Tuesday, November 5, 2024

అబద్ధపు మాటలు చెప్పే భట్టిని జిల్లా ప్రజలు నమ్మరు..

- Advertisement -
- Advertisement -

నల్గొండ : కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాజెక్టుల ఆలస్యానికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి తో పాటు నేను కారణమంటూ రాజకీయ దుష్ప్రచారం చేస్తున్నారని మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం నల్గొండలోని క్యాంప్ కార్యాలయంలో మీడియా మిత్రులతో చిట్ చాట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాజెక్టుల నేపథ్యము, పరిస్థితులపై భట్టి అవగాహన లేకుండా తమపై విమర్శలు చేస్తున్నారని గుత్తా ఆగ్రహం వ్యక్తం చేశారు.

భట్టి పాదయాత్ర కాంగ్రెస్ అంతర్గత కలహాల యాత్రగా మారిందని, కాంగ్రెస్ నేతల పాదయాత్రలు అన్ అండ్ ఆఫ్ పద్ధతిలో సాగుతున్నాయని ఎద్దేవా చేశారు. చెప్పుడు మాటలతో అవగాహన లేమితో భట్టి జిల్లా ప్రాజెక్టుల పూర్తికి తాను, మంత్రి ఏమీ చేయలేదంటూ విమర్శలు చేస్తున్నాడన్నారు. 1984లో ఎన్టీ రామారావు ప్రభుత్వం శ్రీశైలం సొరంగం ప్రాజెక్టు, ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల పై చర్చ మొదలైనప్పుడు, టన్నెల్ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందునా నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ ఎత్తిపోతలకు ఏఎంఆర్పి ఎత్తిపోతల పథకం తెరమీదకు వచ్చిందన్నారు. ఎన్టీఆర్ హాయంలో ఎత్తిపోతలలో భాగంగా 50 కిలోమీటర్ల మేరకు కాలువ పూర్తవ్వగా, 1989లో వచ్చిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనులను అటకెక్కించిందన్నారు.

జిల్లా ప్రజల సాగునీటి అవసరాల కోసం జలసాధన సమితి సహా ప్రతిపక్షంగా ఉన్న తాము ఆనాడు ఉద్యమాలు చేయడం జరిగిందన్నారు. కోదండపూర్ వద్ద విజయభాస్కర్ రెడ్డి హైదరాబాద్ తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన సందర్భంలో పోలీస్ కాల్పుల ఘటన సైతం చోటుచేసుకుందన్నారు. తదుపరి వచ్చిన ఎన్టీఆర్ ప్రభుత్వం పడిపోయాక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తనతోపాటు కూడిన ఆరుగురు సభ్యుల కమిటీని నియమించి సొరంగం, ఎత్తిపోతలలో ఏది ముందుగా చెపట్టాలన్న దానిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. పర్యావరణ అటవీశాఖ అనుమతులు, సొరంగం త్రవ్వకం ఆలస్యం నేపథ్యంలో ఎత్తిపోతల పథకాన్ని ముందుగా చేపట్టాలని నిర్ణయించి ఈ మేరకు పుట్టంగండి వద్ద ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. 2001లో మొదటి పంపు , 2005లో రెండో పంపు ఏర్పాటుతో హైదరాబాద్కు తాగునీరు, జిల్లా ప్రజలకు సొరంగం ప్రాజెక్టు పరిధిలో ప్రతిపాదించిన ప్రాంతాలకు సాగు, తాగు నీటి వసతి కల్పించమన్నారు.

బిల్లుల భారం లేకుండా హైదరాబాద్ జలమండలి డ్రింకింగ్ వాటర్ కు ఎత్తిపోతల అనుసంధానం చేశామన్నారు. ఆనాడు సుంకిశాల నుండి నల్గొండకు మంచినీళ్లు వద్దని, ముప్పారం ముద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వామపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయగా, మొండిగా ఉదయ సముద్రం రిజర్వాయర్ కు ఏఎంఆర్పి ఎత్తిపోతల లింక్ చేసి 1.5 టీఎంసీల నీళ్లను అందించే ఏర్పాటు చేశామన్నారు. శ్రీశైలం సొరంగం ప్రాజెక్టుకు వైఎస్‌ఆర్ ప్రభుత్వం శంకుస్థాపన చేసినప్పటికీ అంతకు ముందుగానే, ఆసియా లో అతిపెద్ద ఎత్తిపోతల ఏఎమ్మార్పీ ప్రాజెక్టును పూర్తి చేసి 93 చెరువులను నింపి,మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, 500 గ్రామాలకు తాగునీటి వసతి కల్పించే పనులను టిడిపి పూరి చేసిందన్నారు. సొరంగం ప్రాజెక్టుకు లభించిన కఠినమైన పర్యావరణ అటవీ అనుమతులు, టీబిఎం మిషన్స్ ,వరద నీరు సమస్యలతో తవ్వకం పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు. 45 కిలోమీటర్లకు 35 కిలోమీటర్ల సోరంగం పూర్తయిందని, అవుట్ లెట్ పనులు ఆగిపోయినా, ఇన్ లెట్ పనులు కొనసాగుతున్నాయని, బేరింగ్ మిషన్ సమస్యతో నాలుగు నెలలుగా ఆ పనులు కూడా నిలిచిపోయాయన్నారు.

నక్కలగండి వద్ద సొరంగం 7:30 కిలోమిటర్లు, ప్రాజెక్టు పనులు పూర్తికాగా గేట్ల ఏర్పాటు మిగిలిందన్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మూడుసార్లు సమీక్ష చేసి ఎస్‌ఎల్బీసీ కాంట్రాక్టర్ జయప్రకాష్ సంస్థను పిలిచి, ఏటా వందకోట్ల అడ్వాన్స్ ఇస్తూ, విద్యుత్ బిల్లులు కడుతూ పనులు జరిపించేలా ఏర్పాటు చేశారన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే అవగాహన లేకుండా భట్టి సొరంగం ప్రాజెక్టు పనులు మావల్లే ఆలస్యం అవుతున్నాయి అంటూ, జిల్లా సాగు తాగునీటి కోసం తామేమి చేయలేదంటూ పాదయాత్రలో అబద్దాలు చెప్పడం విచారకరమన్నారు. భట్టి మాటలు జిల్లా ప్రజలు నమ్మబోరని వారికి ఎవరేమి చేశారో తెలుసు అన్నారు. సీఎం కేసీఆర్ దేవరకొండ మునుగోడు నియోజకవర్గం ప్రజల కోసం 6,190 కోట్లతో డిండి ఎత్తిపోతల పథకం పనులకు చేపట్టారన్నారు. కాంగ్రెస్ నేతలు కోర్టు స్టేలతో పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు అడ్డుపడ్డారన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుండి 0.5 టిఎంసిల నీటిని డిండి ఎత్తిపోతలకు సీఎం కేటాయించారన్నారు. ఇప్పటికే ఈ పథకం కింద 22 టీఎంసీల రిజర్వాయర్ల నిర్మాణం 90% పూర్తి కావచ్చాయని, 2888 కోట్ల మేరకు ఖర్చు చేశారన్నారు. డిండి ఎత్తిపోతల పూర్తయ్యేదాకా ప్రాజెక్టులు 3.5 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులు కూడా తుది దశకు చేరాయని, ట్రయల్ రన్ పూర్తయింది అన్నారు. ఉదయ సముద్రం ఎత్తిపోతల కింద లక్ష ఎకరాలకు సాగునీటి వసతి లభించనుందన్నారు.

కేసీఆర్ ప్రభుత్వమే ఎస్సారెస్పీ రెండో దశ కాలువలకు కాలేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు అందిస్తుందన్నారు. ఇక భట్టి తనపై మూడు పార్టీలు మారాడు అంటూ చేసిన విమర్శలపై గుత్తా మండిపడ్డారు. చంద్రబాబు తనకు ఎంపీ టికెట్ నిరాకరించిన సందర్భంలో దివంగత వైయస్సార్ ఆహ్వానంతో కాంగ్రెస్ లో చేరి రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచానన్నారు. ఆ పార్టీలో అంతర్గత కలహాలతో వేగలేక తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని గమనించి జిల్లా అభివృద్ధి లక్ష్యంతో బిఆర్‌ఎస్ లో చేరాను అన్నారు. పూటకో పార్టీలో చేరబోతున్నట్లుగా చెప్పే కాంగ్రెస్ నేతల కంటే ఏదో ఒక పార్టీలో చేరి ప్రజల కోసం పనిచేయడమే మేలన్నారు. భట్టి పాదయాత్ర జిల్లాలో రోజుకు కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే ఎందుకు సాగుతుందో ప్రజలకు చెప్పాలన్నారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండకు ప్రియాంక గాంధీని తీసుకువచ్చేదాకా భట్టి పాదయాత్ర నల్గొండకు చేరేటట్లు లేదంటూ గుత్తా చురకలేశారు. అసలు జిల్లా కాంగ్రెస్ ఎంపీల పనితీరుపై తాను సర్వే చేయిస్తే అందులో 5.5% బాగుందంటే 69 శాతం మంది బాగాలేదు అన్నారని తెలిపారు. బిజెపి పార్టీ సీలేరు హైడల్ ప్రాజెక్టును ఏపీలో కలపడంతో పాటు విభజన హామీలు అమలు చేయకుండా తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు.

తెలంగాణలో 24 గంటలు విద్యుత్తు పై భట్టి విక్రమార్క అవగాహన రహితంతో మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రం వచ్చినప్పుడు 7,778 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సమర్ధాన్ని రెట్టింపు చేస్తూ తొమ్మిదేళ్లలో కేటీపీసీ నుండి 600 మెగావాట్లు, లోయర్ జూరాల నుండి 240, పులిచింతలలో 120, కె టి పి ఎస్ స్టేజ్ సెవెన్ నుండి 800, భద్రాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ నుండి 1080, సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ నుండి 1200, చత్తీస్ గడ్ నుండి 1000, పవన విద్యుత్ 128 మెగావాట్లు , సోలార్ విద్యుత్ 5278 మెగావాట్లతో కలిపి మొత్తం 18567 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకున్నామని గుత్తా వివరించారు. టిడిపి, వైయస్సార్ ప్రభుత్వాల హాయంలో విద్యుత్ కోతలు, ధర్నాలు, లాఠీ ఛార్జీలు, కాల్పులు ఇప్పుడు లేవని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News