Saturday, February 8, 2025

ప్రజల శక్తే సర్వోన్నతం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రజల శక్తే సర్వోన్నతం అని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఉద్ఘాటించారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బిజెపి భారీ విజయంపై ప్రధాని మోడీ ‘ఎక్స్’ పోస్ట్‌లో ఆ విధంగా స్పందించారు. నగర సర్వతోముఖ అభివృద్ధి కోసం తమ పార్టీ ఏమాత్రం వెనుకాడదని, నగర వాసుల జీవితాలను మెరుగుపరుస్తుందని మోడీ స్పష్టం చేశారు. అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయని ప్రధాని పేర్కొన్నారు. బిజెపికి చరిత్రాత్మక విజయం దక్కించినందుకు ఢిల్లీ వోటర్లకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ‘బిజెపికి ఇంతటి అఖండ విజయం చేకూర్చినందుకు నా సోదర సోదరీమణులు అందరికీ అభినందనలు’ అని మోడీ తెలిపారు. ‘ఢిల్లీ సర్వతోముఖాభివృద్ధికి, నగర ప్రజల జీవితాల మెరుగుదలకు ఏమాత్రం వెనుకాడబోమని గ్యారంటీ  ఇస్తున్నాం.

అభివృద్ధి భారతం నిర్మాణంలో ఢిల్లీ ముఖ్య పాత్ర పోషించేలా కూడా మేము చూస్తాం’ అని మోడీ తెలిపారు. అటువంటి అఖండ విజయం కోసం రేయింబవళ్లు శ్రమించిన బిజెపి కార్యకర్తలను చూసి తాను గర్విస్తున్నానని మోడీ తెలియజేశారు. ‘మరింత శక్తితో ఢిల్లీ ప్రజలకు సేవ చేయడానికి మేము ఇక అంకితం అవుతాం’ అని ఆయన ప్రకటించారు. ప్రధాని ‘ఢిల్లీ గుండెలో ఉన్నారు’ అని, వోటర్లు కేజ్రీవాల్ ‘అద్దాల మేడ’ను ధ్వంసం చేశారని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘వాగ్దానాలు నెరవేర్చనివారికి ఢిల్లీ గుణపాఠం నేర్పింది& తప్పుడు వాగ్దానాలు చేసే వారికి ఇది ఒక ఉదాహరణ కాగలదు’ అని అమిత్ షా అన్నారు. బిజెపి 27 ఏళ్ల తరువాత ఢిల్లీలో తిరిగి అధికార పీఠాన్ని అధిష్ఠిస్తోంది. 70 మంది సభ్యుల శాసనసభలో బిజెపి దాదాపు మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News