న్యూఢిల్లీ : తమ సర్వీసు గురించి 12 ఏండ్లుగా సాగిస్తోన్న న్యాయపోరాటంలో వైమానిక దళానికి చెందిన 32 మంది మహిళా అధికారులు విజయం సాధించారు. వీరికి పూర్తి స్థాయి పింఛన్ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు బుధవారం చారిత్రక తీర్పు వెలువరించింది. భారతీయ వైమానిక దళంలో వీరికి ఐదేళ్ల స్వల్పకాలిక ఉద్యోగాలు ఇచ్చిన సర్వీసు కమిషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా వీరు కోర్టుకు వెళ్లారు. తమకు ఇంతకంటే ఎక్కువ సంవత్సరాలు పనిచేసే హక్కు ఉందని ఈ మహిళా అధికారులు న్యాయస్థానంలో తమ వాదనలు విన్పించారు.
32 మంది ఈ మహిళా అధికారుల కేసు విచారణ ఏకంగా 12 ఏండ్ల పాటు సాగింది. వీరికి అనుకూలంగా తీర్పు వెలువడింది. ఐఎఎఫ్‌లో 20 ఏండ్ల పాటు ఉద్యోగాలలో ఉండే అధికారులతో సమానంగా వీరికి పూర్తి స్థాయి పింఛన్ ఇవ్వాలని కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కోణంలో వీరు తమను పూర్తిస్థాయి ఉద్యోగులుగా తీసుకోవాలనే వీరి న్యాయపోరు ఫలించింది. ఇక ఈ కేసుకు దిగిన వారిలో ముగ్గురు అధికారిణులు వితంతువులు.
దేశానికి వైమానిక రంగ విధుల క్రమంలో ప్రాణాలు వదిలిన వీరి భర్తల సేవకు ప్రతిఫలంగా మానవీయ కారణాలతో వీరికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు 2020 నాటి బబిత పుణియా కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రాతిపదికగా చేసుకుంది. సాయధ బలగాలలో మహిళల రిక్రూట్‌మెంట్ల విషయంలో వివక్ష విధానాలు పాటిస్తున్నారని, సరైన కారణాలు లేకుండానే వారిని ఉద్యోగాల నుంచి ముందుగానే తప్పించడం జరుగుతోందని, ఇది అనుచితం అని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఆధారంగా ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు ఈ ఉద్యోగినులకు న్యాయం చేసింది.