బిజెపి ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ కౌంటర్
కోల్‌కత: తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సౌగత రాయ్‌ను రాష్ట్ర వ్యాప్తంగా చెప్పులతో కొట్టే రోజు వస్తుందంటూ బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. రాయ్ ఇటీవల తన పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ&ప్రతిపక్ష బిజెపి నాయకుల చర్మాన్ని వొలిచి చెప్పులు కుడతామంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ఘోష్ శుక్రవారం స్పందిస్తూ సౌగతా రాయ్ ఒక సీనియర్ రాజకీయ నేతని, ఒకప్పుడు ఆయన ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారని చెప్పారు. అయితే..ప్రతిపక్షంపై విమర్శించేటప్పుడు ఆయన ఉపయోగించిన భాషకు మేము దిగ్భ్రాంతి చెందామని ఘోష్ తెలిపారు. బిజెపి నాయకుల చర్మాన్ని వొలిచి చెప్పులు కుట్టిస్తామంటూ ఆయన తన కార్యకర్తలకు చెబుతున్నారని, అయితే ఆయనను ప్రజలే చెప్పులతో కొట్టే రోజు ఎంతో దూరంలో లేదని ఘోష్ చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా టిఎంసి నాయకులను ప్రజలే చెప్పులతో కొడతారని కూడా ఆయన అన్నారు. కాగా..తన పార్టీ కార్యకర్తల వద్ద తాను చేసిన వ్యాఖ్యల పట్ల రాయ్ విచారం వ్యక్తం చేశారు. అయితే..తనపై ఘోష్ చేసిన వ్యాఖ్యల పట్ల వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు. చదువు సంధ్యలేని వ్యక్తిపై తాను వ్యాఖ్యానించబోనంటూ రాయ్ అన్నారు. బిజెపి నాయకత్వం విశ్వాసాన్ని కోల్పోయిన ఘోష్ టిఎంసిలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు.