ప్రపంచ జనాభాలో దాదాపు 30 కోట్ల మంది, భారత దేశంలో 1.5 కోట్ల మంది ఆస్తమాతో బాధపడుతుండగా, అందులో సగానికి సగం పిల్లలే ఉండడం విశేషం. తీవ్రమైన దగ్గు, జలుబుతో ఊపిరాడనివ్వని ఈ వ్యాధి ప్రాణాంతకం కాకపోయినప్పటికీ సకాలంలో వైద్య చికిత్స అందించకుంటే ఎన్నో ఇబ్బంపదలు తెచ్చిపెడుతుంది. ఆస్తమాకు వ్యాక్సిన్ అంటూ ఏదీ లేదు. కానీ ఫ్లూ వల్ల ఇది ఎక్కువవుతుంది. చిన్నపిల్లల్లో ఫ్లూ ఎక్కువ కాబట్టి ఫ్లూ వ్యాక్సిన్ ఉపయోగిస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది. ఆస్తమా ఒక ఇన్‌ఫ్లెమేటరీ జబ్బు. ఇన్‌ఫ్లమేషన్ అనేది శరీరంలో సహజమైన రక్షణ గుణం. ఇది ఎక్కువ తక్కువ అవుతుంటుంది.
Also Read: సమ్మర్‌లో కండ్లకలక సమస్య
దీన్ని బాగా నియంత్రించవచ్చు. మనదేశంలో ఆస్తమా రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గాలి కాలుష్యమే ఈ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. గాలి కాలుష్యానికి అనేక కారణాలున్నాయి. ఇళ్లల్లో వాడే కిరోసిన్, కట్టెల పొయ్యి వాడకం కూడా వాయుకాలుష్యానికి దారి తీస్తుంది. తాజా అధ్యయనం ప్రకారం దేశంలో 70 శాతం కన్నా ఎక్కువ మంది ఇంకా కిరోసిన్, కట్టెల పొయ్యి వాడుతున్నారని వీటి నుంచి వెలువడే బొగ్గుపులుసు వాయువులతోపాటు అనేక వ్యర్థ వాయువులు శ్వాసకోశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తేలింది. పట్టణాలు విస్తరిస్తున్నాయి. చెట్లు కూలిపోతున్నాయి.
Also Read: మహిళల్లో ఎనీమియా తీవ్రత..
నదులు, చెరువులు పూడుకుపోతున్నాయి. అభివృద్ధి పేరిట పర్యావరణానికి పరోక్షంగా హాని కలిగించే ఎన్నో కార్యక్రమాలు చేపట్టడంతో వాయు కాలుష్యం, ఇతర కాలుష్యాలు వ్యాపించి వ్యాధులకు దారి తీస్తున్నాయి. అలాగే ఆస్తమాపై కూడా ఈ ప్రభావం ఉంటోంది. ఆస్తమా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి . దీని బారిన పడిన వారిలో ఛాతీ బిగుసుకుపోవడం, ఊపిరితిత్తులు మూసుకుపోవడం, శ్వాసతీసుకోవడం కష్టం కావడం, దగ్గువంటి ప్రధాన లక్షణాలు వెంటనే కనిపిస్తుంటాయి. ఛాతీలో అధికంగా శ్లేష్మం చేరడం వల్ల గాలి మార్గాలు మూసుకుపోయి శ్వాసతీసుకోవడం ఇబ్బంది అవుతుంది.
Also Read: దోమల మందు వినియోగం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పెరిగిన శ్లేష్మం న్యూమోనియా వంటి ఇన్‌ఫెక్షన్లకు దారి తీస్తుంది. వేసవిలో ఆహారం విషయంలో నిర్లక్షంగా ఉండడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమౌతుంది. శ్లేష్మం ఉత్పత్తి ఎక్కువై, శ్వాసనాళాల్లో వాపు వస్తుంది. ఇప్పటికే క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వంటి వ్యాధులతో బాధపడుతున్నట్టయితే శ్లేష్మ సమస్య కలిగించని ఆహారాన్ని తీసుకోవాలి. పాలు తీసుకోరాదు. దీనివల్ల సమస్యలు పెరుగుతాయి. శ్లేష్మం ఎక్కువగా ఉంటే తేనెను తీసుకోవడం మంచిదే. దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. తేనెతోపాటు నిమ్మకాయ తీసుకుంటే ఔషధంలా పనిచేస్తుంది. పసుపు రసాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి పుక్కలించుకోవచ్చు. వేడి నీళ్లు, చికెన్ సూప్, వేడి యాపిల్ రసం, గ్రీన్ టీ తీసుకోవచ్చు.
Also Read: మలేరియాతో ఎక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ… జాగ్రత్త
చలికాలం వచ్చిందంటే ఆస్తమా విజృంభిస్తుంది. పిల్లల్లో వచ్చే ఆస్తమాపై శాస్త్రవేత్తలు ఇటీవల అధ్యయనం చేశారు. చేపలు తినడం వల్ల ఆస్తమాను నివారించవచ్చని కనుక్కున్నారు. ఈమేరకు హ్యూమన్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ అనే జర్నల్‌లో ఓ అధ్యయనం వెలువడింది. ఆస్తమా పిల్లలకు ఆరునెలల పాటు వరుసగా చేపల ఆహారం ఇచ్చారు. దీంతో పిల్లల్లో ఆస్తమా తగ్గిందని కనుక్కున్నారు. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా ఉంటాయి. అందువల్ల ఊపిరితిత్తుల్లో వచ్చే వాపు తగ్గుతుందని శాస్తవేత్తలు తెలిపారు. వారంలో కనీసం రెండుసార్లయినా చేపలు తినాలని సూచించారు. దీనివల్ల శ్వాసకోశ వ్యాధులకు దూరంగా ఉండవచ్చని చెప్పారు.
వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
Also Read: పెద్దపేగు క్యాన్సర్ లక్షణాలు.. నివారణ మార్గాలు
వాతావరణంలో మార్పులు, పొగ, దుమ్ముతో నిండిన పరికరాలు, అగరబత్తీ పరిమళాలు, దోమల నివారణకు వాడే కాయిల్స్, పెంపుడు జంతువుల బొచ్చు, టపాసుల పొగ, పూల పుప్పొడి ఇవన్నీ ఆస్తమాకు దోహదమవుతుంటాయి. ఒకప్పుడు వంశాన్ని బట్టి, ఎక్కువగా వస్తుందని నమ్మేవారు. కానీ ఇప్పుడు దానికంటే గాలి కాలుష్యమే ప్రధాన కారణమవుతోంది. ఆస్తమా ఉన్నవారు దుమ్ముధూళికి దూరంగా ఉండడం చాలా మంచిది. ధూమపానం పనికిరాదు. శీతల పానీయాలు, ఐస్‌క్రీములు, ఫ్రిజ్‌వాటర్, వంటి చల్లని పదార్థాలు తీసుకోకూడదు. ఇంట్లో బూజు దులపడం వంటివి చేయరాదు. ఇన్‌హేలర్ దగ్గర ఉంచుకోవడం మేలు. ఆస్తమా రోగులు వ్యాయామం చేయాలి. దీనివల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. బరువు తగ్గుతారు. బరువు తగ్గితే ఆస్తమా రిస్క్ తగ్గుతుంది..రక్త ప్రసరణ వల్ల అవయవాలన్నిటికీ ఆక్సిజన్ సరఫరా అయి, శక్తివంతమవుతాయి. ఇన్‌ఫెక్షన్స్ తగ్గుతాయి. యోగా, ప్రాణాయామం కూడా చాలా మంచిది. ఆస్తమా తొలిదశలో ఉన్నవాళ్లు బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు, ప్రాణాయామం చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది.
Also Read: హైపోగ్లైసీమియా అంటే లో బ్లడ్ షుగర్
ఆస్తమా పిల్లలను భయపెట్టవద్దు
సరైన చికిత్స, వైద్యనిర్వహణతో ఆస్తమాను పూర్తిగా నియంత్రించడం సాధ్యమౌతుందన్న విషయం మర్చిపోరాదు. ఆస్తమా లక్షణాల్లో ఊపిరి సరిగ్గా ఆడనంత మాత్రాన మీరు భయపడి వారిని భయపెట్టవద్దు . ముఖ్యంగా పిల్లలకు ధైర్యం నూరిపోస్తుండాలి. డాక్టర్ సూచన ప్రకారం ఆస్తమా కార్యాచరణ ప్రణాళికను పాటించండి. ఇన్హేలర్లను, మందులను కచ్చితంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకుని పిల్లలకు చెప్పండి. కంట్రోలర్, రిలీవర్ ఇన్హేలర్లకు లేబుల్ అంటించండి.
Also Read: శ్వాససమస్యలపై అశ్రధ్ధ వద్దు
రిలీవర్స్ వెంటనే ఉపశమనం కలిగిస్తాయి కానీ కంట్రోలర్లు వెంటనే ఉపశమనం కలిగించవు. కొంతకాలం పాటు ఆస్తమా లక్షణాలను , ప్రభావాన్ని నిరోధించేందుకు ఉపయోగిస్తారు. పిల్లలు ఎక్కడికెళ్లినా వెంట రిలీవర్ ఇన్‌హేలర్ ఉంచుకునేటట్టు చేయండి. పిల్లల ఆస్తమా గురించి కుటుంబానికి, సంరక్షకులకు , స్కూళ్లలో వారికి తెలియజేయండి. ఆస్తమా పిల్లలు ఏదైనా ఆటపాటలపై మక్కువ చూపితే అడ్డు చెప్పవద్దు. ఈతకొట్టాలనుకున్నా, మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేయాలనుకున్నా వాళ్లను చేయనివ్వండి.