Saturday, November 23, 2024

స్వియాటెక్‌కు షాక్

- Advertisement -
- Advertisement -

సెమీస్‌లో పెగులా, సిన్నర్
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ

న్యూయార్క్: ప్రతిష్ఠాత్మకమైన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి టాప్ సీడ్, మాజీ ఛాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలండ్) నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ ఫేవరెట్‌గా భావించిన ఇగా అనూహ్యంగా క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. కాగా, పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ జన్నిక్ సిన్నర్(ఇటలీ) సెమీ ఫైనల్‌కు చేరుకున్నాడు. రష్యాకు చెందిన ఐదో సీడ్ డానిల్ మెద్వెదేవ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సిన్నర్ జయకేతనం ఎగుర వేశాడు. నాలుగు సెట్ల పోరులో సిన్నర్ 62, 16, 61, 64తో జయభేరి మోగించాడు.

తొలి సెట్‌లో సిన్నర్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. తన మార్క్ షాట్లతో విజృంభించిన సిన్నర్ అలవోకగా సెట్‌ను దక్కించుకున్నాడు. అయితే రెండో సెట్‌లో సీన్ రివర్స్ అయ్యింది. ఈసారి డానిల్ పైచేయి సాధించాడు. అద్భుత షాట్లతో అలరించిన డానిల్ ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. పూర్తి ఆధిపత్యం చెలాయించిన డానిల్ ఎలాంటి ప్రతిఘటన లేకుండానే సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే మూడో సెట్‌లో మళ్లీ సిన్నర్ పుంజుకున్నాడు. అద్భుత ఆటతో డానిల్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. కళ్లు చెదిరే షాట్లతో విరుచుకుపడిన సిన్నర్ సునాయసంగా సెట్‌ను కైవసం చేసుకున్నాడు. నాలుగో సెట్‌లో డానిల్ కాస్త పుంజుకున్నా ఫలితం లేకుండా పోయింది.

ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడిన సిన్నర్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి సెమీస్‌కు చేరుకున్నాడు. అంతకుముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో బ్రిటన్‌కు చెందిన 25వ సీడ్ జాక్ డ్రాపర్ విజయం సాధించాడు. పదో సీడ్ అలెక్స్ డి మినార్‌తో జరిగిన పోరులో డ్రాపర్ 63, 75, 62తో జయకేతనం ఎగుర వేశాడు. ఆరంభం నుంచే డ్రాపర్ దూకుడుగా ఆడాడు. ఏ దశలోనూ మినార్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. పూర్తి ఆధిప్యం చెలాయించిన డ్రాపర్ అలవోకగా తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్‌లో మాత్రం డ్రాపర్‌కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయినా చివరి వరకు నిలకడైన ఆటను కనబరిచిన డ్రాపర్ టైబ్రేకర్‌లో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. మూడో సెట్‌లో మాత్రం డ్రాపర్‌కు ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదు. అద్భుత షాట్లతో విరుచుకు పడిన డ్రాపర్ అలవోకగా సెట్‌ను గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లాడు.

జెస్సికా సంచలనం..

మహిళల సింగిల్స్‌లో అమెరికాకు చెందిన ఆరో సీడ్ జెస్సికా పెగులా పెను సంచలనం సృష్టించింది. టాప్ సీడ్ ఇగా స్వియాటెక్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో జెస్సికా అలవోక విజయం సాధించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన జెస్సికా 62, 64తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు టైటిల్ ఫేవరెట్‌గా భావించిన ఇగా క్వార్టర్ ఫైనల్లో పేలవమైన ఆటతో నిరాశ పరిచింది. పెగులాకు కనీస పోటీ కూడా ఇవ్వకుండానే చేతులెత్తేసింది. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన పెగులా అలవోక విజయంతో సెమీస్‌కు చేరుకుంది. మరో క్వార్టర్ ఫైనల్లో అన్ సీడెడ్ కరొలినా ముచోవా (చెక్) విజయం సాధించింది. బ్రెజిల్‌కు చెందిన 22వ సీడ్ హద్దాద్ మైయాతో జరిగిన పోరులో ముచోవా 61, 64తో జయభేరి మోగించింది. పూర్తి ఆధిపత్యం చెలాయించిన ముచోవా అలవోకగా రెండు సెట్లను గెలిచి సెమీస్‌కు చేరుకుంది. ఇంతకుముందు నవారొ, సబలెంకలు సెమీస్‌కు దూసుకెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News