Monday, April 28, 2025

శిథిల గృహం

- Advertisement -
- Advertisement -

చాలాకాలం తర్వాత
ఊరికి పోయిన
తలుపును తెరవంగనే
దూలానికి ఉయ్యాలలూగిన
జ్ఞాపకాలు గుప్పుమన్నాయి

అక్కడక్కడ తూనీగలు
ఆనాటి స్వప్నాల్లా ఎగురుతున్నాయి
దేన్ని ముట్టుకున్నా దుమ్ము
ఇవాళ అది నా పాలిటి గంధప్పొడి
ఇంటి ఆవరణలో గోలీలాటా
గిల్లి దండలు గుర్తుకొస్తున్నాయి
గోడలు గట్టిగానే వున్నాయి
మా అమ్మ కన్నీళ్ళతో
క్యూరింగ్ చేసినవవి

పాత వస్తువులు వెతుకుతుంటే
మా అమ్మ బొట్టు పెట్టె దొరికింది
దిద్దుకున్న కుంకుమ తిలకంతో
మహాలక్ష్మిలా ఉండేది

వంటింటి ముందు నిల్చుంటే
ఎన్నటికీ మరుపురాని
ఆహార పదార్థాలు
నాసికా పుటాలను తాకుతున్నాయి
ముఖ్యంగా రొట్టె కాలుతుంటే లేచే
సువాసనలు అమోఘం
దానికి కారణం కొంత
నాటి మట్టి పొయ్యి కూడా కావచ్చు

జీవికలు మమ్మల్ని
నగరాలకు తరిమేశాయి
అయితే నేను రాసిన కవితలన్నీ
మా బల్లపీటకు అతుక్కునే ఉన్నాయి

మళ్లీ వెనక్కి వెళ్లాలని లేదు గాని
ఆ ఇల్లును వర్తమానంగా అనువదించుకొని
జీవితాన్ని మరింత సుసంపన్నం
చేసుకోవాలని ఉంది
డా.ఎన్.గోపి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News