Friday, January 24, 2025

మణిపూర్‌లో క్రమంగా ప్రశాంత పరిస్థితులు

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : మణిపూర్‌లో క్రమంగా ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్నాయని, ముఖ్యంగా గడచిన నాలుగు నెలలుగా పరిస్థితిలో మెరుగుదల కానవస్తున్నదని ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ సోమవారం వెల్లడించారు. సంక్షేమ ప్రయోజనాల పంపిణీ కార్యక్రమంలో బీరేన్ సింగ్ మాట్లాడుతూ,‘శాంతిని తిరిగి నెలకొల్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాం. నిరుడు మే 3న హింసాకాండ ప్రజ్వరిల్లిన తరువాత కాలంతో పోలిస్తే గడచిన నాలుగు నెలల్లో ప్రశాంతత తిరిగి నెలకొనసాగింది’ అని చెప్పారు.

నిరుడు మే3 నాటి ఘటనను సిఎం ప్రస్తావిస్తూ, విచారం వెలిబుచ్చారు. ‘దురదృష్టవశాత్తు ఆ నాటి సంఘటనలు అనూహ్యం. ప్రభుత్వంపై ఆవిధంగా దాడులు జరుగుతాయని మేము ఊహించలేదు’ అని ఆయన చెప్పారు. షెడ్యూల్డ్ తెగ హోదా కోసం మీతై సమాజం డిమాండ్‌కు వ్యతిరేకంగా అఖిల గిరిజన విద్యార్థుల యూనియన్ మణిపూర్ నిర్వహించిన ర్యాలీ గురించి బీరేన్ సింగ్ ప్రస్తావిస్తూ, ‘విద్యార్థులకు సంబంధించిన మామూలు ర్యాలీ అది అని మేము భావించాం’ అని తెలిపారు.

అయితే, దాడులు ఒకటి రెండు చోట్ల మాత్రమే జరిగాయని, పర్వత జిల్లాల్లోని ఇతర ప్రాంతాలలో సంఘటనలు ఏవీ జరగలేదని సిఎం తెలిపారు. ‘ఆ సమయంలో భద్రత సిబ్బంది, పోలీసులను తగినంతగా మోహరించలేదు. అది అకస్మాత్తుగా జరిగిన దాడి. దాని వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి. దానికి నేను నిజాయతీగా విచారం వెలిబుచ్చుతున్నాను’ అని బీరేన్ సింగ్ తెలియజేశారు. అయితే, అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండాప్రభుత్వం చర్యలు తీసుకున్నదని ఆయన చెప్పారు. హింసాకాండ ప్రజ్వలనకు ముందు నాటి పరిస్థితులను మణిపూర్‌లో పునరుద్ధరించాలని ప్రజలకు సిఎం విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News