వాతావరణ అనుకూలతతో శనగ పంట వైపు మొగ్గుతున్న రైతులు
రాష్ట్రంలో శనగ సాధారణ సాగు 2.48 లక్షల ఎకరాలు
201920లో విస్తీర్ణం 2.99లక్షల ఎ.
202021లో 3.55లక్షల ఎ. అక్టోబర్, నవంబర్‌లు పంటకు అదను స్వల్పకాలిక విత్తనాలతో 80నుంచి 90రోజుల్లోనే చేతికి పంట
మనతెలంగాణ/హైదరాబాద్ : యాసంగి పంటలసాగు అదను సమీపించింది. రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించాలని ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఈ పరిస్థితుల్లో ఈ సారి రైతులు శనగ పంట సాగు పట్ల మొగ్గు చూపుతున్నారు. వాతావరణం కూడా అనుకూలంగా ఉండటం, పంట దిగుబడి కూడా ఆశాజకంగా ఉంటుందన్న అభిప్రాయంతో ఉన్నారు. రాష్ట్రంలో శనగ పంట సాగు సాధారణ విస్తీర్ణం కంటే రెట్టింపు విస్తీర్ణంలో సాగులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు వ్యవసాయ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సారి ఆరు లక్షల ఎకరాల వరకూఈ పంటను సాగులోకి తేవాలని వ్యవసాయ శాఖ లక్షంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే పంట సాగు పట్ల రైతులను ప్రొత్సహిస్తున్నారు. రాష్ట్రంలో శనగ పంట సాధారణ సాగు విస్తీర్ణం 2.48లక్షల ఎకరాలు కాగా, గత రెండేళ్ల నుంచి రైతులు శనగ సాగు పట్ల అధికంగా మొగ్గు చూపుతూ వస్తున్నారు. 201920 సీజన్‌లో శనగ పంట 2.99లక్షల ఎకరాల్లో సాగు చేశారు. 202021 సీజన్‌లో పంట విస్తీర్ణం ఏకంగా 3.55లక్షల ఎకరాలకు పెరిగిపోయింది. ఏ విధమైన ప్రభుత్వ ప్రోత్సాహం లేకుండానే రైతులు శనగ సాగు పట్ల మొగ్గుతూ వచ్చారు. అదే ప్రభుత్వ పరంగా కూడా ప్రోత్సాహం అందిస్తే శనగ పంట సాగు రికార్డు స్థాయిలో జరిగే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు.
చలి వాతావరణంలో పండే శనగ పంటకు రాష్ట్రంలోని తేమ బాగా పట్టివుంచే సారవంతమైన మధ్యస్థ,నల్లరేగడి నేలలు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. తొలకరిలో సాగుచేసిన పైర్లు కొసిన తర్వాత శనగ పంట సాగుకూ సిద్దమవుతుంటారు. అక్టోబర్ నుంచి నవంబర్ రెండవ వారం వరకూ రాష్ట్రంలో శనగ పంట సాగుకు అదను కాలంగా శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పంట కాలం తక్కువగా వుండటం , చీడపీడల సమస్య కూడా తక్కువే కావటంతో రైతులు శనగ సాగుకు అలవాటుపడుతున్నారు. కేవలం 90 నుంచి110రోజుల్లోనే పంట చేతికందుతుంది. అదే స్వల్పకాలిక విత్తన రకాలైతే 80నుంచి 90రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. దేశవాళీలో రకాల్లో జెజి 11, జెఏకెఐ, క్రాంతి, జెజి , నంద్యాల 1, నంద్యాల 47రకాలు అందుబాటులో ఉన్నాయి. కాబూళీ రకల్లో కెఎకె 2, పూలే జి, శ్వేత రకాలు ఆందుబాటులో ఉన్నాయి. దేశవాళీ రకాలైతే ఎకరానికి .30కిలొలు , కాబూలి రకాలైతే 60కిలోల విత్తనం అవసరం. ఇటీవలే భారత పప్పుధాన్యాల పరిశోధనా సంస్థ శనగలో మరో మూడు కొత్తరకం వంగడాలను విడుదల చేసింది. ఐపిసిఎల్ 4, డిజిఎం 4005, ఐపిసిఎంబి 19రకాలను విడుదల చేసింది. ఇక్రిశాట్ సహకారంతో శనగలో ఈ కొత్తరకం వంగడాలను రూపొందించారు. వాతావరణ మార్పులు, బెట్టకు నిలదొక్కుకోవడంతోపాటు చీడపీడలను తట్టుకుంటాయని శాస్త్రవేత్తులు వెల్లడించారు. విత్తన రకం ఏదైనా ఎకరానికి 10నుండి 12క్వింటాళ్ల దిగుబడి నిస్తాయని అధికారులు వెల్లడించారు.
ఆ పది జిల్లాల్లోనే శనగ సాగు అధికం:
రాష్ట్రంలో శనగ పంట సాగుకు పది జిల్లాలే అధికంగా అలవాటు పడ్డాయి. అందులో కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా లక్ష ఎకరాల విస్తీర్ణంలో గత ఏడాది శనగ పంట సాగులోకి వచ్చింది. మిగిలిన వాటిలో అదిలాబాద్‌లో 76వేలు, నిర్మల్‌లో 55వేలు, సంగారెడ్డిలో 30వేలు, నిజామాబాద్‌లో 26వేలు, వికారాబాద్‌లో 20వేలు, గద్వాల్‌లో 16వేలు, సిద్దిపేటలో 7వేలు, రంగారెడ్డిలో 8వేలు, ఆసీఫాబాద్‌లో 6వేల ఎకరాల్లో శనగ పంట సాగు చేశారు. మిగిలిన జిల్లాల్లో శనగ సాగు నామమాత్రంగానే జరిగింది. కొన్ని జిల్లాల్లో శనగ సాగు ఉనికి కూడా లేకుండా పోయింది. ఈ జిల్లాల్లో వాతారణ పరిస్థిలు, నేలల స్వభావం శనగ సాగుకు అనుకూలంగా ఉన్నప్పటికీ రైతులు ఈ పంట సాగు పట్ల ఆసక్తి చూపటం లేదు. ప్రభుత్వం వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను ప్రోత్సహిస్తున్న నేపద్యంలో ఈ సారి ఈ జిల్లాల్లో కూడా రైతులు శనగ పంట సాగు పట్ల ఆకస్తి కనబరుస్తున్నారు.శనగ సాగుకు అలవాటు పడ్డ పది జిల్లాల్లో కూడా ఈ సారి శనగ సాగు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నట్టు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.