ఆగ్రా(యూపి): తన పార్టీకి ఓటేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న బెదిరింపు ఫోన్‌కాల్స్ ప్రజలకు వస్తున్నాయని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆదివారం ఆరోపించారు. అలాంటి బెదిరింపు కాల్స్‌ను రికార్డు చేస్తే దాని ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ను తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాఖలు చేయగలమన్నారు. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన పోటీదారుగా ఎదిగిందన్నారు. ఆయన ఆగ్రాకు చెందిన బాహ్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ ఈ ఆరోపణలు చేశారు.ఈ ఎన్నికలు ఉత్తర్‌ప్రదేశ్ భవిష్యత్తుకు, దేశ రాజ్యాంగ పరిరక్షణకు ముఖ్యమని ఆయన అన్నారు. ‘బిజెపి ఏమి చేయనుందో ఎవరికీ చివరి వరకు తెలియదని, పెద్ద నోట్ల రద్దు విషయం(డీమానిటైజేషన్) గురించి ప్రజలకు ముందస్తుగా ఏమీ తెలియలేదని’ ఆయన తెలిపారు.
ఎన్నికల ఫలితాలు ప్రకటించే మార్చి 10 తర్వాత తాను కూల్‌డౌన్ అవుతానని యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అన్న దానిని అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. కొవిడ్ రెండో వేవ్‌లో ప్రభుత్వ మిస్ మ్యానేజ్‌మెంట్‌ను ఆయన తప్పుపట్టారు. బిజెపి అవసరమైన ఇంజెక్షన్లు కూడా సరఫరా చేయలేకపోయిందని అన్నారు. సమాజ్ వాదీ పార్టీ కొన్న అంబులెన్స్‌లలోనే రోగులను ఆస్పత్రులకు తరలించారన్నారు. అవసరమనుకుంటే బాహ్‌ను జిల్లాను చేస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆయన ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కునివాళులు సమర్పించారు. “ లతా మంగేష్కర్ మరణ వార్త చాలా దుఃఖ వార్త. ప్రపంచంలో 3000కు పైగా పాటలు పాడిన గాయని లేదు. ఆమె పేరిట ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఏదో ఒకటి చేయగలదు” అని ఆయన అన్నారు.