సరైన చికిత్స, వైద్యనిర్వహణతో ఆస్తమాను పూర్తిగా నియంత్రించడం సాధ్యమౌతుందన్న విషయం మర్చిపోరాదు. ఆస్తమా లక్షణాల్లో ఊపిరి సరిగ్గా ఆడనంత మాత్రాన మీరు భయపడి వారిని భయపెట్టవద్దు. ముఖ్యంగా పిల్లలకు ధైర్యం నూరిపోస్తుండాలి. డాక్టర్ సూచన ప్రకారం ఆస్తమా కార్యాచరణ ప్రణాళికను పాటించండి. ఇన్హేలర్లను, మందులను కచ్చితంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకుని పిల్లలకు చెప్పండి.
కంట్రోలర్, రిలీవర్ ఇన్హేలర్లకు లేబుల్ అంటించండి. రిలీవర్స్ వెంటనే ఉపశమనం కలిగిస్తాయి కానీ కంట్రోలర్లు వెంటనే ఉపశమనం కలిగించవు. కొంతకాలం పాటు ఆస్తమా లక్షణాలను, ప్రభావాన్ని నిరోధించేందుకు ఉపయోగిస్తారు. పిల్లలు ఎక్కడికెళ్లినా వెంట రిలీవర్ ఇన్‌హేలర్ ఉంచుకునేటట్టు చేయండి. పిల్లల ఆస్తమా గురించి కుటుంబానికి, సంరక్షకులకు , స్కూళ్లలో వారికి తెలియజేయండి. ఆస్తమా పిల్లలు ఏదైనా ఆటపాటలపై మక్కువ చూపితే అడ్డు చెప్పవద్దు. ఈతకొట్టాలనుకున్నా, మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేయాలనుకున్నా వాళ్లను చేయనివ్వండి.