మహబూబ్‌నగర్ బ్యూరో : గడిచిన మూడు నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు మహబూబ్‌నగర్ జిల్లాలో సైతం కురుస్తున్నాయని, ఈ వర్షాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. చెరువులు, కుంటలు, పెద్ద పెద్ద నాళాల పక్కన ఉన్న ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా ఇళ్లలోకి వర్షపునీరు వచ్చేలా ఉంటే తక్షణమే అధికారులకు విషయాన్ని తెలియజేయాలని కోరారు. ముఖ్యంగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ఫోన్ నంబర్ 08542 .. 241165కు తెలియజేయాలని, ఇది 24 గంటలు పని చేసేలా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
గతంలో వర్షాలు సరిగా లేక జిల్లాలో కరువు పరిస్థితులు ఉండేవని, అలాంటిది తెలంగాణ వచ్చిన తర్వాత హరితహారం, ఇతర కారణాల వల్ల ప్రతి సంవత్సరం మంచి వర్షాలు కురుస్తున్నాయని మంత్రి తెలిపారు. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు లేకుండా నాలలను వెడల్పు చేయటం వంటివి చేస్తున్నామని, అదే విధంగా గణేష్‌నగర్ దగ్గర ఉన్న ఎర్రకుంటకు సంబంధించిన 30, 40 ఏండ్ల కిందటి నాలను పూడ్చివేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, తక్షణమే దానిని పునరుద్ధ్దరిస్తామని తెలిపారు. గణేష్‌నగర్ నుండి పాత మేనక టాకీస్ వరకు మరో నలను కోటీ రూపాయలతో యుద్ద ప్రతిపాదికన వారం రోజుల్లో పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.
అంతేకాక జాతీయ రహదారిపై ఉన్న మరో నాలా పూడుకపోయిందని , దానిని సైతం పూడిక తీసివేస్తామన్నారు. గతంలో రామయ్యబౌలి, బికేరెడ్డి కాలనీలు వర్షపు నీటికి మునిగిపోయవని, కానీ గత మూడు నాలుగు సంవత్సరాలుగా పక్క ప్రణాళికతో వర్షపు నీటిని మళ్లించడం, నాలాలలో పూడిక తీసివేయడం , వాటిని వెడల్పు చేయటం, ఇంకా విస్తరించడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఏ ఒక్క ఇంటిలోకి వర్షపునీరు రాలేదని తెలిపారు. పట్టణంలో మురికి నీటిని శుద్ది చేసేందుకు , మురికి నీరు సవ్యంగా వెళ్లేలా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 276 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని, వచ్చే సంవత్సరం ప్రణాళిక ప్రకారం వీటన్నిటిని పూర్తి చేస్తామని తెలిపారు.
పట్టణంలోని లోతట్టు ప్రాంతాలైన కురహిని శెట్టి కాలనీ, బండ్ల గెరి తదితర కాలనీలన్ని వర్షం నీటి వల్ల ఇబ్బందులు పాలు కాకుండా చూడటంతో పాటు, వర్షపు నీరు, మురికి నీరు వేర్వురుగా వెళ్లే విధంగా ఎస్‌టిపిలు ఏర్పాట్లు చేస్తామని, చెరువు కట్టను పటిషఅటం చేయడం వంటి చర్యలను ఇది వరకే చేపట్టామన్నారు. మున్సిపల్ చైర్మన్ కెసి నర్సిములు, జిల్లా రైతు బంధు కో ఆర్డీనేటర్ గోపాల్ యాదవ్, గొర్రె కాపార్ల సంఘం అధ్యక్షులు శాంతన్నయాదవ్, వైస్ చైర్మన్ గణేష్, మున్సిపల్ అధికారులు కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.