Saturday, November 23, 2024

పాజిటివ్ ఓటుతోనే హ్యాట్రిక్

- Advertisement -
- Advertisement -

ఎన్నికల సమయంలో జరిగే రాజకీయ విన్యాసాలతో ప్రజల నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు
ఎన్నికల సమయంలో డబ్బుల పంపిణీ, పార్టీలలో చేరికలు వంటి రాజకీయ విన్యాసాలు చూసి ప్రజలు ఎంజాయ్ చేస్తారు
కెసిఆర్ మంచిగ చేసిండు..మళ్లీ రావాలె..
రిస్క్ వద్దు..కెసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని ప్రజలు భావిస్తున్నారు
ప్రజలు చాలా తెలివైన వారు.. అన్ని విషయాలు ఆలోచించి ఓటేస్తారు
ఈసారి 88 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం
బిఆర్‌ఎస్ 3.0లో 2047 విజన్
రేవంత్ తన బాధను రెడ్ల బాధగా, ఈటల తన బాధను ముదిరాజ్‌ల బాధగా చిత్రీకరిస్తున్నారు
రాష్ట్రంలో బిజెపి రేసులోనే లేదు..
కాంగ్రెస్‌కు 40 స్థానాల్లో అభ్యర్థులే లేరు
కాంగ్రెస్, బిజెపిల పార్టీలకు కెసిఆర్ కొరకరాని కొయ్యగా మారారు
తెలంగాణ సిఎం ఎవరుండాలనేది తెలంగాణ గల్లీలో నిర్ణయించాలి
‘మన తెలంగాణ’ ఇంటర్వూలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రాష్ట్రాభివృద్ధి, ఉద్యోగాల కల్పనపై భవిష్యత్తు ప్రణాళిక,
తెలంగాణపై జాతీయ పార్టీలు చేస్తున్న కుట్రలపై కెటిఆర్ సుధీర్ఘ వివరణ

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రజలు మళ్లీ కెసిఆర్‌నే గెలిపించాలని మానసికంగా సిద్ధపడ్డారు…కెసిఆర్ మంచిగ చేసిండు..మళ్లీ రావాలె..రిస్క్ వద్దు..కెసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని ప్రజలు భావిస్తున్నారని భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు అన్నారు. ప్రజలు ఎవరికి ఓటు వేయాలో ముందే నిర్ణయించుకున్నారని, అందులో ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు. ఎన్నికల సమయంలో డబ్బుల పంపిణీ, పార్టీలలో చేరికలు వంటి రాజకీయ విన్యాసాలు చూసి ప్రజలు ఎంజాయ్ చేస్తారు తప్ప వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని తమకు ఎదురైన గత అనుభవాలను కెటిఆర్ ఉదహరించారు.

కెసిఆర్‌ను తెలంగాణ సమాజం ఒక కుటుంబ పెద్దగా భావిస్తోందని వ్యాఖ్యానించారు. కెసిఆర్ కులాల కుంపట్లు రాజెయ్య లేదు..మత విద్వేష మంటలు పెట్టలేదు..ప్రాంతీయ పక్షపాతం చూపలేదు..స్వచ్ఛమైన అచ్చమైన అభివృద్ధి రాజకీయం ఎట్లుంటదో ఆచరించి చూపిన ఆదర్శవాది కెసిఆర్ అని, అట్లాంటి… లీడర్‌ని వదులుకొని కుల పిచ్చి గాళ్లను..మతచిచ్చుగాళ్లను…నెత్తిన పెట్టుకుందామా..? అని ప్రజల్లో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. తెలంగాణలో కెసిఆర్‌కు మిగతా నాయకలకు పోలికే లేదని, కెసిఆర్ నాయకత్వాన్నే ప్రజలు విశ్వసిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు మంచివాళ్లు అని.. ప్రతి ఇంట్లో కుటుంబం మొత్తం కలిసి చర్చించి ఎవరు మంచి చేశారు..ఎవరికి ఓటేస్తే మంచి జరుగుతుందో అని చర్చించుకుని ఎవరికి ఓటు వేయాలో ముందుగానే నిర్ణయించుకుంటారని తెలిపారు. ఎన్నికల సమయంలో జరిగే రాజకీయ విన్యాసాలతో ప్రజలు ముందుగా తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ‘మన తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ, సామాజిక పరిస్థితులు, రాష్ట్రాభివృద్ధి, ఉద్యోగాల కల్పనపై బిఆర్‌ఎస్ భవిష్యత్తు ప్రణాళిక, తెలంగాణపై జాతీయ పార్టీలు చేస్తున్న కుట్రలు తదితర అంశాలపై సుధీర్ఘంగా వివరణ ఇచ్చారు.

రెండు జాతీయ పార్టీలకు కెసిఆర్ కొరకరాని కొయ్య
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలకు కెసిఆర్ కొరకరాని కొయ్యగా మారారని కెటిఆర్ పేర్కొన్నారు. ఎలాగైనా కెసిఆర్‌ను తెలంగాణకే పరిమితం చేయాలనే ఆ రెండు జాతీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కెసిఆర్ తెలంగాణ దాటితే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో ప్రభావం చూపిస్తారని, అందుకే కెసిఆర్‌ను తెలంగాణ దాటనీయొద్దని చూస్తున్నారని అన్నారు. తక్కువ సీట్లతో కెసిఆర్ సిఎం అయితే ఆయనను ఆడించొచ్చని ఆ పార్టీలు భావిస్తున్నాయని, కానీ అది జరగదని పేర్కొన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు ఎదిగితే రెండు జాతీయ పార్టీలు ఓర్వలేకపోతున్నాయని, స్టాలిన్‌ను, అరవింద్ కేజ్రివాల్‌ను చూసి కూడా ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు ఉండాలనేది తెలంగాణ గల్లీలో నిర్ణయం జరగాలి..కానీ ఢిల్లీలో కాదని కెటిఆర్ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్, బిజెపి పార్టీల నేతలు ఏం చేయాలన్నా ఢిల్లీ పోవాల్సిందే అని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లయితే ఢిల్లీ వయా బెంగుళూరు వెళ్లాలని అన్నారు.

లీడర్‌కు కులం ఉండదు
ఒబిసి అయిన నరేంద్ర మోడీ ప్రధాని అయితే ఒబిసిలందరికీ మంచి జరిగినట్లేనా…? గిరిజన వర్గానికి చెందిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయితే గిరిజనులందరికీ మేలు జరిగినట్లేనా…? అని కెటిఆర్ ప్రశ్నించారు. లీడర్‌కు కులం ఉండదని,అన్ని కులాలు, అన్ని వర్గాల ఆమోదం ఉన్నప్పుడే ఎవరైనా నాయకుడిగా ఎదుగుతారని చెప్పారు. కెసిఆర్‌కు సార్వజనీయ ఆమోదం ఉందని…ఆయనను అన్ని కులాల ప్రజలు తమ సొంత మనిషిలా భావిస్తారని అన్నారు. కెసిఆర్ సిద్దిపేట ఎంఎల్‌ఎగా ఉన్నప్పటి నుంచే ఆయనను కులం ఫ్రేమ్‌లో ఫిక్స్ చేసి ఓడించేందుకు వివిధ సామాజిక వర్గాల నేతలను ఆయనపై పోటీకి పెట్టి రకరకాల ప్రయత్నాలు చేశారని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి తన బాధను రెడ్ల బాధగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, అలాగే ఈటల రాజెందర్ తన బాధను ముదిరాజ్‌ల బాధగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బిఆర్‌ఎస్‌పై విశ్వాసంతో ఎర్రశేఖర్, కాసాని జ్ఞానేశ్వర్ వంటి ముదిరాజ్ నేతలతో పాటు ఎంతోమంది రెడ్డి నాయకులు పార్టీలో చేరుతున్నారని చెప్పారు.

నాయకులు మారితే ఓటర్లు మారరు
రాజకీయాలలో లీడర్లు పార్టీలు మారితే ఓటర్లు మారరని కెటిఆర్ తెలిపారు. 2006లో ఉప ఎన్నిక జరిగినప్పుడు కెసిఆర్‌ను ఓడించేందుకు రాత్రికి రాత్రే ఎంతోమంది నాయకులు పార్టీ మారారని, అయినా ఓటర్లలో ఎలాంటి మార్పు రాలేదని తమ గత అనుభవాలను గుర్తు చేశారు.తాను సిరిసిల్లలో మొదటిసారి 171 ఓట్లతో గెలిచానని, తెలంగాణ కోసం రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఎంతమంది నాయకులు పార్టీ మారినా, ఎన్ని డబ్బులు పంచినా ఓటర్లలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పారు. నాయకులు మారినంత మాత్రాన ఓటర్లు మారరు అనేదానికి ఈ సంఘటనలే నిదర్శనమని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లో బిజెపి, కాంగ్రెస్ గెలిచే ఒక్క సీటైనా ఉందా..?
గ్రేటర్ హైదరాబాద్‌లో సెటిలర్లు, మైనార్టీలు తమ వైపే ఉన్నారని కొన్ని పార్టీలు భావిస్తున్నాయని, అయితే హైదరాబాద్‌లో కాంగ్రెస్, బిజెపి పార్టీలు గెలిచే ఒక్క సీటైనా చూపించగలుగుతారా..? అని కెటిఆర్ ప్రశ్నించారు. కెసిఆర్ కుల,మత, ప్రాంత విభేదాలు లేకుండా అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడ్డారని, అందుకే అన్ని వర్గాల ప్రజలు కెసిఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.

కాళేశ్వరం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి
కాళేశ్వరం ప్రాజెక్టుతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని, ఆ ప్రాజెక్టు వల్లనే తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని కెటిఆర్ తెలిపారు. 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ నుంచి 3.5 కోట్ల టన్నుల ధాన్యం సేకరించే స్థితికి తెలంగాణ చేరిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదట ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది అని, ఆ ప్రాజెక్టు ద్వారా వందల కిలోమీటర్లు నీళ్లు తెచ్చి ప్రాజెక్టులో పంపుహౌస్‌లు, కాలువలు తప్ప, ఒక్క రిజర్వాయర్ లేదని విమర్శించారు. కాళేశ్వరం ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయని, వేల కిలోమీటర్ల కాలువలు, వందల కిలోమీటర్ల టన్నల్, బహుళ రిజర్వాయర్లు ఉన్నాయని వివరించారు. ప్రాజెక్టులో సాంకేతిక లోపాలు తలెత్తితే ఆ ప్రాజెక్టును నిర్మించిన కంపెనీనే సరిచేస్తుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులు అనుమతులు ఇచ్చింది కేంద్రమే అని, రాజకీయ కక్షతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతపై రెండు రోజుల్లో అడ్డగోలు నివేదికను ఇచ్చారని ఆరోపించారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు అక్కడ నమూనాలు ఏమైనా సేకరించారా..? పరీక్షలు నిర్వహించారా…? అని ప్రశ్నించారు. రూ.80 వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని అడ్డగోలుగా ఆరోపణుల చేస్తున్నారని విమర్శించారు. సిరిసిల్లలోని తన క్యాంపు ఆఫీసు ప్రాంతం ఒకప్పుడు ఏడాదిగా ఉండేదని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇప్పుడు గోదారిగా మారిందని చెప్పారు.

ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను ఏటా భర్తీ చేస్తాం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిదన్నరేళ్లలో 1,60,283 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని కెటిఆర్ వెల్లడించారు. దేశంలో ఇంత తక్కువ సమయంలో ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం ఏదైనా ఉందా..? అని ప్రశ్నించారు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పదేళ్లలో మొత్తం 10 వేల ఉద్యోగాలే భర్తీ చేసిందని చెప్పారు. ఏడాదికి 16 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. మళ్లీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, ప్రతి సంవత్సరం ప్రభుత్వ రంగంలో ఖాళీ అయిన ఉద్యోగాలు అదే ఏడాది భర్తీ చేస్తామని తెలిపారు. టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు అంత మంచిది కాదని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రశ్నాపత్రాల లీకేజిపై ఎవరు ఫిర్యాదు చేయలేదని, ప్రభుత్వమే లీకేజి వ్యవహారాన్ని గుర్తించి విచారణ జరిపిందని అన్నారు. టిఎస్‌పిఎస్‌సి మెరుగైన పనితీరు కనబరుస్తుందని యుపిఎస్‌సి చైర్మన్ కితాబిచ్చారని గుర్తు చేశారు. టిఎస్‌పిఎస్‌సిలో ఏమైనా లోపాలు ఉంటే, తప్పకుండా ప్రక్షాళన చేస్తామని పేర్కొన్నారు.

టిఎస్‌పిఎస్‌సిలో రిజిష్టర్ చేసుకున్న వాళ్లందరూ నిరుద్యోగులు కాదు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సుమారు 30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం రిజిష్టర్ చేసుకున్నారని, కానీ వారందరూ నిరుద్యోగులు కాదని కెటిఆర్ తెలిపారు. చాలామంది ప్రైవేట్‌తో పాటు వివిధ ఉద్యోగాలు చేసుకుంటూనే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్నారని చెప్పారు. టిఎస్‌పిఎస్‌సి ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలకు మొత్తం 12 లక్షల మంది హాజరయ్యారని, అందులో అన్ని పరీక్షలు రాసే వాళ్లు కూడా ఉన్నారని వివరించారు. తాము అధికారంలోకి వచ్చిన ప్రైవేట్ రంగంలో లక్షల ఉద్యోగాలు కల్పించామని, ఐటి ఉద్యోగాలలో బెంగుళూరును దాటిపోయామని వివరించారు.

ధరణితో ప్రభుత్వ అధికారాన్ని ప్రజల చేతికే ఇచ్చాం
రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వం వద్ద ఉండాల్సిన అధికారాన్ని ప్రజలకే ఇచ్చామని కెటిఆర్ తెలిపారు. భూములపై ప్రభుత్వం వద్ద ఉండాల్సిన 12 విశేష అధికారాలను ప్రజలకు అందించామని వివరించారు. భూ యజమానికి వేలిముద్రకే అన్ని హక్కులు కల్పించామని చెప్పారు. అయితే ఏదైనా కొత్త మార్పు వచ్చినప్పుడు చిన్న చిన్న లోపాలు ఉంటాయని, అలాంటి వాటిని సరిచేస్తామని తెలిపారు.

రేసులోనే లేని బిజెపి గురించి ఏం మాట్లాడాలి..?
రాష్ట్రంలో బిజెపి పార్టీలో రేసులోనే లేదని, అలాంటి పార్టీ గురించి ఏం మాట్లాడాలని కెటిఆర్ అన్నారు. తెలంగాణలో గత ఆరు నెలల్లో బిజెపి గ్రాఫ్ గణనీయంగా పడిపోయిందని అన్నారు. అందులో తమతో ఎంతోకొంత పోటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను, ఆ పార్టీ గత చరిత్రను ఎత్తిచూపుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి 40 స్థానాలలో అభ్యర్థులు లేరని అన్నారు.

ముందుగా అభ్యర్థుల ప్రకటనతో అంతర్గత విభేదాలకు చెక్ పెట్టాం
బిఆర్‌ఎస్ పార్టీ అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించిందని, దాంతో పార్టీలో అంతర్గత విభేధాలకు చెక్ పడిందని కెటిఆర్ పేర్కొన్నారు. తమ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో అందరి కంటే ముందున్నారని చెప్పారు. సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వాలని గతంలో రేవంత్‌రెడ్డి ఎన్నో సార్లు తమపై సవాల్ చేశారని, తాము సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వకపోతే వారిని కాంగ్రెస్ చేర్చుకోవాలని చూశారని అన్నారు. కానీ తమ నాయకుడు కెసిఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి సిట్టింగ్‌లకు సీట్లు ఇచ్చారని తెలిపారు. అలాగే అన్ని పార్టీల కంటే ముందుగా తమ మేనిఫెస్టో ప్రకటించడం వల్ల తమ హామీలపై ప్రజలలో చర్చ జరుగుతోందని చెప్పారు. తమ మేనిఫెస్టోపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుందని, ఇప్పటికే ఎన్నో చేసిన కెసిఆర్, మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేస్తారని విశ్వసిస్తున్నారని అన్నారు.

ఈసారి గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం
2014లో తాము 63 సీట్లతో అధికారంలో వచ్చామని, ఆ తర్వాత మరో 25 సీట్లు పెరిగి 88 సీట్లతో అధికారం చేపట్టామని కెటిఆర్ తెలిపారు. ఈసారి 88 సీట్ల కంటే అధిక స్థానాలు గెలిచి మళ్లీ అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. అయితే గజ్వేల్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేటలో కూడా తమకు పోటీ ఉంటుందని, ఎక్కడా ఏకగ్రీవం కాదని అన్నారు. సిఎం కెసిఆర్‌పై ఓడిపోవడమే తమ గొప్ప అన్నట్లుగా భావించి ఈటల రాజేందర్, రేవంత్‌రెడ్డిలు కెసిఆర్‌పై పోటీకి సిద్ధమవుతున్నారని విమర్శించారు.

రాష్ట్రాభివృద్ధికి ధీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రణాళికలు
బిఆర్‌ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాభివృద్ధికి ధీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రణాళికలు సిద్ధం చేశామని కెటిఆర్ వెల్లడించారు. 2047 వరకు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో అనే ధీర్ఘకాలిక ప్రణాళికతో పాటు స్వల్పకాలిక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఇప్పటికే అన్ని రంగాలలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తూ తెలంగాణ నమూనా దేశానికే ఆదర్శంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉందని పేర్కొన్నారు. తాము మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాల కల్పనపై పటిష్ట ప్రణాళిక రూపొందించామని వివరించారు. త్వరలో అందుబాటులోకి రానున్న ఫాక్స్‌కాన్ కంపెనీ ద్వారా సుమారు లక్ష మంది తెలంగాణ యువతకు ఉపాధి లభిస్తుందని, ఐటీ ఉద్యోగాలలో ఇప్పటికే హైదరాబాద్ బెంగుళూరును దాటిందని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించి ఉద్యోగాల కల్పనను మరింత మెరుగుపరుస్తామని కెటిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News