రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతర అయిన సూర్యాపేట జిల్లాలోని శ్రీ లింగమంతులస్వామి (గొల్లగట్టు) దేవరపెట్టెను కేసారం నుండి ఆదివారం రాత్రి దురాజ్‌పల్లి ఆలయానికి తరలించారు. ఆదివారం సాయంత్రం కేసారం గ్రామంలో మెంతబోయిన, మున్న వంశస్థులు, బైకానులు దేవరపెట్టెలోని దేవతామూర్తులైన లింగమంతులస్వామి, గంగమ్మ, ఆకుమంచమ్మ, యలమంచమ్మ, చౌడమ్మల బొమ్మలను గుడ్డలతో తుడిచి పలుసు, కుంకుమతో బొట్టు పెట్టి బంతి పూలదండలతో అలంకరించారు. కుల పెద్దలు దూప, దీపారాధన చేసి కొబ్బరికాయలు కొట్టి పరమాన్నం నైవేద్యంగా పెట్టి, మొక్కి దేవరపెట్టెను ఓ లింగా…ఓ లింగా అంటూ కదిలించారు.
ఆదివారం రాత్రి కేసారం గ్రామం నుండి ప్రారంభమైన దేవరపెట్టె తరలింపు అర్ధరాత్రి వరకు దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి ఆలయానికి చేరుకుంది. దేవరపెట్టెను శనివారం మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలం, చీకటాయపాలెం గ్రామం నుండి ఊరేగింపుగా కేసారానికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ పోలెబోయిన నరసయ్య యాదవ్, డైరెక్టర్లు మెంతబోయిన లింగస్వామి, మెంతబోయిన మల్లయ్య, కుల పెద్దలు మెంతబోయిన పెద్ద నాగయ్య, మెంతబోయిన వెంకన్న, మెంతబోయిన బుచ్చయ్య, మెంతబోయిన సందయ్య, మెంతబోయిన గంగయ్య, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.