స్పష్టం చేస్తున్న కాగ్ నివేదిక
మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం, ఖర్చు, ఆర్థ్ధిక నిర్వహణ, అభివృద్ధి పథకాలకు నిధులను ఖర్చు చేసే విధివిధానాలపై ఎల్లప్పుడూ అక్షింతలు వేసే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సి.ఏ.జి-కాగ్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల సానుకూలంగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వం ఆర్థ్ధికంగా సహకరించకపోయినప్పటికీ ఆదాయాన్ని సముపార్జించుకోవడంలోనూ, ఆ నిధులను బడ్జెట్ ప్రాతిపదికగా ఖర్చు చేయడంలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థ్ధికశాఖ అనుసరించిన విధానం భేషు గ్గా ఉందని కాగ్ నివేదిక గణాంకాలు చెబుతున్నాయి. గత నెల జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కు 6,874 కోట్ల 96 లక్షల రూపాయల నాన్-ట్యాక్స్ రెవెన్యూ (పన్నేతర ఆదాయం) వచ్చిందని, ఈ కేటగిరిలో గత ఏడాది జూన్‌లో 2.96 శాతం మాత్రమే ఆదాయం రాగా ఈ ఏడాది గత జూన్ నెలలో 27.04 శాతం అధికంగా ఆదాయం వ చ్చిందని కాగ్ పేర్కొంది. జిఎస్‌టి తెలంగాణ సర్కార్ పనితీరు బాగుందని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. గత జూన్ నెలలో జిఎస్‌టి వసూళ్లు రూ.9,645 కోట్ల 14 లక్షలు (22.86 శాతం) ఉందని, ఇదే గత ఏడాది జూన్‌లో 18.70 శాతం వర కూ జిఎస్‌టి వసూళ్లు ఉన్నాయని, గత ఏడాది కంటే ఈ ఏడాది 4.16 శాతం ఎక్కువగా ఉంది.
కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్- నిధులు సుమారు 5,400 కోట్లు (9.05 శా తానికి పైగా) రావాల్సి ఉండగా గత జూన్ నెలలో కేవలం 1425 కోట్ల 71 లక్షల రూపాయలు (3.48 శాతం) వచ్చాయని, అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ వ్యయం 3.12 శాతం అధికంగానే ఉందని కాగ్ తెలిపింది. గత ఏడాది జూన్‌లో 17.05 శాతం రెవెన్యూ వ్యయం ఉండ గా ఈ ఏడాది జూన్‌లో 20.17 శాతం (రూ. 38,176.46 కోట్లు) వరకూ రెవె న్యూ వ్యయం ఉందని కాగ్ తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం రుణాల సేకరణపై కేంద్ర ప్ర భుత్వం అనేక కుంటిసాకులు చెప్పి వచ్చే నిధులను నిలిపివేయించడంతో ఆ మేరకు క్యా పిటల్ వ్యయం (అభివృద్ధి ప థకాలు) కింద ఖర్చు బాగా తగ్గింది. గత ఏడాది క్యాపిటల్ వ్యయం 14.31 శాతం ఉండగా ఈ ఏడాది జూన్‌లో 8.06 శాతం (రూ.2396 కోట్లు) మాత్రమే ఉంది. రాష్ట్రప్రభుత్వం సొంత ఆదాయ వనరుల నుంచి సేకరించిన నిధులను అంచనాలకు మించి ఖర్చు చేసినప్పటికీ రుణాల సేకరణలకు కేంద్ర ప్రభు త్వం అడ్డుపుల్లలు వేయడంతో రావాల్సిన నిధులు రాకపోవడం మూలంగా అభివృద్ధి పథకాలకు ఖర్చు చేసే క్యాపిటల్ వ్యయం బాగా తగ్గిందని కాగ్ గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి.
ప్రస్తుత ఆర్థ్ధిక సంవత్సరం ప్రారంభంలో ఏప్రిల్, మే నెలల్లో రుణాల సేకరణకు కేంద్ర ప్రభుత్వం రూల్సు మార్చడం మూలంగా, అనేక కుంటిసాకులతో రుణాలిచ్చే ఆర్థ్ధిక సంస్థలపై ఆంక్షలు విధిస్తూ తెలంగాణకు రావాల్సిన రూ.10,200 కోట్ల నిధులు రాకుండా అడ్డుకున్నందు వల్లనే క్యాపిటల్ వ్యయం తగ్గిందని ఆర్థ్ధికశాఖలోని సీనియర్ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. రుణాల సేకరణకు కేంద్రం విధించిన ఆంక్షలు, కొర్రీలు, లోపభూయిష్టమైన రూల్సు మూలంగా తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని తాము ఎంత మొత్తుకున్నా వాటిని విమర్శలుగా చూశారని, అధికార టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు విమర్శలు చేస్తే వాటిని రాజకీయపరమైన విమర్శలుగా కొట్టిపారేసిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు కాగ్ నివేదిక సారాంశాన్ని చూసైనా తమ నిర్వాకాల మూలంగా తెలంగాణ వంటి కొత్త రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడిందో అర్ధంచేసుకోవాలని వారు కోరుతున్నారు. అప్పులు తెచ్చుకోవడానికి అడ్డుపుల్లలు వేసిన కేంద్రం చివరకు న్యాయంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్- ఇన్- నిధులను కూడా ఇవ్వకుండా కోతలు విధించినట్లుగా కాగ్ నివేదిక గణాంకాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయని ఆ అధికారులు వివరించారు.
దీనికితోడు నీతి ఆయోగ్, 14వ ఆర్ధిక సంఘం, 15వ ఆర్ధిక సంఘం సిఫారసులు చేసిన 34,153 కోట్ల రూపాయల నిధులను కూడా ఇవ్వకుండా కేంద్రం సతాయిస్తున్నదని, ఆ నిధులు కూడా వస్తే తెలంగాణలో అభివృద్ధి పథకాలకు ఎలాంటి ఢోకా లేకుండా ఖర్చు చేసే అవకాశం ఉండేదని, అదే జరిగితే క్యాపిటల్ వ్యయం రికార్డుస్థాయిలో ఉండేదని ఆ అధికారులు వివరించారు. కేంద్రం ఆంక్షలు విధించకుండా, రుణాల సేకరణలకు న్యాయ విరుద్ధమైన షరతులు విధించకుండా యధావిధిగా తమ ప్రభుత్వానికి అనుమతులిస్తూ వచ్చినట్లయితే ఈ మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులకు కొరత ఏర్పడేది కాదని వివరించారు.