Tuesday, December 24, 2024

మాట వినని సొంత సైనికులను రష్యా మట్టుబెడుతోంది

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై కొద్ది నెలలుగా దాడులు చేస్తోన్న రష్యాపై అమెరికా తీవ్రమైన ఆరోపణలు చేసింది. తమ ఆదేశాలను పాటించని సైనికులను రష్యా చంపేస్తోందని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన సమాచారం తమ దగ్గర ఉందని వెల్లడించింది. ఈ మేరకు వైట్‌హౌస్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌పై ఫిరంగి దాడుల నుంచి వెనక్కి తగ్గాలని ప్రయత్నిస్తే ఆ యునిట్ మొత్తాన్ని చంపేస్తామని రష్యన్ కమాండర్లు హెచ్చరిస్తున్నారనే సమాచారం కూడా తమవద్ద ఉందన్నారు. సరైన శిక్షణ లేని, ఆయుధాలు లేని, యుద్ధానికి సిద్ధంగాలేని వారిని రష్యా సమీకరించిందని జాక్ కిర్బీ పేర్కొన్నారు. పేలవ శిక్షణ పొందిన సైనికులను యుద్ధంలోకి పంపించి రష్యా తన వ్యూహాలను అమలు చేస్తోందని జాక్ కిర్బీ వెల్లడించారు.

ఈ క్రమంలో సైనికులను ఉరితీస్తామని బెదిరించడం అనాగరికమని విమర్శించారు. ఇవన్నీ చూస్తుంటే రష్యా సైనిక నేతల పేలవ పనితీరుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయన్నారు. అయితే కీవ్‌కు అవసరమైన సాయాన్ని అందజేస్తున్నామన్నారు. అమెరికా చేసిన ఈ ఆరోపణలపై అటు రష్యా రక్షణశాఖ, రాయబార కార్యాలయం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఇదే సమయంలో అమెరికాలోని రష్యా రాయబారి అనాటోలి ఆన్‌టోనోవ్ టెలిగ్రామ్‌లో మాట్లాడుతూ ఉక్రెయిన్ సంక్షోభాన్ని ముగించేందుకు బదులు అంతర్జాతీయ స్థాయిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అగ్నికి ఆజ్యం పోయడమేనన్నారు. ఇదిలాఉంటే, ఉక్రెయిన్ తూర్పు భాగంలో ఉన్న అవ్‌డివ్‌కా నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా దళాలు ప్రయత్నిస్తున్నాయని ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News