Saturday, November 23, 2024

ఆర్థిక చట్రంలో దుష్ట చతుష్టయం!

- Advertisement -
- Advertisement -

Pentagon security America india japan australia

చతుష్టయం అనగానే దానికి విశేషణ పూర్వపదంగా ‘దుష్ట’ను చేర్చేంతగా మనసులను మలినపర్చిందిమహా భారతం. అదిఆనాటి కులీన కుటిలత్వం. అమెరికా అనగానే దాని అంతర్జాతీయ దుష్టత్వం కనపడుతుంది. అసాంజే, స్నోడెన్‌లు ఈ వాస్తవాలనే బయటపెట్టారు. అమెరికా వారిని దారుణంగా శిక్షించింది. మన పొరుగును ఎంచుకోలేము. మిత్రులను ఎంచుకోవచ్చు. ప్రజల్లో పొరుగు దేశాలపై ద్వేషాన్ని రెచ్చగొట్టి, వాటిని నియంత్రించామని నటించి, ఈ ప్రచారంతో ఎన్నికల్లో గెలవచ్చు. ఇది శాశ్వత నష్టానికి దారి తీస్తుంది.

చతుష్టయం (క్వాడ్) అనబడే చతుర్ముఖ భద్రత ముచ్చట (క్వాడ్రిలేటరల్ సెక్యూరిటి డైలాగ్) ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ల మధ్య వ్యూహాత్మక భద్రత ఏర్పాటు. ఎవరికి ఎవరి నుండి భద్రత కావాలి? చైనా నుండి అమెరికాకు వాణిజ్య భద్రత, జపాన్ కు సరిహద్దు వివాదస్తబ్ధ భద్రత కావాలి. ఈ కూటమిని 2007లో నాటి జపాన్ ప్రధాని షింజో అబే ప్రారంభించారు. ఆయన దీన్ని ప్రజాస్వామ్య ఆసియా విల్లుగా మార్చాలనుకున్నారు. మలబార్ అభ్యాసం పేరుతో ఈ దేశాలు సంయుక్త సైనిక విన్యాసాలు చేశాయి. పెరిగిన చైనా ఆర్థిక శక్తిని ఆపటమే ఈ విన్యాస కూటమి లక్ష్యం. ఈ ఆసియన్ నాటో చతుష్టయానికి చైనా దౌత్య నిరసనలు తెలిపింది. అమెరికా, చైనాల మధ్య పెరిగిన వత్తిళ్లతో ఆస్ట్రేలియా విధానాల్లో అనిశ్చితి మొదలైంది. ఆస్ట్రేలియా ప్రధాని కెవిన్ మైఖేల్ రడ్ 2008లో చతుష్టయం నుండి తప్పుకున్నారు. రద్దయిన ఈ చతుష్టయాన్ని 2017 లో పునఃప్రారంభించారు. సందు దొరికితే మన్ మోహన్ సింగ్‌ను విమర్శించే మోడీ, సింగ్ దూరిన రొచ్చులో ఎందుకు దూకినట్లు? ప్రపంచ పోలీసుకు భయపడ్డారా?

టోక్యోలో 2022 మే 23న 13 దేశాలు కలిసి ఇండో పసిఫిక్ ఆర్థిక శ్రేయో చట్రం (ఐ.పి.ఇ.ఎఫ్) స్థాపించాయి. ఇందులో చతుష్టయానిదే ప్రధాన పాత్ర. బేకర్స్ డజన్‌లో ఒకటిగా ఈ చట్రంలో ఇండియా చేరిందని అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్ సుల్లివన్ అన్నారు. ఊహించని పొరపాట్లకు శిక్ష తప్పించుకోడానికి బేకర్ / వ్యాపారులు కొనుగోలుదారుకు 12కు బదులు 13 వస్తువులు ఇవ్వడాన్ని బేకర్స్ డజన్ అంటారు. ఈ కూటమి లక్ష్యాల యథార్థ పత్రాన్ని అమెరికాసమర్పించింది. శ్రేయో చట్రంలో సాంకేతికత ఆవిష్కరణల, అంకాత్మక (డిజిటల్) ఆర్థిక వ్యవస్థల ఆధారంగా ఆర్థిక వ్యవస్థ పోటీ తత్వాన్ని నిర్వచిస్తారు. ఉన్నతస్థాయి న్యాయబద్ధ స్వేచ్ఛా వాణిజ్య కట్టుబాట్లను నిర్మిస్తారు. చైనా నావికాదళ ఇటీవలి కార్యక్రమాలను, చైనా, రష్యాల సంయుక్త సైనిక అభ్యాసాలను తీక్షణంగా పర్యవేక్షిస్తారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికా నాయకత్వాన్ని, సంబంధాలను బలపర్చటం, అమెరికా కుటుంబాలు, కార్మికులు, వ్యాపారులు, రైతులు, పశు పోషకులకు బలమైన, న్యాయమైన, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం ఈ కూటమి లక్ష్యాలు. ఈ చట్రం కీలక అంశాల్లో చైనా -ప్రత్యామ్నాయాలను అందిస్తుందని అమెరికా వాణిజ్య కార్యదర్శి గిన రైమాండొ అన్నారు. ఈ కూటమి భాగస్వాములకు అమెరికా కంపెనీల వాణిజ్యలబ్ధి లభిస్తుందని ఆమె వివరించారు. ఇది సరఫరా సంకెళ్లను తొలగిస్తుందని అమెరికా అధ్యక్షుడు బిడెన్ అన్నా రు. ఈ ప్రముఖ ప్రేరణలో అవకాశం కల్పించినందుకు మన ప్రధాని మోడీ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

శ్రేయో చట్రంలో ఇండియా వ్యతిరేక అంశాలున్నాయి. కూటమి ముఖ్య లక్షణమైన నిబద్ధ మార్కెట్ సౌలభ్యం మనకు లేదు. ప్రపంచ స్థూల ఉత్పత్తిలో ఈ కూటమివాటా 40%. మార్కెట్ సౌకర్యాలను, ధరల ఉపశమనాలను ఇండియాతో సహా ఇతర సభ్య దేశాలకు ఇవ్వలేదు. వాటికి పర్యావరణ మార్పు నియంత్రణను అప్పజెప్పింది. కార్మిక ప్రమాణాలు, సమాచార అతిక్రమణ, కర్బన నియంత్రణ, సరఫరా సంకెళ్ళ వంటి అంశాల్లోమనకు ముక్కుతాడు బిగించే అవకాశం ఉంది. అమెరికా పూర్వ అధ్యక్షుడు ట్రంప్ ట్రాన్స్- పసిఫిక్ బహుళ జాతి వాణిజ్య ఒప్పందాన్ని బహిష్కరించారు. దీంతో ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ఆర్థిక పట్టును కోల్పోయింది. దాన్ని చైనా సంపాదించుకుంది. అమెరికాకు ఆర్థిక పట్టును ఇవ్వడమే ఈ చట్రం ఉద్దేశం. అమెరికాకు అధిక ధరలను అందించే అధికరణలను ఇందులో పొందు పర్చారు. సమాచార గోప్యత, రక్షణ, స్థానికీకరణల రక్షణ చర్యలు లేవు. అమెరికా నిర్దేశించిన ప్రమాణాలు, నిర్వహణ నియమాలు మనకు హానికరం. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ వాణిజ్య నిపుణుడు బిశ్వజీత్ ధార్ వివరించారు.

చతుష్టయం 2022 మే 22న జపాన్ రాజధాని టోక్యోలో కలిసింది. చట్ట వ్యతిరేక చైనా చేపల వేటను ఎదుర్కోడానికి సముద్రయాన ప్రేరణను ప్రారంభించింది. హిందు, పసిఫిక్ మహాసముద్రాలను, వాటి చట్టూ ఉన్న దేశాలతో కలిసిన భూభాగాలను ఇండో పసిఫిక్ ప్రాంతం అంటారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని నియంత్రించే పనుల్లో భాగంగా ఆ ప్రాంతంలో మౌలిక సౌకర్యాలకు రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. అందులో భారత్ వాటా రూ. లక్ష కోట్లు. జపాన్, అమెరికాల ప్రయోజనాలకు, చైనా అభివృద్ధిని అడ్డుకోడానికి, భారతీయుల శ్రేయస్సును తుంగలో తొక్కి మనం ఇంత సొమ్మును వృథా చేయాలా? దీంతో చైనాకు కోపం రాదా? ఈ సమావేశంలో చతుష్టయం రష్యా-, ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాను తప్పుపట్టింది. మోడీ మౌనం పాటించారు. ఈ అంశంలో పలు సందర్భాల్లో మనం తీసుకున్న తటస్థ పాత్రకు, మన చమురు అవసరాల నియమాలకు నీళ్ళువదిలినట్లు అయింది.

విదేశాల్లో మన పూర్వప్రభుత్వాలను, నేటి ప్రతిపక్షాన్ని విమర్శించి మన ప్రతిష్ఠను మంటకలపడం, సందర్భ రహితంగా ముస్లింలను ఎద్దేవా చేసి హిందు వలస భారతీయులను ఆకట్టుకునే ప్రయత్నం చేయడం, సందర్భోచితంగా అతిథి దేశాన్ని పొగడటం, దాని శత్రు దేశాన్ని తెగడటం మోడీ చతురత. అలవాటుగా గతంలో మోడీ జపాన్ గడ్డపై, ప్రత్యక్షంగా జపాన్, పరోక్షంగా అమెరికా బుజ్జగింపుకు చైనాను విమర్శించారు. జపాన్, చైనాల మధ్య సెంకకు ద్వీపాల సార్వభౌమత్వ, దక్షిణ చైనా సముద్ర వివాదాలున్నాయి. మోడీ విమర్శను చైనా తీవ్రంగా పరిగణించింది. సరైన నిర్ణయం కాకపోయినా భారత సరిహద్దుల్లో చైనా సైనిక చర్యలు దీని ఫలితమే.

చైనాతో సముద్ర సరిహద్దు, జపాన్ తో భూభాగ సరిహద్దు గల దక్షిణ కొరియా, దక్షిణ పసిఫిక్ సముద్ర ద్వీపకల్పం, ఆస్ట్రేలియాకు తూర్పున 2000 కిలోమీటర్ల దూరంలోని న్యూజీలాండ్, చైనాతో సముద్ర సరిహద్దు గల వియత్నాంలకు చతుష్టయంలో ప్రాతినిధ్యం కల్పించారు. చతుష్టయ లక్ష్యం ప్రపంచ (అమెరికా) ప్రయోజనం అంటూనే చతుష్టయం భారత ప్రజల ప్రయోజనానికేనని మోడీ నమ్మపలికారు. మనం ప్రపంచ శ్రేయస్సుకు సాయపడేంతగా అభివృద్ధి చెందామా? ఇది అమెరికా-భారత్ ల ప్రత్యేక బంధాన్ని బలోపేతం చేస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అన్నారు. ఇవన్నీ అబద్ధాలే.
ప్రజా శ్రేయస్సు, ఆర్థికాభివృద్ధి, శాంతిసుస్థిరతలకు పొరుగు పొత్తు అవసరం. అంతర్జాతీయ దృక్పథంతో మంచితో స్నేహం చేయాలి. దుష్టత్వంతో శత్రుత్వం కొనరాదు కాని మిత్రుత్వం కూడదు. అమెరికా కుట్రలను, యుద్ధ సామగ్రి వాణిజ్యాన్ని, మోడీ అమెరికా సౌజన్య పక్షపాతాన్ని (ఔనంటే ఔను కాదంటే కాదనే గుణం) గర్హించాలి. భారత ఆర్థిక వనరులను, ప్రజల ప్రయోజనాలను, భారత సైనికుల ప్రాణాలను కాపాడుకోవాలి.

సంగిరెడ్డి
హనుమంత రెడ్డి
9490204545

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News