బిపి, షుగర్ ఉండడం వల్ల గుండె, కిడ్నీలు, కాలేయం వంటి అవయవాలు దెబ్బతింటున్నాయి
తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలి
వరల్డ్ హార్ట్ డే కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హరీశ్‌రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఒకప్పుడు సంక్రమిత వ్యాధులు(కమ్యూనికబుల్ డిసీజెస్) ఎక్కువగా ఉంటే ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువ అవుతున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కనీస వ్యాయామం చేయకపోవడం, చెడు అలవాట్లు, మానసిక ఒత్తిళ్లు వంటివి దీనికి కారణంగా ఉంటున్నాయని చెప్పారు. ప్రాథమిక దశలోనే వీటిని గుర్తించి చికిత్స తీసుకోకపోవడం వల్ల దీర్ఘకాలిక రోగాలకు కారణం అవుతున్నాయని తెలిపారు. కార్డియాలజిస్ట్ సొసైటీ తెలంగాణ స్టేట్ చాప్టర్ ఆధ్వర్యంలో శుక్రవారం దుర్గం చెరు వద్ద నిర్వహించిన వరల్డ్ హార్ట్ డే కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. ఒక సర్వే ప్రకారం 24 శాతం షుగర్, 14 శాతం బిపి కేసులు ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని, ప్రభుత్వం బిపి, షుగర్ మందులను ఉచితంగా అందిస్తున్నదని పేర్కొన్నారు. బిపి, షుగర్ ఉండడం వల్ల గుండె, కిడ్నీలు, కాలేయం వంటి ముఖ్యమైన అవయవాలు దెబ్బతింటున్నాయని అన్నారు. ఎక్కువగా గుండె సమస్యలకు బిపి ఒక కారణం అవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారని పేర్కొన్నారు.
సకాలంలో సిపిఆర్ చేస్తే ప్రాణాలను కాపాడవచ్చు.
ఆకస్మికంగా వచ్చే కార్డియాక్ అరెస్ట్‌తో మన దేశంలో ప్రతి ఏటా 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని అంచనా అని మంత్రి పేర్కొన్నారు. సమయం, సందర్భం, చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎవరికైనా సడెన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే సకాలంలో కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సిపిఆర్) చేయడం వల్ల వీరి ప్రాణాలు కాపాడటం సాధ్యం అవుతుందని తెలిపారు. జిమ్ చేస్తూ, పనులు చేస్తూ, డ్యాన్స్ చేస్తూ, నడుస్తూ కొంత మంది సడెన్‌గా పడిపోవడం, ప్రాణాలు కోల్పోవడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో, టీవీల్లో చూస్తున్నామని, అలాంటి సందర్భాలలో సిపిఆర్ తెలిసిన వారు ఉంటే సిపిఆర్ చేసి వారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని అన్నారు. అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడే అతి ముఖ్యమైన సిపిఆర్ విధానం గురించి మన దేశంలో 98 శాతం మందికి తెలియదని చెప్పారు.
ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రవ్యాప్తంగా సిపిఆర్‌పై అవగాహన కల్పించి శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారని వెల్లడించారు. ఇందులో భాగంగా, పారామెడికల్ సిబ్బందితో పాటు, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పోలీసు, కమ్యూనిటీ వాలంటీర్లు, ఉద్యోగులు, రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్ల ప్రతినిధులు, సిబ్బంది, కమర్షియల్ కాంప్లెక్స్ వర్కర్స్.. ఇలా వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులకు సిపిఆర్‌పై శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఇందుకోసం అవసరమైన 1,262 ఎఇడి మిషన్లు ప్రొక్యూర్ చేసుకుని, అన్ని పిహెచ్‌సిలు, యుపిహెచ్‌సిలు, బస్తీ దవాఖానల్లో ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. గేటెడ్ కమ్యూనిటీల్లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలపై ప్రచారం కల్పించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఏటా సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డే నిర్వహిస్తుంటారని, ఈ ఏడాది యూజ్ హార్ట్, నో హార్ట్ అనే థీమ్‌తో నిర్వహించుకుంటున్నామని తెలిపారు. బిపి, షుగర్ బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాలని మంత్రి సూచించారు. బాడీ మాస్ ఇండెక్స్‌ను పరిమితిలో ఉంచుకోవాలని,చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పారు. రోజుకు కొంత సమయం వ్యాయామం, ధ్యానం చేసేందుకు కేటాయించాలని, ఒత్తిడికి లోను కాకుండా ఉండేందుకు ప్రయత్నించాలని తెలిపారు. అందరం ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్య తెలంగాణ, ఆరోగ్య భారత్ సాధ్యం అవుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు.