ఎఐసిసి రాష్ట్ర ఇన్‌చార్జ్ థాక్రే, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్: సోనియా గాంధీ సభకు ప్రతి గ్రామం నుంచి జనం రావాలని ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ థాక్రే పిలుపునిచ్చారు. ఆదివారం డీసీసీ అధ్యక్షులతో ఆయన జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా థాక్రే మాట్లాడుతూ.. ఈ నెల 17న జరిగే విజయ భేరి సభను విజయవంతం చేయాలన్నారు. ఈ రోజు నుంచే మండలాల్లో సమావేశాలు నిర్వహించాలన్నారు. 35 వేల బూత్ ల నుంచి ప్రజలను తరలించాలన్నారు. సభ తరువాత 18న జరిగే కార్యక్రమాలను ఏఐసీసీ నాయకులతో కలిసి నిర్వహించాలన్నారు. “తిరగబడదాం.. తరిమికొడదాం అనే నినాదంతో బిజెపి, బిఆర్‌ఎస్ ఛార్జ్ షీట్ ను గ్రామ గ్రామానికి చేర్చాలన్నారు. 5 గ్యారంటీలను ఊరూరా ప్రచారం చేయాలన్నారు.
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 17న సాయంత్రం 5 గంటలకు విజయభేరీ సభ ఉంటుందని తెలిపారు. 119 శాసనసభ నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో సమావేశాలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. సోమవారం 17 పార్లమెంట్ అబ్జర్వర్లు, వైస్ ప్రెసిడెంట్స్ తో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం..12, 13,14 మూడు రోజులు పాటు పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో సమీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా పార్టీ అధ్యక్షుడి సమన్వయంతో ముందుకు వెళ్లాలని తెలిపారు. 17న రాజీవ్ గాంధీ ప్రాంగణంలో విజయభేరీ సభలో సోనియాగాంధీ ఐదు గ్యారంటీలను విడుదల చేస్తారన్నారు. 18న ఉదయం 11 గంటలకు 119 నియోజకవర్గాలకు జాతీయ నాయకులు చేరుకుంటారని, వాళ్లతో కలసి కార్యక్రమాలు చేయాలని సూచించారు.ఇంటింటికి గ్యారంటీ కార్డులను అందచేయాలన్నారు. అనంతరం సామూహిక పంక్తి భోజనాలు చేయాలన్నారు.మండలాల వారీగా ప్రెస్ మీట్స్ పెట్టి ఐదు గ్యారంటీలను వివరించాలన్నారు.
సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. విజయభేరి బహిరంగ సభకు జాతీయ స్థాయిలో ఉన్న అగ్ర నేతలు హాజరు అవుతున్నారని అన్నారు. మండల, నియోజకవర్గ స్థాయిలలో నాయకులు పూర్తిగా పాల్గొని ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలన్నారు. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ మాట్లాడుతూ.. ఈ విజయభేరీ బహిరంగ సభ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు పౌర సన్మానంలాగా నిర్వహించాలన్నారు. రాజకీయ సభలాగా కాకుండా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు అన్ని జిల్లాల డీసీసీలు పాల్గొన్నారు.