Monday, December 23, 2024

ఇంకా పెగాసస్ దుమారం

- Advertisement -
- Advertisement -

Pegasus row india

 

జూలై 2021లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 17 మీడియా సంస్థలకు చెందిన 80 మందికి పైగా జర్నలిస్టులు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సాంకేతిక సహకారంతో విడుదల చేసిన నివేదికలో ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన రాజకీయ నాయకులు, ఉద్యమకారులు, లాయర్లు, జర్నలిస్టులకు చెందిన 50,000 ఫోన్ నంబర్లు లీక్ కావడంపై విడుదల చేసిన నివేదిక పెద్ద కలకలం సృష్టించింది. అందుకోసం ఎన్‌ఎస్‌ఒకు చెందిన పెగాసస్ పరికరాలను ఉపయోగించినట్టు వెల్లడించారు. భారత్‌తో సహా కనీసం 11 దేశాలలో పెగాసస్ స్పై వేర్ సాధనాలను ప్రభుతాలు దుర్వినియోగం చేస్తున్నట్లు వెల్లడైనది.

మానవ హక్కుల ఉద్యమకారులు, పాత్రికేయులు, ప్రతిపక్షాలు, పౌర సమాజంపై డిజిటల్ దాడులు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. వారి డిజిటల్ పరికరాలు హ్యాక్ చేయడం ద్వారా గూఢచర్యం చేస్తున్నారు. తమకు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసే వారిని మౌనం వహించేటట్లు, భయపెట్టేటట్లు చేయడం కోసం నిర్విరామంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరిగ్గా ఒక సంవత్సరం క్రితం పెగాసస్ ప్రాజెక్ట్ ప్రపంచ వ్యాప్తంగా చట్ట విరుద్ధమైన నిఘాకు ఉపయోగిస్తున్న తీరు బహిర్గతమై రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. చాలా దేశాల్లో మానవ హక్కుల కోసం మాట్లాడటం, సత్యాన్ని బహిర్గతం చేయడం ప్రమాదకరంగా పాలకులు భావిస్తున్నారు. అటువంటి ధోరణులను కట్టడి చేయడం కోసం ప్రభుత్వాలు తరచుగా ప్రజలను భయపెట్టడం, వేధించడం, అరెస్టు చేయడం జరుగుతున్నది. అందుకోసం డిజిటల్ నిఘాపై ఎక్కువగా ఆధారపడుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు ఎవరైనా డిజిటల్ పరికరాల ద్వారా ప్రత్యర్థుల కార్యాచరణను పర్యవేక్షించ గల అధునాతన, అనుచిత నిఘా సాంకేతికతను కొనుగోలు చేసి, అమ్మడానికి అనుమతిస్తున్నారు. అటువంటి సాధనాలను ప్రైవేట్ కంపెనీలు తయారు చేసి విక్రయిస్తున్నాయి, ఇటువంటి నిఘా సాధనాలు ‘నేరస్థులు, ఉగ్రవాదులను’ లక్ష్యంగా చేసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నట్లు ప్రభుత్వాలు, కంపెనీలు చెబుతున్నాయి. కానీ వాస్తవానికి, మానవ హక్కుల ఉద్యమకారులు, జర్నలిస్టులు, ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది రాజకీయ ప్రత్యర్థుల లక్ష్యంగా స్పై వేర్‌తో చట్ట విరుద్ధంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్పష్టం చేసింది.

జూలై 2021లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 17 మీడియా సంస్థలకు చెందిన 80 మందికి పైగా జర్నలిస్టులు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సాంకేతిక సహకారంతో విడుదల చేసిన నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన రాజకీయ నాయకులు, ఉద్యమకారులు, లాయర్లు, జర్నలిస్టులకు చెందిన 50,000 ఫోన్ నంబర్లు లీక్ కావడంపై విడుదల చేసిన నివేదిక పెద్ద కలకలం సృష్టించింది. అందుకోసం ఎన్‌ఎస్‌ఒకు చెందిన పెగాసస్ పరికరాలను ఉపయోగించినట్టు వెల్లడించారు. భారత్‌తో సహా కనీసం 11 దేశాలలో పెగాసస్ స్పై వేర్ సాధనాలను ప్రభుతాలు దుర్వినియోగం చేస్తున్నట్లు వెల్లడైనది. అవి: అజర్ బైజాన్, బహ్రెయిన్, హంగేరీ, భారత్, మెక్సికో, మొరాకో, రువాండా, సౌదీ అరేబియా, టోగో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. పెగాసస్ అనేది మానవ హక్కుల ఉద్యమకారులను చట్టవిరుద్ధంగా లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగిస్తున్నట్లు గతంలో పదేపదే బహిర్గతమైనా ఎవ్వరూ పట్టించుకోలేదు.

అప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు తమ ఫోన్‌లు, తమ సంభాషణలను ట్రాక్ చేయడానికి ఎవరైనా ఉపయోగిస్తున్నారని భయంతో జీవించడం, పని చేయడం జరుగుతున్నది. వృత్తిపరమైన డేటాను తమ పరికరాలలో నిల్వ చేసుకోవడంకు వెనుకాడుతున్నారు. ‘నేను ఈ వార్త విన్నప్పటి నుండి ఈ రోజు వరకు నేను నా ఫోన్‌తో సులభంగా కమ్యూనికేట్ చేయలేక పోతున్నాను’ అని పశ్చిమ ఆఫ్రికా దేశమైన టోగోలో ఓ వార్తా పత్రిక డైరెక్టర్ ఫెర్డినాండ్ అయిటే చెప్పారు. ‘నా కమ్యూనికేషన్ మార్గాలను మార్చడానికి నన్ను బలవంతం చేసే ఒక రకమైన శాశ్వత భయం నెలకొంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. పెగాసస్ ప్రాజెక్ట్ వెల్లడి కనిపించడం ప్రారంభించినప్పటి నుండి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గణనీయమైన సంఖ్యలో పౌర సమాజాన్ని చట్ట విరుద్ధంగా లక్ష్యంగా చేసుకున్న, కొన్ని సందర్భాల్లో హ్యాక్ చేసిన అనేక సందర్భాలను వెల్లడిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులను, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు వెల్లడి కావడంతో రాజకీయంగా కలకలం రేపింది.

పెగాసస్ ఫోన్ వినియోగదారుల ప్రతి కదలికపై దాడి చేసేవారికి అవకాశం కల్పిస్తుంది. వారి కాంటాక్ట్‌లు, పాస్‌వర్డ్‌లు, మెసేజ్‌లు ఎవరనేది తెలుసుకోవచ్చు. వారి కెమెరాను ఆన్ చేయవచ్చు. సంభాషణలను రికార్డ్ చేయవచ్చు. వారు ఆ వ్యక్తి గురించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవచ్చు. వారి నెట్‌వర్క్‌ని ట్యాప్ చేయవచ్చు. వారి పని గురించి తెలుసుకోవచ్చు. పైగా వారు నిక్షిప్త పరచిన సమాచారాన్ని ధ్వంసం కూడా చేయవచ్చు. పెగాసస్ వంటి స్పై వేర్ అత్యంత అధునాతనమైనది. దాని ఉనికిని గుర్తించడం దాదాపు అసాధ్యం. అయినప్పటికీ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ల్యాబ్ ఎంతో ప్రయాసపడి దాని గుట్టును రట్టు చేయగలిగింది. నేడు అంతర్జాతీయంగా భావప్రకటన స్వేచ్ఛకు అతిపెద్ద సవాల్ గా పరిణమించింది.

ప్రభుత్వాలు సాగిస్తున్న ఈ భారీ కుట్రను బహిర్గతం చేసిన గత ఏడాది కాలంలో కొన్ని సానుకూల పరిణామాలు సంభవించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు, పార్లమెంటేరియన్లు ఈ దురాగతాన్ని పరిగణనలోకి తీసుకొని చట్టవిరుద్ధమైన నిఘాకు సంబంధించిన గోప్యత తెరను తొలగించాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. చట్టసభలలో, ఉన్నత న్యాయస్థానాలలో చర్చలు ప్రారంభమయ్యాయి. ఆపిల్ వంటి పెద్ద టెక్ కంపెనీలు ఎన్‌ఎస్‌ఒ గ్రూప్‌పై వ్యాజ్యాలకు దిగాయి. పెగాసస్‌పై ఉన్నత స్థాయి ఐరోపా యూనియన్ అధికారులు అధికారిక పరిశోధనలను చేపట్టారు. అయితే ప్రధాన సమస్య అట్లాగే ఉంది: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు ఇప్పటికీ పెగాసస్‌కు విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నాయి. వారు ఇప్పటికీ పూర్తిగా క్రమబద్ధీకరించడం, తగిన న్యాయపరమైన రక్షణలు లేదా పర్యవేక్షణ లేకుండా దానిని దుర్వినియోగం చేస్తున్నారు. ఎన్‌ఎస్‌ఒ గ్రూప్ ఈ లాభదాయక వ్యాపారం కొనసాగుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులు – యుద్ధ నేరాలను బహిర్గతం చేయడం, భూమి కోసం పోరాడడం, స్వచ్ఛమైన తాగునీరు, లైంగిక- పునరుత్పత్తి హక్కులు, విద్య మరెన్నో ముఖ్యమైన సమస్యలపై పని చేస్తున్న వారితో సహా – అందరూ ఇప్పటికీ తమ ప్రైవేట్ కమ్యూనికేషన్‌లు గోప్యతను పోగొట్టుకొంటున్న భయం తో జీవిస్తున్నారు.

ఈ ఉల్లంఘనల పర్యవసానాలు డిజిటల్ ప్రపంచాన్ని దాటి తమ ప్రాణాలకు ముప్పు తెస్తాయనే భయంతో వారు ఇప్పటికీ జీవిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఇటువంటి నిఘా సాంకేతికతను ఎటువంటి పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా ఉపయోగిస్తున్నట్లు స్పష్టమైనది.ఎన్‌ఎస్‌ఒ గ్రూప్ ఇటువంటి సాధనాల విక్రయాలపై నియంత్రణ అవసరమని, నిఘా సాంకేతికత ఎగుమతులను కట్టడి చేయాలని అంతర్జాతీయంగా వత్తుడులు ఎదురైనా ప్రభుత్వాలు లెక్క చేస్తున్న దాఖలాలు లేవు. మానవ హక్కుల ఉద్యమకారులపై, పౌర సమాజంపై దాడులకు దారి తీసే ఇటువంటి కార్యకలాపాలపై మానవ హక్కుల నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ ఉండే వరకు అంతర్జాతీయంగా మారటోరియం విధించాలని ఐక్యరాజ్య సమితి, పౌర సమాజ సంస్థలు పిలుపునిచ్చాయి. నిఘా సాంకేతికత విక్రయం, బదిలీ, వినియోగం ఆపివేయాలని డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా ఇటువంటి సాధనాల ఉపయోగంలో ఈ క్రింది హామీలను ప్రభుత్వాల నుండి కోరుతున్నాయి:

‘మానవ హక్కుల ఉద్యమకారులు, పౌర సమాజాన్ని చట్ట విరుద్ధంగా లక్ష్యంగా చేసుకోవడానికి ఈ సాధనాలు ఉపయోగించబడవని ప్రభుత్వాలు హామీ ఇవ్వాలి’. సందేహాస్పద ప్రమాదాలున్న, మానవ హక్కులను ఉల్లంఘించడానికి ఉపయోగించబడే గణనీయమైన ప్రమాదం ఉన్న దేశాలకు నిఘా సాంకేతికత ఎగుమతులు నిలిపివేయాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వాలు గ్లోబల్ విక్రయం, బదిలీ, నిఘా సాంకేతికత వినియోగం తాత్కాలికంగా నిలిపివేయాలి.

* చలసాని నరేంద్ర- 9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News