Thursday, January 23, 2025

కులగణనతోనే జన క్షేమం

- Advertisement -
- Advertisement -

జన గణన ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు దిక్సూచిగా పని చేస్తుంది. ప్రజాస్వా మ్య దేశాల్లో సామాన్యుని సాధికారిత, యువజన సాధికారిత, మహిళా సాధికారిత సాధనకు జనగణన సమాచారాన్ని సమకూరుస్తుంది. భారత దేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి బృహత్తర జన గణన నిర్వహిస్తారు. 2021లో జరుగవలసిన జనగణన పదే పదే వాయిదా పడుతుంది. కొవిడ్ కారణంగా భారత్‌లో జన గణన వాయిదా పడినప్పటికీ, అమెరికా, చైనా, బ్రిటన్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలు మహమ్మారికి వెరువకుండ జనగణన కార్యక్రమాన్ని పూర్తి చేసి అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తూ ముందుకు వెళుతున్నా యి. భారత దేశంలో జన గణన చేపట్టాలన్న స్వచ్ఛంద సంస్థల, పౌర సమాజం చేస్తున్న ఆందోళన, ఒత్తిడిని ప్రభుత్వం పెడచెవిన పెట్టడం శోచనీయం.

మేము ఎంతో మా వాటా అంత అన్ననినాదంతో బిసి వర్గాలు చేస్తున్న పోరాటాలు, దేశవ్యాప్తంగా రాజ్యాధికారంలో బలహీన వర్గాల వాటా కోసం ఉద్యమాలు ఉధృతంగా సాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు ముగిసే దాకా వెనుకబడిన వర్గాల కుల గణన వాయిదా వేయాలని ప్రభుత్వం భావించడమే జన గణనలో అసాధారణ జాప్యానికి కారణమనే వాదనలు సామాజిక రాజకీయవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. 75 సంవత్సరాల స్వాతంత్య్ర భారత్‌లో జరిగిన అభివృద్ధి ఫలాలు, ప్రజా సంక్షేమ ఫలాలు, అన్ని వర్గాలకు సరైన విధంగా ఆశించిన స్థాయిలో అందని అంశాలు బయటపడతాయనే ఆందోళన జనగణన వాయిదాకు కారణం కావచ్చును అనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం జన గణన కార్యక్రమాన్ని వాయిదా వేయడం వల్ల దేశం లో పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, వలసలు, ఆకలి చావులు, బాల కార్మికులు గ్రామీణ, పట్టణ వ్యత్యాసాలు, విద్య, వైద్య సౌకర్యాలు, అవస్థాపన సౌకర్యాలు, ప్రాంతీయ అసమానతల వ్యాప్తి ని, తీవ్రతను అంచనావేయలేకపోవడం వల్ల అభివృద్ధి మందగిస్తుంది.

జన గణన సమాచారం ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ నిధులు, ఇతర వనరుల కేటాయింపు, నియోజక వర్గాల హద్దుల నిర్ణయం, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, ఆర్థిక వికేంద్రీకరణ, స్థానిక సంస్థల సాధికారిత, సహజ వనరుల వినియోగం, వనరుల కేటాయింపు, పంపిణీ ఏ విధంగా జరుగుతుంది అనే సమాచారం తెలుస్తుంది. గ్రామ, పట్టణ, మున్సిపల్ వార్డ్ స్థాయిలో విద్య, వైద్యం, తాగు నీరు, రవాణా, రోడ్లు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమాచారం జనగణన ద్వారా తెలుసుకోగలరు. 1990 సంవత్సరంలో భారత్‌లో లింగ నిష్పత్తి దెబ్బతింటుందని జనగణన ద్వారానే తెలిసింది. గర్భంలో పెరిగేది ఆడ పిల్ల అని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడటం వల్ల స్త్రీ, పురుష నిష్పత్తిలో అసమానతలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం ఆడ శిశువుల హననాన్ని నిషేధించింది. బేటీ బచావో, బేటీ పడావో వంటి కార్యక్రమాలకు దేశంలో ఆర్థికంగా, పారిశ్రామికంగా వెనుకబడిన జిల్లాల గుర్తింపు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలకు జనగణన ప్రేరణగా నిలిచింది. జాతీయ స్థాయిలో ప్రభుత్వ పంపిణీ వ్యవస్థకు, పేదలకు ఉచిత ఆహార పంపిణీ, గ్యాస్ కనెక్షన్ ఆహార భద్రత చట్టానికి జన గణన వల్ల వచ్చిన సమాచారం చాలా ఉపయోగపడ్డది.

కుల గణన ఒక ప్రజాస్వామిక అవసరం. భారత దేశ జనగణన బ్రిటిష్ వారు పన్నుల వసూలు కొరకు 1866లో చేశారు. బ్రిటిష్‌వారు 1931 వరకు కులాల వారి జనగణన పద్ధతిని కొనసాగించారు. జనాభాలో కుల గణన చివరిసారి బ్రిటిష్ వాళ్ళ హయంలోనే జరిగింది. నేటి వరకు భారత ప్రభుత్వం దగ్గర బ్రిటిష్ వారు చేసిన కుల గణన సమాచారమే అందుబాటులో వుండం వెనకబడిన కులాల అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి వున్న నిర్లక్ష్యానికి నిదర్శనం. దేశంలోని వివిధ రకాల సామాజిక కులాల సంక్షేమం కోసం అమలవుతున్న పథకాలు రాజ్యాంగ నిర్మాణ అనంతరం అమలు అవుతున్న రిజర్వేషన్స్ గత 90 యేళ్ల నాటి కులాల డాటా (సమాచారం)నే ప్రాతిపదిక కావడం శోచనీయం. హరిజన, గిరిజనులకు వారి జనాభా ఆధారంగా రిజర్వేషన్స్ అమలు చేయాలన్న రాజ్యాం గ నియమావళి మాత్రమే అమల్లో ఉంది. 1931 నాటి జనగణన ప్రకారం బిసి కులాల జనాభా 62 శాతం ఉన్నట్లు మండల్ కమిషన్ తేల్చింది. జనగణన ద్వారా దేశ మానవ వనరుల అభివృద్ధి, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులు మానవాభివృద్ధికి వనరులకు మధ్య సమతుల్యత ఏర్పడే అవకాశం ఉంది.

దేశ వ్యాప్తంగా జనగణనలో కుల గణన చేయాలన్న డిమాండ్ ఊపందుకున్నది. కుల గణన చేపట్టడానికి జనగణన అంశాలలో కులగణన అంశాన్ని అదనంగా చేర్చితే సరిపోతుంది. అనేక పార్టీలు సామాజిక కుల సంఘాలు కుల ఆధారిత జనగణన కోసం ఒత్తిడి చేశాయి.2011 జనాభా లెక్కల సందర్భంలో బలంగా చేసిన డిమాండ్‌ను 2018లో కుల గణన కొరకు ప్రభు త్వం ఒప్పుకుంది. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కులగణన సమాచారాన్ని ఇవ్వలేమని పాలనపరమైన చిక్కులు, సంక్లిష్టత ఉందని కుల గణన సమాచారాన్ని బయటకు చెప్పడం సున్నిత అంశమని అనాసక్తి వ్యక్తం చేసింది. కులగణన ద్వారా దేశంలో కులతత్వం పెరుగుతుందని, కుల వ్యవస్థ సుస్థిరతకు దోహదపడుతుందనే భావన కలుగుతుందని సాకులు చెబుతుంది.

కేంద్ర ప్రభుత్వ వైఖరి బిసి వర్గాలకు అశనిపాతంగా పరిణమించింది. సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఆయా నియోజక వర్గాల్లో కులం ఆధారంగా, జనాభా కుల ఓటర్ల ఆధారంగా, అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయిస్తున్నారు. అప్పుడు కులతత్వం అడ్డురాదా? కులగణనచేస్తేనే కుల వ్యవస్థ బలపడుతుందా? రాజకీయ పార్టీలు అవలంబించే ద్వంద్వ వైఖరి సరైంది కాదు. కులాల ఆధారంగా జనాభా లెక్కలు జరిగితే రిజర్వేషన్ పరిధి 50శాతం పైగా పెంచాలన్న డిమాండ్ ఉధృతమవుతుంది. విద్య, వైద్య, రాజకీయ రంగాల్లో మరింత ప్రాతినిధ్యం పెంచాలన్న డిమాండ్ పెరుగుతుందన్న అక్కసు ప్రభుత్వానికి వుంది. 2020 సంవత్సరంలో దేశ జనాభాలో 10 శాతం దగ్గర 74.3 శాతం సంపద, 40 శాతం జనాభా దగ్గర 22.9 శాతం, మరో 50 శాతం జనాభాకు కేవలం 2.8 శాతం సంపద వుందని పేర్కొంది. 2018 సావిత్రి భాయి ఫూలే జెఎన్‌యు దళిత స్టడీస్ సంస్థ జరిపిన అధ్యయనంలో సంపద యాజమాన్యం అసమానతలు సామాజికపరమైన అంశాలు అధ్యయనంలో ఇలాంటి వాస్తవాలు బయటపడ్డాయి.

సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో కొత్తగా రిజర్వేషన్లు ఇవ్వాలంటే విశ్వసనీయమైన గణాంకాలు వుండాలని ఇది రాజ్యాంగ అనివార్యం అని ప్రభుత్వానికి సూచించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, సెన్సెస్ కమిషనర్ కేంద్ర గణాంక కార్యాలయం, జాతీయ గణాంక కమిషన్ల సమన్వయంతో జనగణనలో భాగంగా కులగణన చేపట్టడానికి కార్యాచరణ ప్రణాళికను అమలు చెయ్యాలి. ప్రభుత్వం ఆధునిక డిజిటల్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు ఉపయోగించి కులాలవారీ డేటా సమాచారాన్ని సేకరించాలి. జాతీయ గణాంక కమిషన్‌ను చట్టబద్ధత, స్వతంత్ర ప్రతిపత్తి కలిపించాలి. జనగణన, కుల గణనను నిర్దిష్ట కాల వ్యవధిలో నిర్వహించే విధంగా చట్టం చెయ్యాలి. జనగణనలో కుల గణన రాజ్యాంగ అనివార్యత, ఏయే కులాలు ఎంత మేరకు లబ్ధి పొందాయి? వాటి సామాజిక, ఆర్థిక స్థితిగతులు ఏమిటి? ఆయా వ్యవస్థల్లో వారి ప్రాతినిధ్య ఎలా వుంది? రాజ్యాంగంలో వారికి ఇచ్చిన హక్కులు ఏ మేరకు నెరవేరాయి? ఉల్లంఘించబడ్డాయా సమీక్షించాలి. జనగణనలో కులగణన చేయడం వల్ల రాజ్యాంగ లక్ష్యాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక, ఆర్థిక పంపిణీ, న్యాయం సిద్ధించి ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. సకాలంలో జనగణన నిర్వహించి సమాచారాన్ని సేకరించకపోతే పేదలకు సంక్షేమ పథకాల ఫలాలు ఎండమావులయ్యే ప్రమాదం వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News