పిసిసి చీఫ్ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పిసిసి చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ మంగళవారం మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సిఎం అభ్యర్థి ఎవరో కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించబోదని, పంజాబ్ ప్రజలే ఎవరు సిఎం కావాలనేది నిర్ణయిస్తారని సిద్ధూ స్పష్టం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ సిఎంను నిర్ణయిస్తుందని మీకు ఎవరు చెప్పారని మీడియా ప్రతినిధులను సిద్ధూ ప్రశ్నించారు. పంజాబ్ ప్రజలు తమ ఎంఎల్‌ఎలుగా ఎవరుండాలనేది నిర్ణయిస్తారని, సిఎంగా ఎవరు పగ్గాలు చేపట్టాలనేది కూడా ప్రజలే నిర్ణయిస్తారని సిద్ధూతేల్చి చెప్పారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీదళ్, పంజాబ్ లోక్ కాంగ్రెస్‌బిజెపి కూటమి ప్రధానంగా అధికారం కోసం పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా అవతరించడానికి ఆప్ సర్వశక్తులు ఒడ్డుతుండగా, అధికారాన్ని నిలబెట్టుకునేందుకు పాలక కాంగ్రెస్ పోరాడుతోంది. సిద్ధూ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీతో పాటుగా తన పార్టీకే చెందిన పలువురిపై విమర్శలు చేస్తూ ఉండడం తెలిసిందే. ఆయన చేస్తున్న విమర్శలు కాంగ్రెస్ అధిష్ఘానవర్గానికి తలనొప్పిగా మారిన సంఘటనలూ లేకపోలేదు. కాగా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలాంటి సంచలనం సృష్టిస్తాయో వేచి చూడాలి.