Sunday, December 22, 2024

తెలంగాణ ప్రజల్లో బిజెపి పట్ల విశ్వాసం పెరిగింది

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పట్ల ప్రజల్లో విశ్వాసం రోజు రోజుకీ బలపడుతోందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. గత యుపిఏ హయాంలో కాంగ్రెస్ పాలనలో అసమర్థ నాయకత్వం వల్ల ప్రజల పడ్డ ఇబ్బందులు గుర్తుంచుకుని, ప్రస్తుత మోడీ హయాంలో దేశానికి ఉన్న భద్రత, చేసిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని అన్నారు. దీంతో తెలంగాణలో తమ పార్టీకి ఆదరణ బాగా పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం శనివారం ఆయన బిజెపి రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలిచేందుకు తాము విస్త్రత ప్రచారం చేశామని తెలిపారు. ప్రజల్లో పార్టీపై విశ్వాసం పెంచేందుకు పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించామన్న ఆయన మూడోసారి మోడీ సారధ్యంలో కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అబద్ధాలు ఆడడంలో కెసిఆర్, రేవంత్‌రెడ్డిలు ఆరితేరారన్నారు. అధికారం కోసం కేసీఆర్, రేవంత్ రెడ్డి ఎంతకైనా తెగిస్తారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలనే ఇంటి పేరుగా మార్చుకుందని దుయ్యబట్టారు. అబద్ధాలతో కాంగ్రెస్ 70 ఏళ్లుగా రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

తెలంగాణ ప్రజలు చైత్యనవంతులని వారి మాటలు నమ్మరని అన్నారు. గతంలో యుపిఏ ప్రభుత్వంలో పాకిస్తాన్ అరాచకాలు, దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయలేకపోయారని ఆరోపించారు. ఉగ్రవాదాన్ని పెంచి ప్రోత్సహించిందని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గుర్తు చేశారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల పాకిస్థాన్ అరాచకాలకు అడ్డుకట్ట వేయలేకపోయారని కిషన్‌రెడ్డి విమర్శించారు. మోదీ హయాంలో భారత్ బలపడిందని అన్నారు. పాకిస్తాన్ భూ భాగంలో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి వాస్తవాలు అడిగే స్థాయికి కాంగ్రెస్ నాయకులు దిగజారారని, దేశ భద్రతా బలగాలపై కాంగ్రెస్ పార్టీకి ఏనాడూ నమ్మకం లేదని అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన సమయంలో చాలా తక్కువ చేసి మాట్లాడి భద్రతా బలగాలను కాంగ్రెస్ నేతలు అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నందున అణిగిమణిగి ఉండాలని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని అన్నారు. పాకిస్థాన్‌కు అణిగిమణిగి ఉండే అలవాటు కాంగ్రెస్‌కే ఉందని ఎద్దేవ చేశారు. భారతదేశంపై పాకిస్తాన్ చేసే దాడులను పూర్తిగా మోడీ ప్రభుత్వం నిలువరించిందని హర్షం వ్యక్తం చేశారు. బిజెపికి రోజు రోజుకీ మద్దతు పెరుగుతున్నట్లే, బీజేపీ పైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల అసత్యపు ప్రచారాలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అవినీతిపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన నిలదీశారు. అవినీతిని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయకుండా గ్యారంటీలు అమలు చేశామని సిగ్గు లేకుండా ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారని కిషన్‌రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు కోడి గుడ్డు మీద ఈకలు పీకే విధానాన్ని అవలంబిస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కెసిఆర్ ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను గొర్రెలు అనుకుంటున్నారా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. వారి మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏదీ అమలు కాలేదన్నారు. తమ వంద రోజుల పాలన రెఫరెండమనిరేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ రెఫరెండం దేనిపైనో చెప్పాలని కోరారు. కాంగ్రెస్ అవినీతి పైనా..? ఆర్ ఆర్ ట్యాక్స్ పైనా..? లేక ఆరు గ్యారెంటీల అమలుపైనో..? చెప్పాలని నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News