టెస్టుల కోసం బస్తీదవాఖానాలకు ప్రజల పరుగులు
కరోనా, సీజనల్ వ్యాధులతో భయాందోళన
జలుబు, దగ్గు, జ్వరంతో పట్టణ ఆరోగ్య కేంద్రాలకు జనం క్యూ
రోజుకు 40నుంచి 50 మందికి పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది
ప్రజలు నిర్లక్షం చేస్తే వ్యాధులు ప్రాణాలకు ముప్పుగా మారుతా యంటున్న జిల్లా వైద్యాధికారులు
మన తెలంగాణ/సిటీబ్యూరో: నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు రోజుకు 40 నుంచి 50మంది పరీక్షల కోసం వస్తున్నట్లు పట్టణ ఆరోగ్య కేంద్రాల సిబ్బంది పేర్కొంటున్నారు. నగరంలో 196 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవాఖానాల్లో ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలున్న వారికి రోజుకు 25 మందికి పరీక్షలు చేసి ఆరగంటలో ఫలితం వెల్లడిస్తున్నారు. ఐదారు రోజుల నుంచి వైద్యం కోసం వచ్చే రోగుల సంఖ్య పెరిగిందంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లితే వేలకు వేలు పరీక్షలకు తీసుకుంటారని జనం ఆలస్యమైన సర్కార్ ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు మొగ్గు చూపుతున్నారని వెల్లడిస్తున్నారు.
ఏప్రిల్, మే, జూన్ నెలలో కరోనా టెస్టులకు జనం బారులు తీయగా, ప్రస్తుతం సీజనల్ వ్యాధులు పెరగడంతో వైరస్ సోకుతుందనే భయంతో టెస్టులు చేసుకుంటున్నారు. దీని దృష్టిలో పెట్టుకుని సరిపడ కిట్లు, సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. అదే విధంగా కరోనా థర్డ్ వేవ్ ముప్పు ఉందని, ఇప్పటికే పలు దేశాలను వణికిస్తుంది. మళ్లీ హైదరాబాద్ నగరంపై విరుచుకపడే ప్రమాదం ఉందని, మార్చి నుంచి నమోదైతున్న పాజిటివ్ కేసులో అత్యధికంగా మహానగరం నుంచే బయటపడుతున్నాయి. మూడో దశలో కూడా భాగ్యనగరంపై వైరస్ పంజా విసురుతుందనే ప్రచారంతో ప్రజలు అప్రమత్త మవుతున్నారు. ఈసారి వైరస్ బారిన పడితే కోలుకోవడం కష్టమని, ముందు జాగ్రత్తలో భాగంగా లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రులకు వెళ్లుతూ పరీక్షలు చేయించుకోవడంతో పాటు, ఆనారోగ్యంగా ఉంటే కావాల్సిన మం దులు తీసుకుంటూ ఆరోగ్యం కాపాడుకునే పనిలో ఉన్నారని వైద్యశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
People affected with viral fever in Hyderabad