Wednesday, January 22, 2025

సారా తాగితే చస్తారు.. చచ్చారు: బీహార్ సిఎం

- Advertisement -
- Advertisement -

పాట్నా: బీహార్‌లో కల్తీసారా సేవనంతో ఇప్పుడు మృతుల సంఖ్య 39 దాటింది. ఈ దారుణంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందిస్తూ.. ‘ఫుల్లుగా ఈ విధంగా సారా తాగితే చావకుండా ఉంటారా? చస్తారు’ అని గురువారం వ్యాఖ్యానించారు. బీహార్‌లో ఇప్పుడు మద్యనిషేధ విధానంపై సర్వత్రా వివాదాలు నెలకొన్నాయి. మద్యనిషేధం అమలులో ఉండటంతో పేదలు ఎక్కువగా మురికివాడల వారు కల్తీసారాకు, నాటుసారాకు అలవాటుపడుతున్నారు. కొన్ని ముఠాలు విచ్చలవిడిగా జనాల బలహీనతలను ఆసరాగా చేసుకుని కల్తీ మద్యం విక్రయాలు సాగిస్తున్నాయి.

రాష్ట్రంలోని సరాన్ జిల్లాలో దాదాపు 40 మంది వరకూ కల్తీ సారా తాగినట్లు నిర్థారణ అయింది. దీనిపై సిఎం స్పందిస్తూ ఆల్కహాల్ తాగితే చస్తారు, మన ముందే ఇప్పుడు ఈ చావు ఘటనలు సజీవ ఉదాహరణలుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లిక్కర్ నిషేధం ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉందని, దయచేసి ప్రజలు సారా మద్యం జోలికి వెళ్లరాదని తాను విజ్ఞప్తి చేస్తున్నానని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా కల్తీసారా తయారీకి దిగుతున్న వారిని గుర్తించి పట్టుకోవాలని, సారా వ్యాపారాలను నిర్వహించే వారిపనిపట్టాలని గురువారం నితీశ్ అధికారులను ఆదేశించారు. సారా సేవించడం ఆరోగ్యానికి చేటు కల్గిస్తుందని, దీనిని మానుకోవాలని సిఎం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అయినా ప్రాణాల మీదికి తెచ్చుకునేలా కల్తీసారా తాగితే చావకుండా ఉంటారా? అని ప్రశ్నించారు. సరాన్ కల్తీసారా కలవరంపై సిఎం స్పందించారు. 2016లో బీహార్‌లో మద్యనిషేధం అమలులోకి వచ్చింది. ఈ విధానానికి తాము కట్టుబడి ఉన్నామని సిఎం స్పష్టం చేశారు. పేదలు తాగుతున్న మాట వాస్తవమే, అయితే అధికారులు తాగిన వారిని పట్టుకోవడంలో తీరిక లేకుండా ఉంటున్నారు. కానీ ఇది కాదని, ముందు లిక్కర్ బిజినెస్‌లో ఉన్న వారిని పట్టుకుని తీరాలని తాను యంత్రాంగాన్ని ఆదేశిస్తున్నానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కొందరు తమ సారాయి వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, జీవనోపాధి పోతోందని చెపుతున్నారని, ఇటువంటి వారికి ముందు వేరే వ్యాపారాలు పెట్టుకోవడానికి కనీసం లక్ష రూపాయలు ఇస్తామని ఆ తరువాత ఈ కోటా పెంచుతామని, ముందు సారా తయారీ మానాలని స్పష్టం చేశారు.

మద్యనిషేధంతో రాష్ట్రంలో ఇప్పటికే అత్యధిక సంఖ్యలో జనం ఆల్కహాల్‌కు దూరం అయ్యారని, అయితే ఇప్పటికీ చిక్కులు తెచ్చిపెట్టే వారు ఉన్నారని, వీరిని గుర్తించి లోపలేయాలని తాను అధికారులను ఆదేశించానని చెప్పారు. ఇక కల్తీసారా తాగి మరణించిన వారికి పరిహారం ఇవ్వాలనే డిమాండ్‌ను ప్రస్తావిస్తూ ఇటువంటి ఘటనపై విచారం వ్యక్తం చేయడం జరుగుతుందని, ఆయా ప్రాంతాలకు అధికారుల బృందాలు వెళ్లడం, ప్రజలకు సారా మానాలని నచ్చచెప్పడం వంటివి జరుగుతాయని అంతకు మించి పరిహారం కుదరదని సిఎం స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News