ఇప్పుడు శివాజీకి తల వంచి నమస్కరించి లాభం ఏమిటి?
బిజెపి ప్రభుత్వంపై రాహుల్ విమర్శనాస్త్రాలు
కొల్హాపూర్ : లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ శనివారం బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలో ప్రజలను భయపెట్టి, రాజ్యాంగాన్ని, వ్యవస్థలను ధ్వంసం చేసి ఇప్పుడు శివాజీ మహారాజ్ ముందు శిరస్సు వంచి నమస్కరించడం వల్ల ఏమాత్రం లాభం లేదని రాహుల్ అన్నారు. అధికారంలో ఉన్నవారి ఉద్దేశాలు, సిద్ధాంతం తప్పుడివి కనుక మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలో శివాజీ మహారాజ్ విగ్రహం కూలిందని ఆయన ఆరోపించారు. పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హపూర్‌లో మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించే ముందు రాహుల్ గాంధీ బహిరంగ సభలో ప్రసంగించారు.
‘దేశంలో ప్రజలు భయపడేట్లు చేసి, రాజ్యాంగాన్ని, వ్యవస్థలను నాశనం చేసిన తరువాత శివాజీ మహారాజ్ ముందు తల వంచి నమస్కరంచడం వల్ల ఉపయోగం లేదు’ అని ఆయన అన్నారు. శివాజీ మహారాజ్‌కు, ఆయన విగ్రహం కూలడం వల్ల నొచ్చుకున్నవారికి క్షమాపణలు చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీని దృష్టిలో పెట్టుకుని రాహుల్ ఆ వ్యాఖ్యలు చేశారు. మోడీ ఆగస్టు 30న మహారాష్ట్రలో తన పర్యటన సందర్భంగా ప్రసంగిస్తూ, ‘ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం ఒక పేరు లేదా ఒక రాజు కాదు. మాకు ఆయన మా దైవం. ఈరోజు ఆయన పాదాల వద్ద నా శిరస్సు వంచి నా దైవానికి క్షమాపణ చెబుతున్నాను’ అని తెలిపారు. ఆగస్టు 26న కూలిన 35 అడుగుల శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మోడీ నౌకాదళ దినోత్సవం సందర్బంగా నిరుడు డిసెంబర్ 4న ఆవిష్కరించారు. ‘దేశంలో రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి సమానత్వం, సమైక్యత గురించి మాట్లాడే రాజ్యాంగాన్ని పరిరక్షించేది. ఇది శివాజీ మహారాజ్ సిద్ధాంతం.
రెండవ సిద్థాంతం రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నట్టిది’ అని రాహుల్ పేర్కొన్నారు. ‘వారు ఉదయం లేచి, శివాజీ మహారాజ్ ఆశయాలు ఆధారంగా ఉన్న రాజ్యాంగాన్ని ఎలా నాశనం చేద్దామా అని యోచిస్తుంటారు. వారు దేశంలో వ్యవస్థలపై దాడి చేస్తూ, ప్రజలను భయపెడుతూ, బెదరిస్తూంటారు, తరువాత శివాజీ విగ్రహం ముందు తల వంచి నమస్కరిస్తుంటారు. దాని వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. మీరు శివాజీ విగ్రహం ముందు ప్రార్థన చేసేటట్లయితే, మీరు రాజ్యాంగాన్ని పరిరక్షించవలసి ఉంటుంది’ అని రాహుల్ అన్నారు.
‘వారి ఉద్దేశాలు కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నాయి, వాటిని దాచలేరు’ అని ఆయన అన్నారు. ‘వారు శివాజీ మహారాజ్ విగ్రహాన్ని నిర్మించారు. కొన్ని రోజుల్లోనే అది కూలిపోయింది. వారి ఉద్దేశాలు సరైనవి కావు. మీరు శివాజీ విగ్రహాన్ని నిర్మించేటట్లయితే, ఆయన ఆశయాలను పాటించవలసి ఉంటుందనే సందేశాన్ని ఆ విగ్రహం వారికి ఇచ్చింది. వారి సిద్ధాంతం సరైనది కానందునే విగ్రహం కూలింది’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. శివాజీ మహారాజ్ పోరాడిన సిద్ధాంతాన్నే కాంగ్రెస్ అనుసరిస్తున్నదని రాహుల్ చెప్పారు. ఇది ఇలా ఉండగా, స్వాతంత్య్ర యోధుడు, హిందుత్వ సిద్ధాంతకర్త విడి సావర్కార్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల బిజెపి కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించి, ఆయనకు నల్ల జెండాలు చూపారు.