Sunday, December 22, 2024

ఎస్‌పి హయాంలో భయంతో జనం వణుకు

- Advertisement -
- Advertisement -

బిజెపి ప్రభుత్వ హయాంలో మాఫియా వణుకుతోంది
యుపినిఎస్‌పి మాఫియా ‘సురక్షిత రహస్య స్థావరం’గా మార్చింది
మీర్జాపూర్ ఎన్నికల సభలో ప్రధాని మోడీ

మీర్జాపూర్ (యుపి) : ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి)ని తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. ఎస్‌పి మీర్జాపూర్‌ను అపఖ్యాతి పాల్జేసిందని, ఉత్తర ప్రదేశ్‌ను, పూర్వాంచల్‌ను మాఫియాకు ‘సురక్షిత రహస్య స్థావరం’గా మార్చిందని ప్రధాని మోడీ ఆరోపించారు. ప్రతిపక్ష ఇండియా కూటమిని మతతత్వం, కులతత్వంతో కూడుకున్నదని ఆయన అభివర్ణించారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి రాజ్యాంగాన్ని మార్చాలని వారు నిర్ణయించారని ఆయన ఆరోపించారు. ఎస్‌పిపై ప్రధాని మోడీ మరింతగా విరుచుకుపడుతూ, ఆ పార్టీతో సంబంధం ఉన్నవారికి శాంతి భద్రతలు అయిష్టమని విమర్శించారు. మీర్జాపూర్ లోక్‌సభ సీటులో ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షం అప్నా దళ్ అభ్యర్థి అనుప్రియా పటేల్, రాబర్ట్‌గంజ్ లోక్‌సభ సీటు అభ్యర్థి రింకీ కోల్‌కు మద్దతుగా మీర్జాపూర్‌లో ఒక ఎన్నికల సభలో మోడీ ప్రసంగిస్తూ, ‘ఎస్‌పితో సంబంధం ఉన్నవారు శాంతి భద్రతల పరిస్థితిని శత్రుత్వ భావంతో చూస్తుంటారు.

నిర్బంధిత ఉగ్రవాదులను ఎస్‌పి నాయకులు విడుదల చేయిస్తుండేవారు. ఉగ్రవాదిని పట్టుకున్నందుకు పోలీస్ అధికారులను ఎస్‌పి ప్రభుత్వం సస్పెండ్ చేస్తుండేది’ అని ఆరోపించారు. ఎస్‌పి మీర్జాపూర్‌ను అపఖ్యాతి పాల్జేసిందని, ‘మొత్తం యుపిని, పూర్వాంచల్‌ను మాఫియాకు సురక్షిత రహస్య స్థావరంగా మార్చివేసిందని మోడీ ఆరోపిస్తూ, ఎస్‌పి ప్రభుత్వ హయాంలో జనం భయంతో వణికిపోతుండేవారని, కానీ బిజెపి ప్రభుత్వ హయాంలో మాఫియా భయంతో వణికిపోతోందని చెప్పారు. ‘ఎస్‌పి ప్రభుత్వ హయాంలో ప్రాణం గాని, స్థలం గాని ఎప్పుడు పరుల హస్తగతం అవుతుందో ఎవరికీ తెలియదు. ఎస్‌పి ప్రభుత్వ హయాంలో మాఫియాను వోటు బ్యాంకుగా చూశారు. కానీ ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్, ఆయన ప్రభుత్వం ఇక్కడ నా ప్రక్షాళన కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడం జరుగుతోంది’ అని మోడీ చెప్పారు. ఎస్‌పి, కాంగ్రెస్ వోటు బ్యాంకుకు అంకితం కాగా, మోడీ వెనుకబడిన తరగతులు, నిరుపేదలకు అంకితం అయినట్లు ఆయన ఉద్ఘాటించారు. ‘దేశ ప్రజలు ఇండియా కూటమివారిని అర్థం చేసుకున్నారు. వారు పక్కా మతతత్వ, కులతత్వ, ఆనువంశిక వాదులు. వీరి ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడినా వీరు ఆ ప్రాతిపదికపైనే నిర్ణయాలు తీసుకుంటుంటారు’ అని ఆయన అన్నారు. ఎస్‌పి 2012 యుపి అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టోలో ‘ముస్లింలకు రిజర్వేషన్ కల్పనకు, రాజ్యాంగం మార్పునకు’ వాగ్దానం చేసిందని ఆయన ఆరోపించారు.

‘తుదకు 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఎస్‌పి తమ మేనిఫెస్టోలో ముస్లింలకు రిజర్వేషన్లు ప్రకటించింది. చివరకు పోలీస్ శాఖ, పిఎసి (ప్రొవిన్షియల్ ఆర్మ్‌డ్ కాన్‌స్టబ్యులరీ)లో కూడా ముస్లింలకు 15 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఎస్‌పి ప్రకటించింది’ అని మోడీ తెలిపారు. ‘ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి రిజర్వేషన్లను హస్తగతం చేసుకుని వాటిని ముస్లింకు ఇవ్వాలని ఇండియా కూటమి నిర్ణయించింది. అందుకు వారు అంతిమ మార్గం కనిపెట్టారు. అదే రాజ్యాంగాన్ని మార్చడం. అందుకే వారు రాజ్యాంగాన్ని మార్చాలని కోరుకుంటున్నారు’ అని ప్రధాని మోడీ ఆరోపించారు. సమాజ్‌వాది పార్టీ యాదవ్ సమాజం ప్రతిభను కూడా అలక్షం చేసిందని, ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ఒక మంచి ఇంటిని నిర్మించేందుకు వేర్వేరు మేస్త్రీలను ఎవరూ నియోగించరని, కాని కాంగ్రెస్, ఎస్‌పి కూటమి ఐదు సంవత్సరాల్లో ప్రతి ఏడాదికి ఒకరు వంతున ఐదుగురు ప్రధానులు ఉంటారని చెబుతోందని ఆయన పేర్కొన్నారు.

‘ఐదు సంవత్సరాల్లో ఐదుగురు ప్రధానులను ఎవరైనా ఉంచుతారా చెప్పండి. తన పదవి రక్షణ గురించి ప్రధాని ఆందోళన చెందుతున్నప్పుడు ఆయన దేశాన్ని పటిష్ఠంగా ఉంచగలరా?’ అని ఆయన అడిగారు. ‘అందువల్ల సుదృఢ దేశానికి ప్రధాని కూడా బలంగానే ఉండాలని దేశం నిశ్చయించింది. అందుకే ఎన్‌డిఎ అటువంటి భారీ తీర్పు పొందుతోంది. ఎస్‌పికి వేయడం ద్వారా తమ వోటు వ్యర్థం చేసుకోవాలని ఎవ్వరూ కోరుకోరు’ అని ఆయన చెప్పారు. భోజ్‌పురిలో ‘జై భారత్ మాతా కీ జై, మాతా వింధ్యవాసిని’ అని నినదిస్తూ తన ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోడీ ‘ప్రజల వోట్ల ద్వారానే ‘500 ఏళ్ల తరువాత రామ మందిరం నిర్మాణం సాధ్యమైంది’ అని తెలిపారు. అత్యంత బలమైన బిజెపి, ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పాటును దేశం సాధ్యం చేసిందని ప్రధాని ఉద్ఘాటించారు. యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా సభలో ప్రసంగించారు. మీర్జాపూర్, రాబర్ట్‌గంజ్‌లో ఏడవ దశలో జూన్ 1న పోలింగ్ జరగనున్నది. వోట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News