Friday, November 22, 2024

పెగాసస్ ప్రతిష్టంభన!

- Advertisement -
- Advertisement -

Pegasus stalemate in Parliament

 

పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై పాలక ప్రతిపక్షాల రాజీలేని రగడకు బలైపోతున్నాయి. కొవిడ్ 19 రెండో వేవ్ పరిస్థితి, మూడో వేవ్ భయాలు, వరదలు, ఢిల్లీ సరిహద్దుల్లో దీర్ఘ కాలంగా సాగుతున్న రైతు ఉద్యమం, భారత, చైనా సైన్యాల ఉపసంహరణ ఘట్టం వగైరా అనేక కీలకాంశాలపై సావధానమైన సమగ్ర చర్చకు అవకాశం లభించడం లేదు. గత నెల 19వ తేదీన మొదలైన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఇంత వరకు ఏ ఒక్క రోజూ సభలు పూర్తిగా జరగలేదు. వరుస వాయిదాలతో కాలం గడిచిపోతున్నది. ఇజ్రాయిలీ దొంగ చెవుల సంస్థ తయారు చేసిన పెగాసస్ అనే నిఘా సాధనం ద్వారా రాహుల్ గాంధీ సహా దేశంలోని అనేక మంది ప్రముఖుల స్మార్ట్‌ఫోన్ల సంభాషణలను, మెసేజ్‌లను ప్రభుత్వం రహస్యంగా తెలుసుకుంటున్నదని ప్రతిష్ఠాత్మకమైన సంస్థలు నిర్వహించిన అంతర్జాతీయ పరిశోధనలో తేలినట్టు చెబుతున్న దానిపై ముందుగా చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి.

ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రస్తుత లేదా మాజీ న్యాయమూర్తి చేత స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. పెగాసస్ నిఘా ఉదంతం దేశ ప్రతిష్ఠను దెబ్బ తీయడానికి సృష్టించిన పచ్చి బూటక వ్యవహారమంటూ ప్రతిపక్ష డిమాండ్లను ప్రభుత్వం అదే పనిగా తిరస్కరిస్తున్నది. మరి పది రోజుల్లో సమావేశాలు ముగింపుకి రానున్నాయి. ప్రతిపక్షాలది బాధ్యతా రహిత ప్రవర్తన అని ఈ ప్రతిష్టంభన వల్ల రూ. 133 కోట్ల ప్రజాధనం వృథా అయిపోయిందని పాలక పక్షం వైపు నుంచి విమర్శ ఊపందుకున్నది. ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై, సమస్యలపై చర్చకు ప్రభుత్వం అంగీకరించనప్పుడు దానిని దారికి తీసుకు రాడానికి దాని ప్రాధాన్యతను బట్టి సభలను స్తంభింప చేయడాన్ని కూడా ఒక విధమైన ప్రజాస్వామ్య విధిగానే గుర్తించవలసి ఉంటుంది. పాలక పక్షాలు తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పద్ధతినే అనుసరించడం తరచూ జరుగుతున్నది. అందుచేత ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు సుదీర్ఘ ప్రతిష్టంభనకు గురవుతున్నందుకు ప్రతిపక్షాన్ని మాత్రమే నిందించడం సబబు కాదు. పెగాసస్ వివాదంలో ప్రజల ప్రాథమిక హక్కు అయిన గోప్యతకు విఘాతం కలిగినట్టు స్పష్టపడుతున్నది.

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఇందుకు తలపడడం ఎంత మాత్రం సమంజసం కాదు. అటువంటి ఆరోపణ ఈస్థాయిలో వచ్చినప్పుడు పాలకులు దాని నుంచి బయటపడడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలి. పార్లమెంటులో చర్చకు అనుమతించడంతోపాటు స్వతంత్రమైన దర్యాప్తు సంస్థ చేత లేదా ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల చేత దానిలోని నిజానిజాలను శోధింప చేయాలి. అదేమీ చేయకుండా అదంతా అబద్ధం, బూటకం అని కొట్టి పారేయడం ఎంత మాత్రం సమంజసం కాదు. ఇటువంటి ఆరోపణలపై, కుంభకోణాలపై సంయుక్త పార్లమెంటరీ సంఘాల చేత కూలంకషమైన దర్యాప్తులు ఆదేశించిన సందరాలున్నాయి. అటువంటి మంచి సంప్రదాయాలను పాటించడానికి ప్రస్తుత పాలకులకున్న అభ్యంతరాలేమిటో తెలియవు. ప్రభుత్వం తన బాధ్యత నుంచి ఈ విధంగా తప్పుకోడం ప్రజాస్వామ్యయుత జవాబుదారీతనం నుంచి పారిపోడంగానే ప్రపంచం పరిగణిస్తుంది. ప్రతిష్టంభనను అడ్డం పెట్టుకొని సాధారణ బీమా వాపార (జాతీయకరణ) సవరణ వంటి అత్యంత ముఖ్యమైన, జన జీవితంపై విశేషంగా ప్రభావం చూపగల బిల్లులకు ప్రభుత్వం మూజువాణి ఓటు మీద లోక్‌సభ ఆమోదం సాధించుకోడం ఎంత మాత్రం ప్రజాస్వామ్యయుతం కాదు.

అత్యంత వివాదాస్పదంగా మారిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు కూడా ఇంతకు ముందు ఇదే రీతిలో ఆదరాబాదరాగా దొడ్డి దారి పద్ధతుల్లో పార్లమెంటు ఆమోదాన్ని సాధించుకున్నారు. పెగాసస్‌పై ప్రభుత్వం వైఖరి జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల మధ్య ఐక్యతను పెంపొందిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు మంగళవారం ఉదయం ఢిల్లీలోని కాన్సిట్యూషన్ క్లబ్‌లో జరిగిన ప్రతిపక్ష నేతల సమావేశమే నిదర్శనం. ఈ ఉదయాహార భేటీకి రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, ఆ పార్టీ ఎంపిలు మాత్రమే కాక ఎన్‌సిపి, శివసేన, సిపిఐ(ఎం), సిపిఐ, ఆర్‌జెడి, సమాజ్‌వాదీ పార్టీ, జెఎంఎం, జెకెఎన్‌సి, ఐయుఎంఎల్, ఆర్‌ఎస్‌పి, కెసిఎం వంటి పార్టీల నేతలు, అతి ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. పెగాసస్ నిఘా వ్యవహారంపై ప్రధాని మోడీ ప్రభుత్వంతో పోరాటానికి ఉమ్మడి వ్యూహాన్ని నిర్మించడం కోసం జరిగిన ఈ సమావేశం అంతటితో ఆగదని ముందు ముందు ప్రతిపక్ష ఐక్యత దిశగా మరిన్ని అడుగులు పడగలవని భావించడానికి ఆస్కారం కలుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకొని పెగాసస్‌పై చర్చకు, స్వతంత్ర దర్యాప్తుకి వీలు కల్పించాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News