Sunday, January 12, 2025

బిజెపిని ప్రజలే ఓడిస్తారు: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: కర్నాటకలో బిజెపిని మట్టికరిపించాక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బిజెపిని ఎన్నికల్లో నీళ్లు తాగించగలదన్నారు. బిజెపిని ఓడించేది కాంగ్రెస్ పార్టే కాదు దేశ ప్రజలు ఓడిస్తారన్నారు. బిజెపిదంతా విద్వేష భావజాలం అని రాహుల్ గాంధీ అన్నారు. ‘కర్నాటకలో మేము బిజెపిని ఓడించడం కాదు, వారిని క్షీణింపజేశాము. కర్నాటకలో వారిని చిత్తు చేశాము’ అని శనివారం డిన్నర్ ఈవెంట్‌లో రాహుల్ గాంధీ తెలిపారు. వాషింగ్టన్, శాన్ ఫ్రాన్సిస్కో పర్యటించాక రాహుల్ గాంధీ న్యూయార్క్ చేరుకున్నారు. మాన్‌హట్టన్‌లోని జావిట్స్ సెంటర్‌లో ఆదివారం ఓ కమ్యూనిటీ ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.

‘కర్నాటకలో బిజెపి శతవిధాల ప్రయత్నించింది. వారు మొత్తం మీడియాను తమ వైపుకు తిప్పుకున్నారు. మాకన్నా వారి వద్ద పది రెట్లు ఎక్కువ డబ్బు ఉంది. వారి చేతిలో ప్రభుత్వం, ఏజెన్సీలు ఉన్నాయి. వారి వద్ద అన్నీ ఉన్నా వారు క్షీణించారు’ అని రాహుల్ గాంధీ వివరించారు. ‘ఇంకా నేను మీకొకటి చెప్పాలనుకుంటున్నాను. తదుపరి తెలంగాణలో మేము బిజెపిని క్షీణింపజేస్తాము’ అన్నారు. దానికి అక్కడి జనం ఆనందంతో హర్షధ్వనాలు చేశారు. ‘తెలంగాణ ఎన్నికల తర్వాత బిజెపికి ఇక గడ్డు రోజులే. దక్షిణాదిన ఉన్న తెలంగాణలో ఈ ఏడాది చివరిలోగా ఎన్నికలు జరుగనున్నాయి’ అని ఆయన వివరించారు. రాహుల్ గాంధీ ఈవెంట్‌కు న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ కూడా హాజరయ్యారు.

ప్రజలు హర్షధ్వనాలు చేస్తుండగా రాహుల్ గాంధీ ‘తెలంగాణ ఎన్నికలతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. కర్నాటకలో సాధించినట్టే కాంగ్రెస్ విజయాన్ని ఈ రాష్ట్రాల్లో కూడా సాధించనున్నది’ అన్నారు.
‘బిజెపిని కేవలం కాంగ్రెసే ఓడించడం కాదు, ప్రజలు ఓడిస్తారు. మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ప్రజలు బిజెపిని ఓడిస్తారు’ అని రాహుల్ గాంధీ తెలిపారు. ‘సమాజంలో బిజెపి వ్యాపింపజేస్తున్న విద్వేషంతో దేశం ముందుకు పోదని ప్రజలు గుర్తించారు’ అన్నారు.

‘మరికొన్ని రాష్ట్రాల్లో బిజెపికి శృంగభగం తప్పదు. ఆ తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికలకు మేము ప్రతిపక్షాలను ఐక్యపరుస్తాము. కలిసి పనిచేస్తాము. ఇదో భావజాలానికి సంబంధించిన యుద్ధం. ఒకవైపు బిజెపి భావజాలం, అదంతా విద్వేషంతో నిండుకుని ఉంటుంది. మరోవైపు ప్రేమతత్వపు భావజాలం, ప్రేమించే ఈ భావజాలం కాంగ్రెస్ పార్టీది’ అని ఆయన వివరించారు.

‘కర్నాటకలో బిజెపి విద్వేషపు ఎత్తుగడలువేసింది. స్వయంగా ప్రధానే ప్రచారం చేశారు. అయినా వారి తంత్రం పనిచేయలేదు. కర్నాటక ప్రజలు పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ను మెజారిటీతో గెలిపించారు. నా భారత్ జోడో యాత్రలో…నఫ్రత్ కే బాజార్ మే మొహబ్బత్ కీ దుకాన్ ఖోలేంగే అని నేనన్నాను. ప్రజలు మావైపు నిలిచారు’ అని రాహుల్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News