‘మీరు ప్రపంచానికి చేయగలిగిన మహోపకారం ఏదైనా ఉందంటే అది మీరు ఆనందంగా ఉండటమే’ అంటారు సద్గురు జగ్గీ వాసుదేవ్. నిజమే, కానీ ఆ ఆనందాన్ని ఒడిసి పట్టడమెలా అన్నదే అందరినీ వేధించే సమస్య. వాస్తవానికి సంతోషమనేది వచ్చిపోయే చుట్టం లాంటింది. అది శాశ్వతంగా ఏ ఒక్కరి వద్దో ఉండదు. అది ఒక మానసిక స్థితి. మనం చేసే కొన్ని పనులలో మనకు ఆనందం లభిస్తుంది. కానీ, అదే పనిని రోజూ చేస్తూ కూర్చోలేం కదా. వర్షం కురుస్తుంటే ఆ చినుకుల్ని చూస్తూ కూర్చోవడం కొందరికి ఆనందం. ఇంకొందరు రమణీయమైన ప్రకృతిని చూస్తూ పరవశించిపోతారు. ఇంకొందరు తమ ఆనందాన్ని మద్యపానంలో వెతుక్కుంటారు. మరికొందరు తాము చేసే పనిలోనే అపారమైన సంతోషాన్ని ఆస్వాదిస్తారు. ఇదంతా నాణేనికి ఒకవైపు. మన ప్రమేయం లేకుండా సమాజంలో చోటుచేసుకునే మార్పులు, పాలకులు అనుసరించే విధానాల వల్ల కూడా మనకు ఆనందం కలగవచ్చు. ఉదాహరణకు చోరభయం లేనిచోట, నేరాల తీవ్రత కనిపించనిచోట, స్నేహ సౌభ్రాతృత్వాలు వెల్లివిరేసే సమాజం ఉన్నచోట మనకు ఆనందం కలగవచ్చు. అలాంటి దేశాలను సంతోషానికి కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకోవచ్చు. ఆ కోవకు చెందిన దేశమే ఫిన్లాండ్. అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలోని వెల్ బీయింగ్ రీసర్చ్ సెంటర్ విడుదల చేసిన సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్ వరుసగా ఎనిమిదోసారి అగ్రస్థానంలో నిలిచింది. తలసరి ఆదాయం, విద్య, ఆరోగ్యం, ఆత్మసంతృప్తి, జీవనకాలం, అవినీతి, సామాజిక మద్దతు, స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన ఈ జాబితాలో ఇండియా 118వ స్థానంలో ఉండటం కలవరపరిచే విషయం. అయితే, గత ఏడాదితో పోలిస్తే ఇది కాస్త మెరుగైన స్థానమే అని చెప్పాలి. గత ఏడాది ఇండియా 126వ స్థానంలో నిలిచిందన్న సంగతి గమనార్హం. ఆర్థిక ప్రగతి సాధించినంత మాత్రాన ప్రజలు ఆనందంగా ఉన్నట్లు కాదన్న నగ్నసత్యం ఈ జాబితాను బట్టి విశదమవుతోంది. ఉగ్రవాదం, దిగజారిన ఆర్థిక వ్యవస్థ వంటి సమస్యలతో అతలాకుతలమవుతున్న పాకిస్తాన్, సైనిక పాలనతో అట్టుడుకుతున్న మయన్మార్, అతి చిన్న దేశమైన నేపాల్ వంటి పొరుగు దేశాలు సైతం మనకంటే ముందు ఉన్నాయి. విచిత్రమేమంటే 146 దేశాల ఈ జాబితాలో మొదటి పది ర్యాంకుల్లో పెద్ద దేశాలేవీ లేకపోవడం. డెన్మార్క్, ఐస్‌లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్, కోస్టారికా వంటి చిన్న దేశాలే ఫిన్లాండ్ తరువాతి స్థానాలను ఆక్రమించాయి. మరో విశేషమేమిటంటే గాజాను సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకుని, విధ్వంసం సృష్టిస్తున్న ఇజ్రాయెల్ ఎనిమిదో స్థానంలో ఉంది. తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్ఘానిస్తాన్ అట్టడుగు స్థానంలో ఉండగా, సియర్రా లియోన్, లెబనాన్, మలావి, జింబాబ్వే వంటి దేశాలు అఫ్ఘానిస్తాన్ కంటే ముందున్నాయి. ఇక అమెరికాలో ప్రజలు కూడా అంతగా సంతోషంగా లేరనే విషయం ఈ జాబితాను చూస్తే అర్థమవుతుంది. పన్నెండేళ్ల క్రితం 11వ స్థానంలో ఉన్న అగ్రరాజ్యం ఇప్పుడు 24వ స్థానానికి దిగజారింది. ఇండియా విషయానికొస్తే, నిలకడగా సాధిస్తున్న ఆర్థికాభివృద్ధి ప్రజలలో ఏమాత్రం సంతోషం కలిగించడం లేదని అర్థమవుతుంది. సమాజంలో పెరిగిపోతున్న సామాజిక, ఆర్థిక అసమానతలు, మితిమీరుతున్న మానభంగాలు, హత్యలు వంటి నేరాలు, లింగ వివక్ష, పెచ్చుమీరుతున్న అవినీతి వంటివి ప్రజలను సంతోషానికి దూరం చేస్తున్నాయని చెప్పవచ్చు. ఒక కుటుంబం సంతోషంగా ఉండాలంటే జీవనోపాధి ముఖ్యం.అలా చూస్తే, దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం కూడా ప్రజలను సంతోషానికి దూరం చేస్తోందన్నమాట. ఒక మనిషి జీవితంలో సాధించిన విజయాలకు ఆర్థిక ఎదుగుదల ఒక్కటే కారణం కాబోదు. వృత్తిగత జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడం, స్నేహమయ వాతావరణం, ఆహ్లాదకరమైన ప్రకృతి, స్వేచ్ఛ, సమానత్వం వంటివి మనిషిలో ఆనందోత్సాహాలను పెంచుతాయి. తాజాగా విడుదలైన సంతోషకరమైన దేశాల జాబితా చూసైనా మన పాలకులు గుణపాఠం నేర్చుకోవాలి. పొరుగు దేశాలైన పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ కంటే మన దేశం వెనుకబడి ఉండటానికి కారణాలేమిటో పాలకులు కనిపెట్టవలసి ఉంది. ప్రజల మనసెరిగి పథకాలకు రూపకల్పన చేయడం, సమాజాన్ని నేరరహితంగా మార్చేందుకు, స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించేందుకు చర్యలు చేపడితే ప్రజల జీవి తం ఆనందమయమవుతుంది. ఆ ఆనందమే జీవిత మకరందం!
ఆనందానికి మనం అందనంత దూరం
- Advertisement -
- Advertisement -
- Advertisement -