చైనా కమ్యూనిస్ట్ అగ్రనేత ఒకరిపై ఆమె పేరుతో వచ్చిన సోషల్‌మీడియా పోస్ట్‌పై వివరణ
బీజింగ్: చైనా టెన్నిస్‌స్టార్ పెంగ్ షువాయి తనపై లైంగిక దాడి జరిగినట్టు సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదని అన్నారు. అలాంటి ఆరోపణ తాను ఏనాడూ చేయలేదని పెంగ్ తెలిపారు. చైనా మాజీ ఉపప్రధాని, ఆ దేశ కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నేత ఝాంగ్‌గవోలీ(75) తనపై లైంగికదాడికి పాల్పడినట్టు నవంబర్ 2న ఆమె సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ కనబడింది. ఝాంగ్ 2018 వరకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ స్టాండింగ్ కమిటీలో సభ్యుడు. దీనికి సంబంధించి బహిరంగంగా ఝాంగ్ ఎలాంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం. అయితే, ఈ అంశం అంతర్జాతీయంగా క్రీడాకారుల మధ్య చర్చకు దారితీసింది.
చైనా భాషలో సింగపూర్ నుంచి వెలువడే లియాన్‌హేజావోబావో అనే దినపత్రిక తన వెబ్‌సైట్ ద్వారా పోస్ట్ చేసిన వీడియోలో ఆమె సోషల్ మీడియాలో వచ్చిన వార్తను ఖండించినట్టు తెలిపింది. తాను ఎక్కువగా బీజింగ్‌లోని ఇంట్లోనే కాలక్షేపం చేస్తానని, రావాలనుకుంటే స్వేచ్ఛగా బయటకు వస్తానని తెలిపింది. ఆ వీడియోను షాంఘైలో ఆదివారం రికార్డు చేసినట్టు పత్రిక తెలిపింది. తాను ఓ ముఖ్యమైన విషయం చెప్పదలిచానని, తాను ఎవరిపైనా లైంగిక వేధింపుల ఆరోపణలు చేయలేదని ఆ పత్రికా విలేకరితో పెంగ్ చెప్పినట్టు ఆ వీడియోలో ఉన్నది. అయితే, పెంగ్ ఖాతా నుంచి ఆ పోస్ట్ ఎలా వచ్చిందన్నదానిపై వివరణ లేదు. ఆమె ఖాతా హ్యాకింగ్‌కు గురైందా అన్నదానిపైనా విలేకరి ప్రశ్నించినట్టు లేదు.