఇవ్వలేమని ట్రంప్ స్పష్టం చేసిన ఫిబ్రవరి 28న ఆయనతో వాదనకు దిగి భంగపడ్డారు. చివరకు ఇపుడు జెడ్డాలో, అటువంటి హామీలు లేకుండానే శాంతి చర్చలకు సిద్ధపడి, కాల్పుల విరమణకు అంగీకరించారు. ఇందుకు సంబంధించి గమనించవలసినవి రెండున్నాయి. రక్షణ కోసం ప్రత్యక్ష హామీలు ఇచ్చేందుకు నిరాకరించిన ట్రంప్, ఉక్రెయిన్ తూర్పులోని ఖనిజ నిక్షేపాలను తమకు అప్పగించినట్లయితే వాటి తవ్వకం పనికోసం తామక్కడ ఉంటాం గనుక రష్యా దాడి చేయజాలదని, ఆ పనులు దీర్ఘకాలం పాటు సాగుతాయన్నపుడు అదే ఉక్రెయిన్‌కు రక్షణ కాగలదని ప్రతిపాదించారు. అనగా అటువంటి ఏర్పాటు పరోక్ష రక్షణ అవుతుందన్న మాట. ఈ నర్మగర్భ దౌత్యనీతిని గ్రహించని జెలెన్‌స్కీకి వైట్‌హౌస్ భంగపాటు తర్వాత అది అర్థమైనట్లున్నది. అందుకే అమెరికాతో ఖనిజ ఒప్పందానికి సిద్ధమని ఆ వెనుక ప్రకటించి ఇపుడు జెడ్డాలో సంసిద్ధత వ్యక్తపరచారు. ఆ విధంగా ట్రంప్ వ్యూహం సఫల మైంది. అదే విధంగా దీనంతటిలో ఉక్రెయిన్ నాటో సభ్యత్వ ప్రస్తావన లేకపోకపోవటం విశేషం. జెడ్డా ప్రకటనపై పుతిన్ స్వయంగా ఇంతవరకు స్పందించలేదు. అధ్యక్షుని స్థాయిలో అది జరగదు కూడా. జెలెన్‌స్కీ అంగీకరించినందున ఇక స్వయంగా తాను పుతిన్‌తో మాట్లాడగలనని ట్రంప్ చెప్పినందున, పుతిన్ అందుకోసం ఎదురు చూస్తుండవచ్చు. ఈ అంశాలపై ఇతరత్రా వారి మధ్య అవగాహన ఉండటం వేరే విషయం. అదట్లుంచి, సీనియర్ రష్యన్ అధికారులు గమనార్హమైన వ్యాఖ్యలు కొన్ని చేసారు. ట్రంప్ చర్యలు ఆశాజనకంగా ఉన్నా పూర్తి ఆశలు పెట్టుకోనక్కరలేదని, అంతా బెడిసిపోయినా అందుకు సిద్ధంగా ఉండాలన్నది ఒకటి. చర్చల అజెండాలు వాషింగ్టన్‌లో గాక యుద్ధభూమిలో సిద్ధమవుతున్నాయని, చివరకు ఏదైనా రష్యాకు ఆమోదయోగ్యం కావాలి తప్ప అమెరికాకు కాదన్నది మరొకటి. సమస్య పరిష్కారానికి తాము మొదటి నుంచి పేర్కొంటున్న షరతులలో ఎటువంటి మార్పు ఉండబోదనేది ఇంకొకటి. అదే సమయంలో రాజీలంటేనే కొంత ఇచ్చిపుచ్చుకోవలసి ఉంటుందని తమకు తెలుసునని కూడా వారంటుండటం విశేషం. ఆ ప్రకారం ఏమి జరగవచ్చు?
పుతిన్‌తో ట్రంప్ సంభాషణ ఫలితంగా 30 రోజుల కాల్పుల విరమణ అమలుకు వచ్చిన పక్షంలో, ఆ కాలంలో ఏమి జరగవచ్చునన్నది ఆసక్తిగా వేచిచూడవలసిని విషయం. ఇటువంటి క్లిష్టమైన వివాదాలు నెల రోజులలో పరిష్కారమయేవి కావు గనుక, గడుపు పొడిగింపులు అనివార్యం కావచ్చు. మరొక వైపు ట్రంప్ వైఖరిపై కొన్ని సందేహాలకు ఆస్కారం కూడా ఏర్పడుతున్నది. జెడ్డా ప్రకటననే గమనిస్తే, ఒకవైపు కాల్పుల విరమణ అంటూనే ఉక్రెయిన్‌కు సైనిక సహాయ పునరుద్ధరణలోని ఉద్దేశం ఏమిటి? యూరోపియన్ దేశాలు, సైన్యాలు ఇవే రోజులలో తమ సైనికశక్తి బలోపేతం గురించి, ఉక్రెయిన్‌కు శాంతిదళాల పేరిట ఉమ్మడి సేనలను పంపటం విషయమై ముమ్మరంగా చర్చలు జరుపుతుండగా, యూరప్ సేనల మోహరింపు ఏ పేరిట జరిగినా తమకు ఆమోదయోగ్యం కాదని రష్యా స్పష్టం చేస్తున్నా, శాంతి యత్నాలలో యూరప్ ప్రమేయం ఉండగలదని జెడ్డా ప్రకటనలో పేర్కొనటానికి అర్ధమేమిటి? పోతే, యూరోపియన్ దేశాలతో పాటు జపాన్, న్యూజీలాండ్, టర్కీ, కెనడాలతో కలిసి మొత్తం 30కి పైగా దేశాల సైన్యాధికారులు ఇదే 11, 12 తేదీలలో ఫ్రాన్స్‌లో సమావేశమవుతూ శాంతి పరిరక్షణ పేరిట ఉక్రెయిన్‌కు ఉమ్మడి సైన్యాన్ని పంపే ఆలోచన చేయటం ఎక్కడికి దారితీయవచ్చు? రష్యా వల్ల ఉక్రెయిన్‌కే గాక మొత్తం యూరప్‌కు ప్రమాదమనే వాదనను వారు పదేపదే చేయటంలోని అంతరార్ధం ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు 30 రోజుల కాల్పుల విరమణ కాలంలో లభించవచ్చునా? గురువారం సాయంత్రానికి అందిన వార్తలను బట్టి, 100 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరించలేదు. దీర్ఘకాలిక శాంతి స్థాపన మాత్రమే తమ లక్షమన్నారు. ఇందుకు ట్రంప్, జెలెన్‌స్కీల స్పందన ఇంకా తెలియవలసి ఉంది.

– టంకశాల అశోక్

(రచయిత సీనియర్ సంపాదకులు)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News