Wednesday, January 22, 2025

ప్రజాస్వామిక విలువలకు చేటు తెచ్చిన పెగాసస్

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్‌కి చెందిన ‘పెగాసస్’ నిఘా సాఫ్ట్‌వేర్ తో కేంద్ర ప్రభుత్వం హ్యాకింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణలకు తాజాగా బలం చేకూరింది. ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లతో దేశంలోని ప్రముఖుల ఐ ఫోన్లను లక్ష్యంగా చేసుకొన్నారంటూ ‘యాపిల్’ సంస్థ నుంచి ముందస్తు అప్రమత్తతతో కూడిన హెచ్చరిక సందేశాలు అక్టోబర్ లో వచ్చిన విషయం ప్రజలందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరు భారతీయ జర్నలిస్టులు అనుమానించి తమ ఫోన్లను ల్యాబ్ పరీక్షలకు పంపగా అవి పెగాసస్ స్పైవేర్ హ్యాకింగ్‌కు గురయ్యాయని తెలిసింది.తమ సెక్యూరిటీ ల్యాబ్ పరీక్షలో ఈ విషయం నిర్ధారణ అయిందని లాభాపేక్ష లేని అంతర్జాతీయ సంస్థ ఆమ్నెస్ట్టీ ఇంటర్ నేషనల్ 28 -డిసెంబర్ -2023న ప్రకటించింది. దీనితో ఆనాడు చాలా మందికి పొరపాటున అలాంటి ఎలెర్టులు వచ్చాయన్న ఆపిల్ సంస్థ ఇచ్చిన వివరణ తప్పు అని తేలిపోయింది. పెగాసస్ తమ నిఘా సాఫ్ట్‌వేర్‌ను కేవలం సార్వభౌమ దేశాల ప్రభుత్వాలకే విక్రయిస్తామని, వ్యక్తులకు, ప్రైవేట్ సంస్థలకు విక్రయించమని కూడా ఇజ్రాయెల్‌కు చెందిన ఆ సంస్థ స్పష్టంగా పేర్కొంది. భారత్‌కు చెందిన నిఘా విభాగం సైతం ఇదే సంస్థ నుంచి కొత్త హార్డ్‌వేర్‌ను 2017లో కొనుగోలు చేసినట్లు మన దేశ వాణిజ్య గణాంకాల్లో కూడా వివరాలు స్పష్టంగా గతంలోనే వెళ్లడైంది.

ఈ స్పైవేర్ సహాయంతో మన దేశంలోని ప్రముఖ విపక్ష, అనుమానిత స్వపక్ష రాజకీయ వేత్తల, సామాజిక కార్యకర్తల, న్యాయమూర్తుల, జర్నలిస్టుల ఫోన్లను హ్యాక్ చేసి వారి వ్యక్తిగత సంభాషణలు, ఇతర గోప్యత గల సమాచారాన్ని అధికార వర్గాలు భారతీయ చట్టాలకు వ్యతిరేకంగా సేకరించారని 2021 జులై నెలలో అంతర్జాతీయ మీడియాలో సంచలన కథనాలు కూడా వెలువడిన విషయం తెలిసిందే. ‘దివైర్’ వార్తా సంస్థ వెబ్‌సైట్ ఎడిటర్ సిద్ధార్థ్ వరదరాజన్, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అండ్ కరప్షన్ రిపోర్ట్ ప్రాజెక్ట్ (ఒసిసిఆర్‌పి) సౌత్ ఆసియా ఎడిటర్ ఆనంద్ మంగ్నాలే ఫోన్లను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకొన్నారని ఆమ్నెస్టీ ఇంటర్ నేషనల్ సంస్థ వెల్లడించింది. ఈ వివాదాన్ని కప్పిపుచ్చే ఉద్దేశంతోనే భారత ప్రభుత్వమే యాపిల్ సంస్థపై వత్తిడిని తీసుకు వచ్చి తప్పుడు అలెర్ట్‌లు ఇతర దేశాలకు కూడా వచ్చాయని చెప్పించిందని ‘వాషింగ్టన్ పోస్ట్’ పేర్కొంది. భారత్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాల ఐ ఫోన్ల యూజర్లకు ఇలా పొరపాటున అలర్టు సందేశం వెళ్ళాయని ఆపిల్ ఆనాడు బొంకింది.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీతో సహా పలువురు విపక్ష నేతలు, జడ్జీలు, సామాజిక కార్యకర్తల ఫోన్ల హ్యాకింగ్ ఉదంతం గతంలో పార్లమెంటునూ కుదిపేసింది. ఇంత జరిగినా తాము స్పైవేర్‌ను కొనలేదని, వినియోగించలేదని మోడీ ప్రభుత్వం చెప్పకపోవడం గమనార్హం. భారత రక్షణ నిఘా విభాగానికి చెందిన సిగ్నల్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ గతంలో ‘కాగ్నె సైట్’ అనే సంస్థ నుంచి నిఘా పరికరాలు కొనుగోలు చేసిందని ఆరోపణలు వచ్చాయి. ఏదిఏమైనా దేశ పౌరులు, విపక్ష నేతలు, న్యాయమూర్తులు, జర్నలిస్టుల వ్యక్తిగత గోప్య సమాచారాన్ని సేకరించడం చట్టరీత్యా, నైతికంగా కూడా క్షమించరాని నేరం. ఇలాంటి నీతిబాహ్య విషయాలకు కేంద్ర ప్రభుత్వమే పూనుకోవడం శోచనీయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News