Monday, December 23, 2024

తెలంగాణలో వచ్చిన మార్పును ప్రజలు గమనించాలి

- Advertisement -
- Advertisement -

వనపర్తి : తెలంగాణలో 9 ఏళ్లలో వచ్చిన మార్పులను ప్రజలు గమనించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పెయింటర్స్, భవన ప్లోరింగ్ కార్మికులు, కంచిరావుపల్లి గ్రామం నుంచి ఎంఎస్‌ఎఫ్ నుంచి, ఏఐఎస్‌ఎఫ్ నుంచి, కాంగ్రెస్, బిజెపి, ఇతర పార్టీల కార్యకర్తలు, వివిధ సంఘాల నాయకులు దాదాపు 2 వేల మందికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో ఎక్కడ భూమి బీడుగా లేకుండా పంట పొలాలుగా మార్చిన ఘనత సిఎం కెసిఆర్, తెలంగాణ ప్రభుత్వానిదేనని అన్నారు. ఏ పని చెయ్యని వారికంటే కాయాకష్టం చేసే వారే గొప్పవాడని అన్నారు.

విద్యార్థులకు ఉన్నతమైన విద్య అందించడం లక్షంగా అనేక విద్యాలయాలు వనపర్తికి తీసుకువచ్చామన్నారు. వనపర్తి జిల్లా చేయడం మూలంగా 54 శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని అన్నారు. తెలంగాణలో 65 లక్షల కుటుంబాలకు రూ. 72 వేల కోట్లు రైతు బంధు అందించామని అన్నారు. తెలంగాణ వస్తే ఏం వస్తుందన్న దానికి ప్రతి ఒక్కరికి పని లభించడమే నిదర్శనమన్నారు. రోడ్లు,తాగునీరు, కరెంట్, కళ్యాణలక్ష్మి, కెసిఆర్ కిట్, ఆసరా, వితంతు, దివ్యాంగుల ఫించన్లు, తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.

పెద్ద ఎత్తున కరెంట్ నిరంతరాయ సరఫరా కోసం సబ్ స్టేషన్‌లు ఏర్పాటు చేశామని అన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలతో ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందన్నారు. గతంలో సేద్యం చేయాలంటే కరువు కాటకాలతో సాగునీరు లేక, కరెంట్ రాక సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. వ్యవసాయం వదిలేసి పొలాలు బీడు పెట్టి మట్టి పనులకు, తట్టి పనులకు వెళ్లేవారని అన్నారు. మూడు నెలలకు ఒకసారి రేషన్ కార్డు పంపి కంట్రోల్ బియ్యం తీసుకోమని గ్రామంలో ఉన్న వారికి చెప్పి బియ్యం తీసుకుని వెళ్లేవారని, తెలంగాణ రాక ముందు 10, 20 ఎకరాల ఉన్న వారు కూడా ఎన్నడు సక్కగా బతికింది లేదని, పట్నం వెళ్లి వారు పనులు చేసుకునేవారని గుర్తు చేశారు. పేదోడు కనిపించేలా పనిచేస్తే పెద్దోడు కనిపించకుండా కష్టం చేసుకుని జీవనం వెళ్లదీసుకున్నారన్నారు.

ఆ స్థితి నుంచి నేడు ఎకరా భూమి ఉన్న రైతు కూడా తన భూమి తానే సాగు చేసుకుని ఖాళీ సమయంలో కూలి పని చేసుకుని గ్రామంలో సుఖంగా జీవించగలిగే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా వినోద్, కళ్యాణ్, రామకృష్ణ, రాఘవేంద్ర, బాలకృష్ణ, బాలరాజు, రాజు, విజయ్, చిన్న, శ్రీను, తదితరులు పార్టీలో చేరారు. కాంగ్రెస్ మాజీ ఎస్సి సెల్ జిల్లా కన్వీనర్ కొమ్ము చెన్నయ్య, ఎంఎస్‌ఎఫ్ జిల్లా కన్వీనర్ జి. రాజేష్, ఎంఎస్‌ఎఫ్ జిల్లా కో కన్వీనర్ డి.శ్రీనాథ్, ఎం. శివ, టౌన్ ప్రెసిడెంట్, ఏఐఎస్‌ఎఫ్ డి. రాంబాబు, జిల్లా మాజీ కన్వీనర్ జి. హరీష్, ఏఐఎస్‌ఎఫ్ టౌన్ ప్రెసిడెంట్, నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులతో కలిసి 300 మందితో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News