గుడిహత్నూర్ : మండలకేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజాప్రతినిధులు హాజరు కాకపోగా కోరం లేని కారణంగా సభను వాయిదా వేశారు. పదకొండు గంటలకు ప్రారంభం కావాల్సిన సర్వసభ్య సమావేశానికి జడ్పిటిసి సభ్యుడు పతంగే బ్రహ్మానంద్, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపిడిఓ సునీతతో పాటు ఎనిమిది శాఖల అధికారులు ఈ సమావేశానికి వచ్చారు.
కానీ మండలంలోని ఎంపీపీతో సహా మిగితా ఎంపిటిసిలు , 26 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, పదకొండున్నర గంటల వరకు హాజరు కాలేదు. ప్రజాప్రతినిధులు ఎవరూ హాజరు కాకపోవడంతో కోరం లేని కారణంగా సభ వాయిద వేస్తున్నట్లు ఎంపిడిఓ సునీత ప్రకటించారు. కొద్దిసేపటికి మండలంలోని గరకంపేట, తోషం తాండ గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు వచ్చినప్పటికి అప్పటికే సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో వారు కూడా వెనుతిరిగారు. గ్రామాల్లోని సమస్యలను అధికారులు దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాల్సిన ప్రజాప్రతినిధులే తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ సర్వసభ్య సమావేశానికి హాజరు కాకపోవడం పట్ల అధికారులు విస్మయానికి గురైయ్యారు.