మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న మైథలాజిక్, ఫాంటసీ చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో విష్ణు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలకు ఎంత మంచి స్పందన వచ్చిందో కొంత విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమాలో చూపించిన లింగం ఆకారంపై పలువురు విమర్శలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు ఈ విషయంపై స్పందించారు.
ప్రపంచంలో వాయు లింగం ఉన్న ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి అని.. అసలు శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చిందో కూడా తెలుసుకోకుండా కొందరు విమర్శలు చేస్తున్నారని విష్ణు మండిపడ్డారు. గతంలో వచ్చిన సినిమాల్లో లింగాన్ని తమకు నచ్చిన విధంగా చూపించారని.. కానీ, తన సినిమాలో చూపించిన లింగాకారమే దేవాలయంలో ఉంటుందని పేర్కొన్నారు. ఒక ఆర్టిస్టు కొన్ని రోజుల పాటు శ్రమించి అక్కడి పూజారులతో మాట్లాడి లింగాన్ని డిజైన్ చేశారని.. దాని ఆధారంగానే మేము లింగాన్ని చూపించామని విష్ణు వెల్లడించారు.
ఇక కన్నప్ప సినిమాను ‘మహాభారతం’ సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. ప్రభాస్, మోహన్‌బాబు, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.