హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లనే ఐటి అభివృద్ధి చెందిందని ఐటి ఉద్యోగులు తెలిపారు. విప్రో సర్కిల్ వద్ద ఐటి ఉద్యోగులు భారీగా చేరుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఐటి ఉద్యోగులు మానవహారంగా నిరసన తెలిపారు. ఐయామ్ విత్ సిబిఎన్ కార్యక్రమానికి పోలీసుల అనుమతి నిరాకరించారు. ఐటి ఉద్యోగులను పోలీసులు చెదరగొట్టారు. భారీగా పోలీసుల మోహరించారు. చంద్రబాబునాయుడు మాకు ఇన్స్పిరేషన్ అని, ఇప్పుడు కూడా బయటకు రాకపోతే తాము వృధా అని, బాబు కోసం కాదు ఎపి అభివృద్ధి కోసం ప్రజలందరూ బయటకు రావాల్సిన అవసరం ఉందని ఐటి ఉద్యోగులు పిలుపునిచ్చారు. సిఎం జగన్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి శూన్యంగా కనిపిస్తోందని, ఎక్కడా అభివృద్ధి లేదు. ఎక్కడిక్కడ అన్యాయం, అక్రమాలు జరుగుతున్నాయని, తమ పిల్లల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలు ముందుకు రావాలని కోరారు.
Also Read: గేదె చోరీ కేసు: 58 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్టు
ఎపిలో సైకో పాలన నడుస్తుందని, చంద్రబాబు అరెస్ట్ అక్రమం, అన్యాయమని మండిపడ్డారు. స్కిల్ డెవలప్ మెంట్ లో ఎలాంటి అక్రమాలు జరగలేదని, కావాలనే కుట్ర చేసి బాబును జైలుకు పంపారని ఐటి ఉద్యోగులు దుయ్యబట్టారు. తాను అవినీతి పరుడు అయితే మిగతా వాళ్లు కూడా అలాగే ఉంటారని జగన్ అనుకుంటున్నారని, హైదరాబాద్ అభివృద్ధిలో బాబు పాత్ర కీలకం పోషించారని, ఆయన వల్లనే ఐటి సెక్టార్ అభివృద్ధి చెందిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎందరికో ఉపాధి లభించిందని, ఎందరో ఇవాళ సొంత కాళ్ల మీద నిలబడ్డారన్నారు.