Monday, January 20, 2025

పరిపాలనలో వచ్చిన మార్పులతో ప్రజలకు మేలు జరగాలి

- Advertisement -
- Advertisement -
  • జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

వికారాబాద్ : పరిపాలనలో వచ్చిన మార్పులతో ప్రజలకు మేలు జరిగేలా పని చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సూపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు శుభప్రద పటేల్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బైండ్ల విజయకుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల్ కుమార్ గౌడ్, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, అడిషనల్ ఎస్పీ మురళీధర్, డీఆర్వో అశోక్ కుమార్, జిల్లా అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు.

సభా కార్యక్రమాన్ని వందేమాతర గీతంతో మొదలుపెట్టారు. కార్యక్రమానికి సభాధ్యక్షులు, ముఖ్యఅతిథి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరేలా పని చేసినట్లయితే ఫలితాలు వస్తాయన్నారు. ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి పనిచేయడం వల్ల సుపరిపాలన సాధ్యమవుతుందని కలెక్టర్ అన్నారు. శాఖల్లో స్పష్టమైన మార్పులతో రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తూ ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. ప్రభుత్వం పరిపాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి పాలన ప్రజల చెంతకే రావడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. పరిపాలన సంస్కరణలో ప్రక్షాళన చేస్తూ ప్రజలకు పరిపాలన సౌలభ్యంగా ఉండే విధంగా జిల్లాలను, మండలాలను నూతనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేసుకొని రెండు రెవెన్యూ డివిజన్లను, రెండు మునిసిపాలిటీలు ఉన్న వాటిని నాలుగు మునిసిపాలిటీలుగా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లాలో 17 మండలాలు ఉండగా నూతనంగా మూడు మండలాలను ఏర్పాటు చేసుకొని పరిపాలన సౌలభ్యాన్ని కల్పించినట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. పరిపాలన అనేది ప్రజల చెంతకు ఉండాలనే ఉద్దేశంతో జిల్లాలో నూతనంగా 216 గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అదేవిధంగా తండాలను, గూడాలను కూడా పంచాయతీలుగా మార్చుకొని వాటి అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా మన రక్షణ కొరకు పోలీస్ వ్యవస్థ పని చేస్తుందని నమ్మకాన్ని కల్పిస్తూ ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని ప్రవేశపెట్టి నూతనంగా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. మహిళల రక్షణ కొరకు షీ టీంల ఏర్పాటు, ఆన్ లైన్ మోసాలకు గురికాకుండా ప్రజలకు పోలీసు యంత్రాంగం అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రెవెన్యూ వ్యవస్థలో వినూత్నమైన మార్పులు తీసుకువచ్చి ధరణి ద్వారా అతి తక్కువ సమయంలో భూముల సమస్యల పరిష్కార దిశగా పనిచేయడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.

అదేవిధంగా వేలి ముద్ర ద్వారా భూముల భద్రతకు ధరణి ఎంతగానో ఉపయోగపడుతుందని, దీనివల్ల భూముల కేసులన్నీ పరిష్కార దిశగా ముందుకు వెళ్లడం జరుగుతుందని ఆయన అన్నారు. పంచాయతీ రాజ్, మున్సిపాలిటీలలో కొత్తగా చట్టాలను తీసుకుని వచ్చి స్పష్టమైన విధివిధానాలతో పాలకవర్గం పని చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తూ సరిగ్గా పనిచేయని పాలకవర్గంపై చర్యలు తీసుకునేలా చట్టాన్ని రూపొందించడం జరిగిందని కలెక్టర్ అన్నారు. గ్రామాల్లో, మున్సిపాలిటీలలో పారిశుద్ధ్యం, విద్యుత్తు, తాగునీరుకై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన అన్నారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో ఎన్నో వినూత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. గ్రామాల్లో పట్టణాల్లో హరితహారం నర్సరీల పెంపకం, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు, వెజ్ అండ్ నాన్ వెజ్ సమీకృత మార్కెట్లను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. బీసీ కమీషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ కోట్లాది సాధించుకున్న తెలంగాణలో ప్రభుత్వం జవాబుదారి తనంతో పని చేస్తుందన్నారు.

1978వ సంవత్సరంలో ఏర్పడిన రంగారెడ్డి జిల్లాకు జిల్లా కేంద్రం కావాలని 40 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ గత ప్రభుత్వాలకు 10 వేల ఉత్తరాలను రాయడం జరిగిందని ఆయన తెలిపారు. వికారాబాద్ ప్రాంత ప్రజల కోరిక మేరకు ఉద్యమ సమయంలో 2010 సంవత్సరంలో తెలంగాణ సిద్ధించాక వికారాబాద్ జిల్లాగా ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్ మాట వాస్తవ రూపం దాల్చి వికారాబాద్ జిల్లాగా ఏర్పడిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తన్న క్రమంలో జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తుందని ఇకముందు కూడా ఇలాగే పనిని కొనసాగిస్తూ జిల్లాభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో హరితహారం కారణంగా ఆరు శాతం పచ్చదనం పెరిగిందని తెలిపారు.

ఇతర రాష్ట్రాలకు పర్యటనకు వెళ్ళినప్పుడు తెలంగాణలో ఉన్న సంక్షేమం ఎక్కడ జరగడం లేదని అధికారుల స్వయంగా చెబుతున్నారంటే ఇది అభివృద్ధికి నిదర్శనమని ఆయన అన్నారు. దేశంలోనే అధిక విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. ప్రజా ప్రతినిధులు తమ పదవిని ఎంజాయ్ చేస్తున్న క్రమంలో ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి ప్రజాప్రతినిధులు సక్రమంగా పనిచేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు. వికారాబాద్ జిల్లాలో అమరవీరులను స్మరించుకునే విధంగా పెద్ద ఎత్తున స్థూపాన్ని నిర్మించుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు.

జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బైండ్ల విజయకుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విధానాల్లో తెలంగాణను సాధించుకున్నామని, ఆదిశగానే మన సమస్యలను మాట్లాడుకుని పరిష్కరించుకోవాలన్నారు. రాబోయే ప్రమాదాలను ముందుగానే గుర్తించి, ఆక్సిజన్ సమృద్ధిగా అందేలా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద మొత్తంలో పెద్ద మొక్కలు మొక్కలు నాటించి అటవీ సంపద పెరగడం వల్ల వర్షపాతం తగ్గకుండా ఉంటుందని వైస్ చైర్మన్ తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక ఉత్పత్తి శక్తులకు కావలసిన వనరులను సమకూర్చుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో 30 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కోటి ఎకరాలకు సాగునీరు అందించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కారకులని ఆయన అన్నారు. అదేవిధంగా విద్యుత్తు ఉత్పత్తి విషయంలో, పరిపాలన సౌలభ్యంతో సాధించిన లక్ష్యాలను చూస్తే దేశంలోనే రాష్ట్రం తలమానికం అయ్యిందని ఆయన గర్వంగా చెప్పారు. అధికారుల సహకారంతో ముందుకు వెళ్ళినట్లయితే బంగారు తెలంగాణ సాధ్యమని ఆయన అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ప్రజలకు సుపరిపాలన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2016లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి వికారాబాద్ జిల్లాగా అవతరించుకొని గత సంవత్సరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా సమీకృత కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. జిల్లా ఏర్పాటు చేసుకొని రెండు మున్సిపాలిటీలు, 2016 గ్రామపంచాయతీ ఏర్పాటు చేసుకొని ప్రజలకు మెరుగైన పాలన అందించడం జరుగుతుందని ఆయన అన్నారు.

ధరణితోపాటు అన్ని శాఖల్లో పాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్కరణలు తీసుకు రావడం జరిగిందని ఆయన తెలిపారు. పాలనతోపాటు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు పరచడం జరుగుతుందని, గత తొమ్మిది సంవత్సరాలుగా చేపట్టిన సంస్థలు అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు సమర్ధంగా అమలు చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ (జడ్పీ సీఈవో) జానకి రెడ్డి, మిషన్ భగీరథ ఎస్‌ఈ ఆంజనేయులు, నీటిపారుదల శాఖ ఇఇ హెప్సీనాథ్ , వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, పంచాయతీ శాఖ అధికారి తరుణ్ కుమార్ (డిపిఓ), టిఎస్‌ఎస్పీడిసీఎల్ ఎస్‌ఇ జయరాజ్ , పోలీస్ శాఖ అడిషనల్ ఎస్పీ మురళీధర్ తమ శాఖలు చేపట్టిన, చేపడుతున్న పనులపై నివేదికలను సూచిస్తూ మాట్లాడారు.

సుపరిపాలన దినోత్సవం కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సుశీల్ కుమార్ గౌడ్, వికారాబాద్, తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్లు చిగుళ్లపల్లి మంజుల రమేష్, స్వప్న పరిమల్ లతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News