న్యూఢిల్లీ: పెగాసస్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.అక్టోబర్‌లో యాపిల్‌నుంచి హ్యాక్ అలర్ట్ మెస్సేజిలు వచ్చిన తర్వాత ఇద్దరు భారతీయ జర్నలిస్టుల ఫోన్లలో తాము పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను గుర్తించినట్లు అంతర్జాతీయ ఎన్‌జిఓ సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గురువారం ప్రకటించింది.‘ ది వైర్’ న్యూస్ వెబ్‌సైట్ ఎడిటర్ సిద్ధార్థ్ వరదరాజన్, మరో జర్నలిస్టు ఫోన్లను తమ సెక్యూరిటీ ల్యాబ్ పరీక్షించి వాటిలో పెగాసస్ సాఫ్ట్‌వేర్ ఉన్నట్లు నిర్ధారించినట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రభుత్వ మద్దతుతో జరిగే హ్యాకింగ్‌కు వీరి ఫోన్లు టార్గెట్‌గా మారినట్లు యాపిల్ నుంచి అక్టోబర్‌లో సందేశాలు వచ్చాయి. దీంతో ఈ ఇద్దరు తమ ఫోన్లను ఆమ్నెస్టీ సెక్యూరిటీ ల్యాబ్‌కు పంపించారు. దీనిపై ఆమ్నెస్టీ సెక్యూరిటీ ల్యాబ్ అధిపతి డాన్చా ఒసియార్బైల్ మాట్లాడుతూ ‘జర్నలిస్టులుగా విధులు నిర్వర్తిస్తున్నందుకు చట్ట విరుద్ధంగా వారి వ్యక్తిగత గోప్యత, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి చేస్తున్నారు. తమ ప్రజల మానవ హక్కులను కాపాడడంతో పాటుగా చట్ట విరుద్ధ నిఘానుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రతి దేశంపై ఉంది’ అని పేర్కొన్నారు. గత అక్టోబర్‌లో యాపిల్‌నుంచి పలువురు ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులకు హ్యాకింగ్ అలర్ట్‌లు వచ్చాయి.
ఆ తర్వాత యాపిల్ దీనిపై వివరణ ఇస్తూ 150 దేశాలకు ఇలాంటి సందేశాలు వెళ్లాయని తెలిపింది. కానీ అమెరికాకు చెందిన ‘వాషింగ్టన్ పోస్టు’పత్రిక మాత్రం ప్రభుత్వమే యాపిల్‌పై ఒత్తిడి తెచ్చి ఇలాంటి ప్రకటన చేయించిందని కథనం ప్రచురించింది.
ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూపు పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీని ఆ సంస్థ ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తుంది. భారత ఇంటెలిజన్స్ బ్యూరో(ఐబి) 2017లో ఎన్‌ఎస్‌ఎనుంచి కొన్ని పరికరాలను కొనుగోలు చేసింది. కేంద్రం మాత్రం పెగాసస్ కొనుగోలును తిరస్కరించలేదు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూపు రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్‌ను కొన్ని దేశాలు వినియోగించుకుని రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలపై నిఘా పెట్టినట్లు 2021 జులైలో అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడం తీవ్ర దుమారానికి దారి తీసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి .. ఇలా దేశంలో 300 మంది ప్రముఖుల ఫోన్లను పెగాసస్‌తో హ్యాక్ చేసినట్లు అప్పట్లో ‘ది వైర్’ కథనం వెల్లడించింది.
ఇది తీవ్ర దుమారం రేపడంతో పాటు పార్లమెంటును కూడా కుదిపేసిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటయిన దర్యాప్తుకు సహకరించడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. కాగా వరదరాజన్‌తో పాటుగా ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్ట్ ప్రాజెక్టు(ఒసిసిఆర్‌పి) సౌత్ ఏసియా ఎడిటర్‌గా పని చేస్తున్న ఆనంద్ మంగ్నలే ఫోన్లలో పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను తాము కనుగొన్నట్లు ఆమ్నెస్టీ సెక్యూరిటీ ల్యాబ్ ఇప్పుడు వెల్లడించడంతో మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. అదానీ గ్రూపుపై ఇన్వెస్టిగేటివ్ స్టోరీ కోసం తాను ఆ సంస్థకు కొన్ని ప్రశ్నలు పంపించినట్లు తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడానికి ముందు మంగ్నలే ‘వాషింగ్టన్ పోస్టు’ పత్రికకు చెప్పడం గమనార్హం. ఎన్‌ఎస్‌ఓ గ్రూపు కార్యకలాపాలపై ప్రపంచవ్యాప్తంగా స్క్రూటినీ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం పెగాసస్ ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ సాఫ్ట్‌వేర్ వినియోగం కొనసాగుతూ ఉందనే విషయం ఇప్పుడు వెలుగులోకి రావడం విశేషం.