ఎడపల్లి మండలంలో వరుస దొంగతనాలతో మండల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. బుధవారం రాత్రి ఒకే రోజు 5 చోట్ల దొంగతనాలు జరుగడంతో వ్యాపారస్తులు భయాందోళనకు గురయ్యారు. మండల కేంద్రంలోని సాటాపూర్ గేట్ వద్ద ఒక పాన్ షాపులో దొంగలు లక్ష రూపాయల వరకు దోచుకెళ్లారని షాప్ యజమాని తెలిపారు. అక్కడే మరోచోట 60 వేల రూపాయల సెంట్రింగ్ సామానును దొంగలు ఎత్తుకెళ్తారు.
మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న బాటరీ షాపులో లక్ష యాబై వేల విలువైన బ్యాటరీలు ఎత్తుకెళ్లారు. మరో పాన్ షాపులో 50 వేలు, పౌల్ట్రీ ఫారంలో 30 వేల విలువైన వస్తువులను దోచుకెళ్లారు. వరుస దొంగతనాలు జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదంటూ వ్యాపారస్తులు బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీసులు రాస్తారోకో చేస్తున్న వ్యాపారులతో మాట్లాడి దొంగలను పట్టుకుంటామని, గస్తీని ముమ్మరం చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. రాస్తారోకోకు ఎంపిటిసి బాబా మద్దతు తెలిపారు.