Sunday, January 12, 2025

పెద్దవాగునే అప్పగిస్తాం

- Advertisement -
- Advertisement -

Peddavagu will be handed over to Godavari management Board

ముందుగా డిపిఆర్‌లకు
అనుమతుల సంగతి తేల్చండి
ఇతర ప్రాజెక్టులపై చర్చలు
అనవసరం గోదావరి బోర్డు
ఉపసంఘం భేటీలో
తేల్చిచెప్పిన తెలంగాణ
వెంకటనగరం ఎత్తిపోతలకు
అంగీకరించిన ఆంధ్రప్రదేశ్
బోర్డు సమావేశంలో చర్చించాకే
ప్రాజెక్టులు సందర్శించాలి

గోదావరిపై మిగతా ప్రాజెక్టులు మావే

మనతెలంగాణ/హైదారబాద్: తెలంగాణ రాష్ట్రం పరిధిలో గోదావరి బేసిన్‌కింద ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న పెద్దవాగు ప్రాజెక్టును మాత్రమే గోదావరి యాజమాన్య బోర్డుకు అప్పగిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోదావరిబోర్డు ఉపసంఘానికి తేల్చిచెప్పింది. మిగిలినప్రాజెక్టులన్నీ పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వేనని స్పష్టం చేసింది. సోమవారం జల సౌధలో గోదావరి యాజమాన్యబోర్డు ఉపసంఘం సమావేశం జరిగింది. బోర్డు సభ్య కార్యదర్శి బి.పి.పాండె అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల శాఖల అధికారులు పాల్గొన్నారు. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో గోదావరి నదీ పరివాహకంగా ఉన్న ప్రాజెక్టులను బోర్డుకు అప్పగింత, గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న పలు అంశాల్లో మార్పులు తదితర అంశాలు చర్చకు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి సమా వేశంలో పాల్గొన్న ఒఎస్డి శ్రీధర్ రావు దేశ్ పాండేతోపాటు అంతర్ రాష్ట్ర జల విభాగం ఇఇ సుబ్రమణ్య ప్రసాద్ తదితరులు తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలను వెల్లడించారు.

తొలుత మేడిగడ్డ (లక్ష్మి)బ్యారేజ్, కన్నెపల్లి పంప్‌హౌస్ అంశాలపై తెలంగాణ అధికారులు స్పందిస్తూ గత ఏడాది అక్టోబర్ 11న జరిగినబోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు తెలంగాణ, ఎపి ఉమ్మడి ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లాలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టును మాత్రమే బోర్డు పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఇది వరకే గోదావరి బోర్డుకు అందజేయడం జరిగిందన్నారు. అయితే ఇతరప్రాజెక్టుల కాంపొనెంట్‌లను బోర్డు పరిధిలోకి తీసుకుచ్చే అవసరం లేదని తెల్చిచెప్పారు. నోటిఫికేషన్‌లోని షెడ్యూల్ 2లో పేర్కొన్న 5 ప్రాజెక్టులను తొలగించాలని ,మరికొన్ని ప్రాజెక్టుల కాంపొనెంట్‌లను షెడ్యూల్ 2నుంచి షెడ్యూల్ 3లోకి మార్చాలని విజ్ణప్తి చేస్తూ తగంలో బోర్డుకు , కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు లేఖలు రాసినట్టు తెలిపారు. వీటిపై గోదావరి బోర్డుగాని, కేంద్ర ప్రభుత్వం గాని ఎటువంటి స్పందన తెలియపర్చలేదన్నారు. ఈ స్థితిలో వీటిని బోర్డు పరిధిలోకి తీసుకువచ్చే అంశాన్ని ప్రస్తుతం పరిశీలించే అవసరం లేదని ఉపసంఘానికి స్పస్టం చేశారు.

ఏ అంశమైనా బోర్డు సమావేశంలో చర్చకు పెట్టి ,బోర్డు అనుమతి పొందిన తర్వాతనే ప్రాజెక్టులను సందర్శించాలని , ప్రాజెక్టుల స్వాధీనానికి సంబంధించిన నోట్ తయారు చేయాలని కోరారు. బోర్డు అనుమతి లేకుండానే గోదావరి యాజమాన్య బోర్డు సభ్యులు ఏకపక్షంగా ప్రాజెక్టులను సందర్శించి హ్యాండింగ్ ఓవర్ నోట్స్ తయారు చేయడం పట్ల తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీటిపై ఈ సమావేశంలో చర్చించేది లేదని సభ్యకార్యదర్శి పాండేకు స్పష్టం చేశారు. తాము 5వ సబ్‌కమిటి సమావేశంలో వ్యక్తపరిచిన అభిప్రాయాలను అసంపూర్ణంగా రికార్డు చేసినందున ఈ సబ్ కమిటి మినిట్స్‌లో తమ అభిప్రాయాలను పూర్తిగా రికార్డ్ చేయాలని కోరారు. చర్చ సందర్బంగా ఎపి నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ మాట్లాడుతూ తెలంగాణకు సంబంధించిన అన్ని కాంపోనెంట్లను గోదావరి బోర్డు పరధిలోకి తీసుకురావాలని కోరారు.

దీనిపై తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపారు. ఈ ప్రాజెక్టులన్నీ ఉమ్మడి ఎపిలో ఉన్నప్పుడు చేపట్టిన ప్రాజెక్టులే అని, ఇవి తెలంగాణకు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నాయని తెలిపారు. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు క్లాజ్ 4ప్రకారం రాష్ట్రాలకు గోదావరి నదిలో తమ వాటా నీటిని ఎక్కడికైనా తరలించుకునే అధికారం ఉందని గుర్తు చేశారు. ఉమ్మడి ప్రాజెక్టులు కాని వాటిని బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ఎపి కోరడం సమంజసంగా లేదని తెలిపారు. గోదావరి బేసిన్ పరిధిలో రాష్ట్రానికి చెందిన 6 ప్రాజెక్టుల డిపిఆర్‌లపై సత్వరమే అనుమతులు ఇవ్వాలని కోరారు. ఎపిలో ఉన్న సీలేరు ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి చేర్చాలనికోరారు. ఎపిలో ఉన్న వెంకట నగరం ఎత్తిపోతల పథకంపై ఉప సఘం చర్చించింది.ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను గోదావరి బోర్డుకు అప్పగించేందకు ఎపికిచెందిన గోదావరిడెల్టా సిష్టం చీఫ్ ఇంజనీర్ పుల్లారావు, ఎపి జన్కొఅధికారులు అంగీకారం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News