హైదరాబాద్ : అల్లూరి పోరాట స్ఫూర్తితో ప్రజా పోరాటాలు ముందుండి నడపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, ఎన్.బాలమల్లేష్, ఎం.బాలనరసింహ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూమ్ భవన్‌లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పశ్య పద్మ, ఎన్ బాలమల్లేష్, బాల నరసింహలు ప్రసంగిస్తూ అల్లూరి సీతారామరాజు తన ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటిష్ పరాయి పాలనతో పోరాడి గొప్ప త్యాగం చేశారన్నారు. స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో అల్లూరి అమరత్వం అజరామమని కొనియాడారు. గిరిజనుల హక్కుల సాధన కోసం విల్లంబులు పట్టి పోరాడిన మహాయోధుడని వారన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకం గా అల్లూరి ప్రదర్శించిన అసమాన ధైర్య సాహసాలు పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తి అని పేర్కొంటూ ఆ స్ఫూర్తితో ప్రజా పోరాటాలకు సిపిఐ, ప్రజా సంఘాలు మరింత ముందుకు తీసుకుపోయే ప్రజా సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ నాయక్, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు యేసు రత్నం, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు, కే సహదేవ్, బోడ అంజయ్య, తాళ్లపల్లి లక్ష్మణ్, రాములు, ఎన్. నరసింహ, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.