Saturday, December 21, 2024

టూడోను నమ్ముకుని భారత్‌కు దూరం కావద్దు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : కెనడాతో పోలిస్తే అమెరికా ఇండియాకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని పెంటగాన్ మాజీ అధికారి మైకెల్ రూబిన్ స్పష్టం చేశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారతదేశంపై లేనిపోని అస్యత ఆరోపణలకు దిగుతున్నారని, దీని వల్ల భారతదేశానికి జరిగే ముప్పు కన్నా కెనడాకే ఎక్కువ ప్రమాదం జరుగుతుందని తెలిపారు. అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశం వైపే అనుకూలంగా ఉండాలని సూచించారు. అమెరికాలో గతంలో ఆయన కీలకమైన జాతీయ భద్రత, రక్షణ వ్యవహారాల అధిపతిగా వ్యవహరించారు. ఒట్టావా, న్యూఢిల్లీలో అమెరికా ఎంచుకోవల్సింది ఎవరిననేది పలు కారణాలతో సుస్పష్టం అయి ఉందన్నారు. భారతదేశంతో సంబంధాలకు అత్యంత ప్రాధాన్యత ఇవాల్సి ఉంటుందన్నారు. భారతదేశంతో కొట్లాడటానికి దిగడం అంటే చీమ వెళ్లి ఏనుగుతో ఢీకొన్నట్లే అవుతుందని వ్యాఖ్యానించారు.

కెనడాలో ట్రూడోకు సరైన ఆమోదయోగ్యత లేదని, దయనీయ అప్రూవల్ రేటింగ్‌లో కొట్టుమిట్టాడుతున్నారని పలు సంస్థల విశ్లేషణలతో వెల్లడైందన్నారు. ప్రధానిగా ఆయన ఎక్కువ కాలం ఉండలేరని , ఈ దశలో ఇండియాతో వైరం కొనితెచ్చుకోవడం శ్రేయస్కరం కాదని తెలిపారు. ఇప్పుడు అమెరికా కెనడాతో సంబంధాలు చెడగొట్టుకున్నా ఫర్వాలేదు. ట్రూడ్ తరువాత తిరిగి వీటిని పునరుద్ధరించుకోవచ్చునని తెలిపారు. జస్టిస్ ట్రూడో అనవసరంగా భారతదేశంపై ఆరోపణలకు దిగి సరిదిద్దుకోలేదని తప్పు చేశారని చెప్పారు. భారత ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను ఆయన నిరూపించగలరా? రాజకీయ నిరాశ నిస్పృహలకు లోనయ్యి , ఆరోపణలు చేసి ఉంటారని, కానీ నష్టం ఎవరికి? అని ప్రశ్నించారు. టెర్రరిస్టులను భారతదేశం కాల్చి చంపివేయించిందనే అనుకుందాం, మరి అంతా ఖండిస్తూ వస్తున్న ఉగ్రవాదానికి, ఉగ్రవాదులకు ట్రూడో ఎందుకు ఆశ్రయం ఇచ్చారనే ప్రశ్న వస్తోందని తెలిపారు. ఇండియాలో నిర్ధేశిత టెర్రరిస్టు అయిన హర్దీప్ సింగ్ నిజ్జార్ కెనడాలోని సర్రేలో జూన్ 18న గురుద్వారా వెలుపల హత్యకు గురయ్యాడు.

ఈ ఉదంతం భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలకు దారితీసింది. భారతీయ ఏజెంట్లే తమ దేశానికి వచ్చి , తమ దేశ పౌరుడైన నిజ్జార్‌ను కాల్చిచంపారని ప్రధాని ట్రూడో చెప్పడంతో భారత్, కెనడాల మధ్యచిచ్చుకు దారితీసింది. మైకెల్ రూబిన్ పెంటగాన్ అధికారిగానే కాకుండా అమెరికన్ ఎంటర్‌ప్రైజెస్ ఇనిస్టూట్ విశ్లేషకులుగా ఉన్నారు. ఇరాన్, టర్కీ, దక్షిణాసియా వ్యవహారాలపై మంచి పట్టున్న వ్యక్తి. జస్టిన్ ట్రూడో తనకు తెలిసిన ఇంటలిజెన్స్ సమాచారంతో మాట్లాడుతున్నానని చెప్పారు. అయితే కీలక పదవులలో ఉన్న వారికి ఇటువంటివి పూర్తిగా నిర్థిష్ట స్థితిలో అంది ఉంటాయా? అనేది అనుమానమే. ఫోన్ల ద్వారా కొంత సమాచారం అంది ఉండొచ్చు. దీనిని పూర్తిగా నిర్థారించలేం. అవుననలేం, కాదనలేం, ఇరాక్‌తో యుద్ధం విషయంలోనూ ఇదే జరిగిందన్నారు.

అయినా ట్రూడో మాటలలో పూర్తి స్పష్టత లేదని, సమాచారం అందిందని చెపుతూ ఆయన భారతదేశంపై తీవ్రస్థాయి ఆరోపణలకు దిగారని విమర్శించారు. ఆయన మాటలకు లోనయ్యి, మనం ఫూల్స్ కాకూడదన్నారు. భారతదేశంతో వైరం చివరికి కెనడాకు కొరివితో సయ్యాటకు దిగినట్లే అవుతుందన్నారు. ఈ దశలో అమెరికా ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతుందా? అనే అంశానికి తాను ఈ కోణంలోనే సమాధానం ఇవ్వదల్చుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు అమెరికా ఆలోచించాల్సింది కెనడా గురించి కాదని, చైనా నుంచి తలెత్తే సవాళ్లు, హిందూ మహాసముద్ర ప్రాంతం, పసిఫిక్‌లలో సమస్యల గురించి విశ్లేషించుకోవల్సి ఉందని స్పష్టం చేశారు.

లాడెన్‌ను వేరేచోట మట్టుపెట్టలేదా?
నిజ్జర్‌ను అంతమొందించిన విషయాన్ని ప్రస్తావిస్తూ దీనిని అమెరికా పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో అమెరికా సైనిక కమాండో ఆపరేషన్‌లో అల్‌ఖైదా అధినేత లాడెన్‌ను 2011 మే 2వ తేదీన మట్టుపెట్టిన విషయాన్ని పెంటగాన్ అధికారి ప్రస్తావించారు. నిజ్జర్ కేవలం ప్లంబర్ కాదు. లాడెన్ కేవలం ఓ ఇంజనీరు కాదు. వీరు చేసిన నేరాలతో వీరి చేతులు రక్తంతో తడిశాయి. తగు మూల్యం చెల్లించుకున్నారు. ఇందులో సీమాంతర ఉగ్రవాదం సంగతిని దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు కెనడా విషయంలో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ సీమాంతర అణచివేత అంటూ భారత్‌ను పరోక్షంగా తప్పుపట్టడం అనుచితం అన్నారు. నిజ్జర్ అంశాన్ని సీమాంతర ఉగ్రవాదం కోణంలో చూడాల్సి ఉంది. ఎవరు ఎవరిని అయినా మోసగించుకోవచ్చునేమో కానీ మనను మనం మోసగించుకోకూడదని బ్లింకెన్‌కు ఈ అధికారి చురకలు పెట్టారు. నేరాలకు పాల్పడి వేరే దగ్గర నక్కి వేరే కారణాలతో అంతమైతే ఆరోపణలకు దిగితే భావ్యం అన్పించుకుంటుందా? అని ఈ అధికారి భారత్‌ను సమర్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News