Sunday, January 12, 2025

మళ్లీ తెరపైకి పెగాసస్!

- Advertisement -
- Advertisement -

పెగాసస్ అంటే ఉచ్చైశ్రవమని అర్థం. ఇప్పుడీ రెక్కలగుర్రం మరోసారి భారతదేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఫోన్లు, కమ్యూనికేషన్ పరికరాలపై నిఘా పెట్టేందుకు ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఒ అనే సంస్థ పెగాసస్ పేరిట తయారు చేసిన మాల్వేర్ రెండేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేకెత్తించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఎన్‌ఎస్‌ఒ టెక్నాలజీస్ సంస్థపై వాట్సప్ యాజమాన్య సంస్థ ‘మెటా’ కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ న్యాయస్థానంలో వేసిన కేసు ఐదేళ్ల తర్వాత తాజాగా తీర్పు వెలువరిస్తూ పెగాసస్ తయారీ సంస్థ ఉల్లంఘనలకు పాల్పడిన విషయం నిజమేనని తేల్చింది. తమ వినియోగదారుల్లో 1400 మంది ఫోన్లపై 2019లో పెగాసస్ నిఘా పెట్టిందంటూ వాట్సప్ చేసిన ఆరోపణలు తాజా తీర్పుతో వాస్తవమేనని తేలింది. నిఘాకు గురైనవారిలో 300 మంది భారతీయులు ఉండటంతో ఇండియాలోనూ అలజడి మొదలైంది.

ప్రభుత్వాలు నిఘా కార్యకలాపాల కోసం సాఫ్ట్ వేర్లను వినియోగించడం తప్పేమీ కాదు. ప్రస్తుత ఆధునిక యుగంలో నేరస్థులు, ఉగ్రవాదుల ఆటకట్టించేందుకు ప్రభుత్వాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఉంటాయి. సైబర్ ఆయుధంగా పేరొందిన పెగాసస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వాలకు, ప్రభుత్వ అధీనంలో పనిచేసే సంస్థలకూ ఇజ్రాయెల్ సంస్థ విక్రయించడం రహస్యం కాదు. ఇండియా, అమెరికా సహా 50కి పైగా ప్రభుత్వాలు పెగాసస్‌ను ఖరీదు చేసినట్లు అప్పట్లోనే వార్తలు వినవచ్చాయి. అయితే ఈ పరిజ్ఞానాన్ని రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టేందుకు వాడుకోవడమే వివాదాలకు ఆజ్యం పోస్తోంది. తాము సదుద్దేశంతో తయారుచేసిన సాఫ్ట్‌వేర్‌ను అక్రమ ప్రయోజనాలకోసం వినియోగిస్తే అది తమ తప్పు కాదంటూ పెగాసస్ సృష్టికర్త అయిన ఎన్‌ఎస్‌ఒ సంస్థ ఇచ్చిన వివరణను తప్పుపట్టలేం. పెగాసస్ ఇండియాలో ఆరేళ్ల క్రితం వివాదాలకు కేంద్రబిందువుగా మారింది.

అప్పట్లో కేంద్రంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ పెగాసస్ సాయంతో గూఢచర్యానికి పాల్పడ్డాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. తమకు కొన్ని వాట్సప్ సందేశాలు వచ్చాయని, వాటి ద్వారా తమ ఫోన్లలోకి పెగాసస్‌ను జొప్పించారని కొందరు జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు ఆరోపించడంతో వివాదం మొదలైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సహా పలువురు కేంద్రమంత్రులు, పాత్రికేయులపైనా పెగాసస్ సాయంతో నిఘా పెట్టారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరించడంతో కొందరు బాధితులు కోర్టుకు ఎక్కారు. అయితే దేశభద్రత దృష్ట్యా ఈ వ్యవహారంలో సవివరంగా అఫిడవిట్ దాఖలు చేయలేమని కేంద్రప్రభుత్వం జవాబు ఇచ్చింది. సోలిసిటర్ జనరల్ సైతం తన వాదన వినిపిస్తూ ‘తాము ఏ సాఫ్ట్ వేర్ వాడామో ఏ ప్రభుత్వమూ చెప్పజాలదు’ అంటూ వ్యాఖ్యానించడం విమర్శలకు తావిచ్చింది.

ఈ వాదనలతో సంతృప్తి చెందని సర్వోన్నత న్యాయస్థానం జస్టిస్ ఆర్.వి. రవీంద్రన్ నేతృత్వంలో ఒక స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ ఐదు మొబైల్ ఫోన్లలో మాల్వేర్ ఉన్నట్లు గుర్తించినా, అది పెగాసస్ అని చెప్పడం కష్టమని పేర్కొంది. నివేదిక పూర్తి వివరాలు ఇప్పటికీ వెలుగుచూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ వివాదం అప్పటికి సద్దుమణిగినా తాజాగా అమెరికా కోర్టు తీర్పుతో మళ్లీ కేంద్ర ప్రభుత్వానికి సెగ మొదలైందని చెప్పకతప్పదు. అటు అమెరికా కోర్టు తీర్పు వెలువరించడం, ఇటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా కేంద్ర ప్రభుత్వంపై భగ్గుమనడం ఒకేసారి జరిగాయి. పెగాసస్ బారినపడిన భారతీయుల వాట్సప్ నంబర్ల వివరాలను సమర్పించాలంటూ మెటా కంపెనీని సుప్రీం కోర్టు ఆదేశించడంతోపాటు నిపుణుల కమిటీ నివేదికను బహిర్గతం చేయాలన్న సూర్జేవాలా డిమాండ్ సహేతుకమైనదే.

ప్రభుత్వాలు తమకున్న హక్కులను అధిగమించి, వ్యక్తుల ప్రైవేటు సమాచారాన్ని సేకరించేందుకు నిఘా పెట్టడం ఎంతమాత్రం క్షంతవ్యం కాదు. తాము ఎవరిపైనా నిఘా పెట్టేందుకు పెగాసస్ ను వినియోగించుకోలేదన్న కేంద్రప్రభుత్వం వాదన సరైనదే అయితే అందుకు తగిన ఆధారాలు చూపించి, పులుకడిగిన ముత్యంలా ఈ వివాదంనుంచి బయటపడాలి. అంతేతప్ప, గుప్పిట మూసి ఉంచి, ఏమీ దాచలేదని బుకాయిస్తే నమ్మేంత వెర్రివారు ఎవరూ లేరు. నిపుణుల కమిటీ నియామకం సందర్భంగా అప్పట్లో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను కేంద్రంలోని పెద్దలు ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. మనం సాంకేతిక యుగంలో జీవిస్తున్నాం. టెక్నాలజీ ఎంత ముఖ్యమో వ్యక్తుల గోప్యత హక్కు పరిరక్షణ కూడా అంతే ముఖ్యమన్న సర్వోన్నత న్యాయస్థానం హితవాక్యాలు ప్రభుత్వాలకు శిరోధార్యం కావాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News