5 నుంచి ఇంటర్ పరీక్షలు 21 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ఓ వైపు
అకడమిక్.. మరో వైపు పోటీ పరీక్షలు ఒత్తిడి దూరంగా ఉండాలి
పోషకాహారం.. సరిపడా నిద్ర అవసరమంటున్న నిపుణులు
మనతెలంగాణ/హైదరాబాద్ : పరీక్షల కాలం మొదలైంది. విద్యార్థులు తమలోని సత్తా చాటేలా సర్వసన్నద్దమయ్యేందుకు ఇది అత్యంత కీలక సమయం. ఓ వైపు వార్షిక పరీక్షలు సమీపిస్తుండగా, మరోవైపు ప్రవేశ పరీక్షల తేదీలూ దగ్గరపడుతుండటం విద్యార్థులకు సవాల్‌గా మారుతుంది. ఈ రెండింటినీ సమతుల్యం చేసుకునేలా విద్యార్థులు తమను తాము సమాయత్తం చేసుకోవడంతో పాటు పక్కా ప్రణాళికలతో సన్నద్ధం కావడం అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మార్కులే ప్రామాణికంగా ఇప్పటికే విద్యార్థులపై ఒత్తిడి మొదలైంది.
5 నుంచి ఇంటర్, 21 నుంచి టెన్త్ పరీక్షలు
పది, ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అధికారులు, పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసే దిశగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ముగియగా, ఈ నెల 5 వరకు వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 21 నుంచి పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 9,96,971 మంది విద్యార్థులు హాజరయ్యే ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పకడ్బంధీగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల కోసం 1,532 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఇంటర్‌తో పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధం
ఇంటర్మీడియేట్ ద్వితీయ సంవత్సరం చదివే సైన్స్ గ్రూప్‌లకు చెందిన విద్యార్థులు వార్షిక పరీక్షలతో పాటు జెఇఇ మెయిన్, అడ్వాన్స్‌డ్, నీట్‌తో పాటు ఎప్‌సెట్, ప్రైవేట్ ఇంజనీరింగ్ పోటీ పరీక్షలకు హాజరవుతుంటారు. ఈ విద్యార్థులు ఒక వైపు అకడమిక్ చదువులు కొనసాగిస్తూనే మరో వైపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇప్పటికే తొలి జెఇఇ మెయిన్ పూర్తి కాగా, ఏప్రిల్‌లో 1 నుంచి 8 వరకు రెండో విడత జెఇఇ మెయిన్ జరగనుంది. బైపిసి విద్యార్థులు నీట్‌తో పాటు ఎప్‌సెట్‌కు సన్నద్ధమవుతుంటారు. మే 4వ తేదీన నీట్ పరీక్ష జరగనుంది. అయితే వార్షిక పరీక్షలకు సన్నద్దమవుతునే పోటీ పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇందుకోసం పక్కా ప్రణాళికతో రెండింటీని సమతుల్యం చేసుకుంటూ సిద్ధం కావాలని నిపుణులు చెబుతున్నారు. ఉన్నత విద్యకు సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే, జూన్ నెలల్లో పలు పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు, మే 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అదే విధంగా జూన్ 6న లాసెట్, మే 12న ఇసెట్, జూన్ 8,9 తేదీలలో ఐసెట్, జూన్ 16 నుంచి 19 వరకు పిజిఇసెట్ పరీక్షలు జరుగనున్నాయి.
ఒత్తిడిని అధిగమించాలి..
పరీక్షలంటే విద్యార్థుల్లో కొంత టెన్షన్, బెరుకు ఉండటం సహజం. వాటిని ఎదుర్కొని ప్రశాంతంగా పరీక్షలు రాస్తే అనుకున్న లక్ష్యం నెరవేరినట్టే. జ్ఞాపక శక్తి తగ్గడానికి ప్రధాన కారణం ఒత్తిడి. ఏ పని చేసినా ఆందోళనతో చేయడం.. హడావుడిగా మాట్లాడటంతో డిప్రెషన్ అధికమవుతుంది. అది మనసుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. హోంవర్క్, పరీక్షల మార్కులపై ఒత్తిడి తెస్తే చాలా ప్రమాదం. ఒత్తిడితో బాధ పడే వారు మతిమరుపునకు గురయ్యే అవకాశం ఉంది. సరిపడా నిద్ర, మంచి ఆహారం, ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. అనవసర విషయాలు పట్టించుకోకుండా లక్ష్యం వైపు అడుగులు వేయాలి. –
నిద్ర ఎంతో ఉపశమనం
పరీక్షలు దగ్గరపడుతున్న కొద్దీ విద్యార్థులు కేవలం చదువుపైనే దృష్టి పెట్టి మంచి ఉత్తీర్ణత సాధించాలని అహర్నిశలు కృషి చేస్తుంటారు. చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోరు. దీంతో పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అలసిన శరీరానానికి నిద్ర ఎంతో ఉపశమనం ఇస్తుందని, ప్రతి రోజూ ఎనిమిది గంటల పాటు నిద్ర ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
పోషకాహారం కీలకం..
పోషకాహారం తీసుకోవడం అత్యవసరం. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం సూక్ష్మ పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. పరీక్షల సమయంలో సరైన ఆహారం తీసుకోక పోతే అనేక అనర్థాలు కలుగుతాయి. చదివింది గుర్తుండాలన్నా ఆరోగ్యంగా ఉండాలి. –