Wednesday, January 22, 2025

మార్పులేని బ్యాంకర్ల పెన్షన్

- Advertisement -
- Advertisement -

సాధారణంగా అయిదేళ్లకోమారు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల సవరణతో పాటు విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ల పెంపు కూడా జరిగిపోతూ ఉంటుంది. పే రివిజన్ అనగానే కొలువుల్లో ఉన్నవాళ్ళ మాదిరే పదవీ విరమణ పొందినవాళ్లు కూడా లెక్కలేసుకుంటుంటారు. ఇలా సవరణల మూలంగా తమ చివరి జీతం కన్నా ఎక్కువ మొత్తంలో పెన్షన్ పొందుతున్న విశ్రాంత ఉద్యోగులను ప్రస్తుతం తెలంగాణలో చూడవచ్చు. అయితే మన దేశంలో బ్యాంకుల్లో పని చేసి రిటైర్ అయిన లక్షలాది మంది ఉద్యోగుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. 1990 నుంచి పెన్షన్ రివిజన్ కోసం ప్రభుత్వం ముందు పబ్బతి పట్టిన వీరి పరిస్థితి కడు దయనీయంగా ఉండనవచ్చు. ఐబిఎతో చర్చల్లో పాల్గొనే బ్యాంకు యూనియన్ల యునైటెడ్ ఫోరమ్ ఎజెండాలో రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ రివిజన్‌ను రెండో డిమాండ్‌గా ఉన్నా అది చివరకు అపరిష్కృత అంశంగానే మిగిలిపోతూ వస్తోంది. జీతాల పెంపు పైనే పట్టుపట్టడంతో పెన్షన్ పై చర్చ ఎప్పుడూ వాయిదా పడుతూ చివరకు ఈ వృద్ధ జీవులకు నిరాశనే మిగిల్చుతోంది.

మన దేశంలో ప్రైవేట్ రంగంలో మొదలైన బ్యాంకులు 1969, 1980 ల్లో జాతీయం కావడంతో అవి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ఆధీనంలోకి వచ్చాయి. దాంతో 1 జనవరి 1986 నుండి రిటైర్ అయినవారికి పెన్షన్ లభించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. బ్యాంకు యూనియన్లు మాత్రం ముందుగా దీనిని వ్యతిరేకించాయి. ఎందుకంటే ఆ రోజుల్లో పిఎఫ్ వడ్డీ ఎక్కువ, బ్యాంకు పొదుపుపై ఉద్యోగులకు సుమారు 14% వడ్డీ లభించేది. పిఎఫ్ సొమ్మును బ్యాంకులో వేసుకుంటే ప్రభుత్వం ప్రతిపాదించిన పెన్షన్ కన్నా కొంత ఎక్కువ వడ్డీ నెలనెలా రాగా అసలు అలాగే మిగిలేది. దీంతో ప్రభుత్వం ఉద్యోగులకు రెండు అప్షన్లు ఇచ్చింది. వృద్ధాప్యంలో నిలకడ గల ఆదాయం కోరుకునే కొందరు పెన్షన్‌ను ఎంపిక చేసుకున్నారు. యూనియన్ల సూచన ప్రకారం అత్యధికులు పెన్షన్ కోరుకోలేదు. అయితే అయిదేళ్ళల్లోనే అంతా తారుమారైంది. పిఎఫ్, బ్యాంకు వడ్డీలు భారీగా తగ్గడంతో పెన్షన్ లాభదాయకమని ఉద్యోగులకు అర్థమైంది. మాకు కూడా పెన్షన్ కావాలని ఉద్యోగులు కోరితే ప్రభుత్వం మార్చుకొనే అవకాశం ఇవ్వలేదు. పెన్షన్ కోరుకొనేందుకు మరో అవకాశం ఈయమని బ్యాంకర్లు ఆందోళన బాట పట్టక తప్పలేదు.

చివరకు 2000లో ప్రభుత్వం వీలు కల్పించగా దాదాపు ఉద్యోగులంతా పెన్షన్ కోరుకున్నారు. అప్పటి నుండి ఉద్యోగుల జీతాల పెంపు కూడా తగ్గిపోయింది. కంప్యూటర్ల రాకతో ఉద్యోగ సంఘాల ప్రాబల్యం తగ్గిపోయి అన్ని విషయాల్లో ప్రభుత్వానిదే పైచేయి అవుతోంది. అయితే గత 30 ఏళ్లుగా బ్యాంకు ఉద్యోగుల పే రివిజన్ జరిగినా రిటైర్ ఉద్యోగుల పెన్షన్ పెంపు మాత్రం పక్కకు పెడుతున్నారు. ఉద్యోగ సంఘాల సమాఖ్య కూడా సర్వీసులో ఉన్నవారి గురించి పట్టించుకొని పింఛనుదారులను గాలికి వదిలేస్తోంది. 2010 తర్వాత ఉద్యోగంలో చేరినవారికి పెన్షన్ లేకపోవడంతో ఉద్యోగ సంఘాల నేతలకు ఇది పట్టని అంశమైంది. ఇన్నేళ్ళుగా పెన్షన్‌లో ఆరు నెలలకోమారు కొద్దిపాటి డిఆర్ పెంపు తప్ప ఎలాంటి మార్పు లేదు. దీని వల్ల సీనియర్లు విపరీతంగా నష్టపోతున్నారు. 2000లో రిటైర్ అయిన ఉన్నత అధికారి కన్నా ఈ మధ్య పదవీ విరమణ పొందిన క్లర్కు ఎక్కువ పెన్షన్ పొందుతున్నాడు. మూలవేతనంలో సగం పెన్షన్‌గా ఇస్తున్నందున పే రివిజన్లు నోచుకోని సీనియర్ అక్కడే ఉండిపోవలసి వస్తోంది.

2000 లో రిటైర్ అయిన అధికారి మూలవేతనంలో సగం రూ. 10 వేలు అనుకుంటే ఇరువై ఏళ్ల తరవాత రిటైర్ అయిన క్లర్కు మూలవేతనంలో సగం 20 వేలు ఉంటోంది. ఎలాంటి సవరణలు లేకపోవడంతో సీనియర్ రూ. 10 వేల దగ్గరే ఆగిపోతున్నారు. అధికారుల మధ్య ఈ వ్యత్యాసం ఇంకా ఎక్కువగా ఉంటోంది. వైద్యావసరాలకు కూడా పెన్షన్ సొమ్ము సరిపోవడం లేదని సీనియర్లు అంటున్నారు. దేశంలో బ్యాంకింగ్ రంగానికి రిటైరీలు ఎంతో సేవ చేశారని, వీరి బాగోగులు ప్రభుత్వం చూసుకుంటుందని తీయని కబుర్లు చెప్పి పే రివిజన్ చర్చల్లో ఉద్యోగుల నుంచి వీరిని విడగొట్టే ప్రయత్నం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేశారు. అయినా ఉద్యోగ సంఘాలు విశ్రాంత ఉద్యోగులను కలుపుకునే పోయాయి. ఆ వేర్పాటు జరిగితే వీరి సమస్యలను చర్చించే ఈ మాత్రం వేదిక కూడా లేకపోయేది. నవంబర్ 2020లో నిర్మలా సీతారామన్ ఓ ఇంటర్వ్యూలో బ్యాంకు పెన్షనర్లకు సమస్య తీర్చేలా ఐబిఎకు సూచించానని అన్నమాట వీరిలో ఆశను రేకెత్తించినా ఆ విషయం ముందుకు సాగలేదు.
బ్యాంకు ఉద్యోగులకు పెన్షన్ సవరించే అవకాశం లేనే లేదనేది కేంద్రం వాదన.

ఎంప్లాయిస్ పెన్షన్ రెగ్యులేషన్స్, 1995 ప్రకారం అన్ని బ్యాంకుల బోర్డులు తెలిపిన ఆమోదంలో పెన్షన్ రివిజన్ గురించి ఎలాంటి నిబంధన లేదని 31 జులై 2023 నాడు లోక్ సభలో ఆర్థిక సహాయ మంత్రి భగవత్ కరద్ ప్రకటించారు. పెన్షనర్ల తరఫున సుప్రీం కోర్టులో ఉన్న కేసుపై సెప్టెంబర్ 22న ఐబిఎ ఒక అఫిడవిట్ సమర్పించింది. పెన్షన్ ఒప్పందంలో రివిజన్ ప్రస్తావన లేదని, పెన్షన్ పెంచే ఆర్థిక పరిస్థితి బ్యాంకులకు లేదని అందులో ఉంది. అయితే ఉద్యోగులు సమాచార హక్కు ద్వారా పొందిన లెక్కలు వేరే ఉన్నాయి. మార్చి 2022 నాటికే రూ. 3.6 లక్షల కోట్ల పెన్షన్ ఫండ్‌పై వడ్డీ ఇతరాలు కలిపి ఏడాదికి రూ. 61,900 కోట్ల రాబడి ఉంది. అందులోంచి ఏటా రూ. 25,000 కోట్లు మాత్రమే పెన్షన్ చెల్లింపులకు కేటాయిస్తున్నారు. ఇప్పుడున్న పెన్షన్ రెట్టింపు చేసినా నిధుల కొరత ఉత్పన్నం కాదని ఆ లెక్కలు చెబుతున్నాయి. భవిష్యత్తులో పెన్షనర్ల సంఖ్య తగ్గి కోట్లాది రూపాయల మిగులు ప్రభుత్వానికే దక్కుతుంది. చివర్లో ఆ సొమ్మును పెన్షనర్ల కుటుంబాలకు పంచాలనే మాటలో న్యాయముంది.

అయితే 30 ఏళ్ల సమస్యకు పరిష్కారం చూయిస్తున్నట్లుగా ప్రభుత్వం ‘ఎక్స్ గ్రేషియా’ తో ముందుకు వచ్చింది. బ్యాంకర్ల పే రివిజన్ చర్చల్లో భాగంగా 7 డిసెంబర్ 2023 నాడు జరిగిన సమావేశంలో పెన్షనర్లకు ‘ఎక్స్ గ్రేషియా’ చెల్లింపుపై ఐబిఎ, ఉద్యోగ సంఘాల సమాఖ్య మధ్య అంగీకారం కూడా కుదిరింది. ఉదారంగా ఎంతో కొంత సొమ్మును పెన్షన్‌కు అదనంగా ఇచ్చే ఆలోచన ఇది. మళ్ళీ ఎప్పుడైనా సర్కారు దయ తలిస్తే దొరకవచ్చు. గతంలోని అన్ని ఒప్పందాల్లో పెన్షన్ సవరణ గురించి స్పష్టంగా ఉన్నా, తగిన నిధులు ఉన్నా ప్రభుత్వ మొండి వైఖరి, ఉద్యోగ సంఘాల సమాఖ్య నిరాసక్తత కారణంగా బ్యాంకు పెన్షనర్లు న్యాయాన్ని పొందలేకపోతున్నారు. భవిష్యత్తులో కోర్టు తీర్పు ఏనాటికైనా అనుకూలంగా వచ్చినా అది అమలయ్యేదెన్నడో, దాని ఫలం దక్కేది ఎందరికో అనేది విచారకరమైన అంశం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News