హసన్‌పర్తి/రాయపర్తి: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, బిఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సూచించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెడ్ అలర్ట్ ఉందని ప్రజలకు ఏ సమస్య ఉన్నా అధికారులకు తెలియచేయాలని, ఏ సమయంలో ఏ సమస్య వచ్చినా వెంటనే అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కలెక ్టరేట్‌లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటుచేయాలని కలెక్టర్లకు ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాల్లో, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉన్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి అక్కడికి చేర్చాలని, అలాగే పునరావాస కేంద్రాల్లో వారికి భోజన సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అత్యవసర పరిస్థితుల్లో రెస్కూ టీమ్స్, టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు తదితర అంశాలపై కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో మంత్రి టెలీకాన్షరెన్స్ ద్వారా సమీక్షించారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలపై ఆరా తీసిన మంత్రి అధికారులు అందుబాటులో ఉండాలని చెప్పారు. ఇదే సందర్భంలో తాను సహాయక చర్యల్లో పాల్గొంటునాన్నని, ప్రజాప్రతినిధులు, యువత అధికారులకు సహకరించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.