Wednesday, January 22, 2025

పెండింగ్ కేసుల భారం!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: న్యాయ స్థానాల్లో కేసుల పరిష్కారం ఎంత తొందరగా సాగుతున్నదనే దానిని బట్టే దేశంలో కోర్టుల ద్వారా జరగవలసిన న్యాయం స్థాయిని నిర్ణయించగలము. దీనిని పెండింగ్ కేసుల బరువును బట్టి నిర్ధారించవలసింది. సుప్రీంకోర్టులో 71,000, హైకోర్టులన్నింటిలోనూ కలిసి 59 లక్షల కేసులు అపరిష్కృతంగా వున్నట్టు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు గత ఆగస్టులో రాజ్యసభకు తెలియజేశారు. ఇందులో 10491 కేసులు పదేళకు పైగానూ, 42 వేల కేసులు దాదాపు ఐదేళ్ళుగానూ పెండింగ్‌లో వున్నట్టు ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు శీతాకాల సెలవులు ప్రారంభం కావడానికి ముందు రెండు వారాల్లో 20 శాతం కేసుల పరిష్కారం జరిగిందన్న వార్త ఆనందాన్ని కలిగిస్తుంది.

గత జులై 1 నాటికి సుప్రీంకోర్టులో 72,062 కేసులు పెండింగ్‌లో వుండగా, వాటి సంఖ్య సెప్టెంబర్ 1 నాటికి 70,136కి తగ్గింది. శీతాకాల సెలవులకు ముందు చివరి పని దినం ముగిసే సమయానికి ఈ సంఖ్య 68,835కి దిగిపోయింది. సుప్రీంకోర్టులో గల 13 బెంచీలలో ప్రతి ఒక్క ధర్మాసనమూ రోజుకి పది పెండింగ్ కేసులను పది బెయిల్ కేసులను పరిష్కరించాలని నవంబర్ 18న ప్రస్తుత సిజెఐ జస్టిస్ డివై చంద్రచూడ్ తీసుకొన్న నిర్ణయం మంచి ఫలితాలనిచ్చింది. చంద్రచూడ్ బాధ్యతలు తీసుకొన్న నాటి నుంచి మొత్తం 6,844 కేసులు పరిష్కారమయ్యాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎక్కువ సెలవులు అనుభవిస్తున్నారని, బెయిల్ పిటిషన్ల వంటి అప్రధానమైన కేసుల పరిష్కారంలో కాలం ఖర్చు చేస్తున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన విమర్శలకు దీనిని ఆచరణలో చెప్పిన సమాధానంగా పరిగణించవచ్చు.

అయితే ఇంత మాత్రాన న్యాయ స్థానాలపై వున్న పెండింగ్ కేసుల భారం తగ్గిపోయిందని గాని, త్వరలో తగ్గిపోతుందని గాని భావించడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లోనే గాక కింది కోర్టుల్లో కూడా పెండింగ్ కేసుల పరిష్కారం వేగాన్ని పుంజుకోవలసి వుంది. అప్పుడు మాత్రమే దేశంలోని న్యాయ స్థానాల నుంచి సత్వర న్యాయం సిద్ధించాలనే కల రుజువవుతుంది. బెయిల్ కేసుల్లో నిర్ణయాలు తీసుకోకుండా కింది కోర్టులు వాటిని పై కోర్టులకు యథాతథంగా బదిలీ చేయడం వల్ల ఆ భారం చివరికి తమ మీద పడుతున్నదని, బెయిల్‌ను కింది స్థాయిలోనే సునాయాసంగా మంజూరు చేయవచ్చునని సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో ఒక సారి అభిప్రాయపడి వున్నది. దేశంలోని జైళ్ళలో గల ప్రతి పది మంది ఖైదీలలో ఇద్దరు మాత్రమే శిక్ష పడిన వారని, మిగతావారంతా విచారణలోని ఖైదీలేనని, వీరిలో ఎక్కువ మంది అణగారిన సామాజిక వర్గాలకు చెందిన వారేనని తేలింది.

2021 డిసెంబర్ నాటికి దేశంలోని అన్ని జైళ్ళలో కలిసి 50 లక్షల మంది ఖైదీలున్నారు. వీరిలో 77.1 శాతం మంది విచారణలోని ఖైదీలే. కేవలం 22.2 శాతం మందే శిక్షలు అనుభవిస్తున్న వారని జాతీయ నేరస్థుల రికార్డుల విభాగం వెల్లడించింది. కేసులు విచారణకు తీసుకోక ముందు నుంచి జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలు అత్యధికంగా వున్న దేశాల్లో ఇండియా ఆరవది కావడం గమనించవలసిన విషయం. మిగతా ఐదు లీచ్‌టెన్‌స్టీన్, శాన్‌మారినో, హైతీ, గ్యాబన్, బంగ్లాదేశ్. జైళ్ళు శిక్షలు పడిన వారికే గాని, విచారణలోని వారికి కాదని 1979లో లా కమిషన్ వ్యాఖ్యానించింది. మామూలుగానే నత్తకు పాఠాలు చెప్పే మన కేసుల పరిష్కార వేగం కరోనా సమయంలో మరింత తగ్గిపోయింది.

ఈ కాలంలో విచారణలోని ఖైదీల సంఖ్య పెరిగిపోయింది. జైళ్ళలో వున్న వారిలో 95.8 శాతం మంది పురుషులు. వీరు చదువులేని వారు, చాలా తక్కువ చదువు మాత్రమే చదివిన వారే. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్‌సిల జన సంఖ్య 16.6% కాగా, 2021 సంవత్సరాంతానికి విచారణలోని ఖైదీల్లో వారు 22.8%గా వున్నారు. అలాగే శిక్షలు పడి జైలు అనుభవిస్తున్న వారిలో 21.7% మంది ఎస్‌సిలే. అలాగే షెడ్యూల్డ్ తెగల (ఎస్‌టి) వారు జనాభాలో 8.6% కాగా, విచారణలోని ఖైదీల్లో వారు 10.7%గా వున్నారు.

శిక్షలు పడిన వారిలో 14.1% మంది ఎస్‌టిలే. జల్, జమీన్, జంగిల్ (నీరు, భూమి, అడవులు) పై హక్కుల సాధన కోసం పోరాడి జైలుకెళ్ళిన ఆదివాసీల బతుకులు అధికంగా జైళ్ళలోనే ముగిసిపోతున్నాయని మూలవాసీల హక్కుల పరిరక్షణ అంతర్జాతీయ సంస్థ ఐపిఆర్‌ఐ 2022 నివేదికలో పేర్కొన్నది. ఇది ఇటీవలి ధోరణి కాదని బ్రిటిష్ వలస పాలనలోనే 150 ఆదివాసీ తెగలను 1871 నేరస్థ జాతుల చట్టం కింద నేరస్థ జాతులుగా ప్రకటించారని ఈ నివేదిక వెల్లడించింది. అయితే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇన్నాళ్ళకు కూడా ఆదివాసీలకు ఈ దుస్థితి నుంచి పూర్తి విముక్తి లభించలేదని జైళ్ళలో మగ్గుతున్న వారి వివరాలు చెబుతున్నాయి. కేసుల సత్వర పరిష్కారం పుంజుకొనేలా చేయడం ద్వారానైనా కోర్టు ఖర్చులు భరించలేని అణగారిన వర్గాలకు సుదీర్ఘ జైలు జీవితం నుంచి విముక్తి కలిగించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News